మెదక్‌ నియోజకవర్గంలో వంద మందికి దళితబంధు

ABN , First Publish Date - 2022-02-10T05:30:00+05:30 IST

భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా దళితుల గౌరవం పెంచుతూ, ఆర్థికంగా ఆదుకోవాలనే మంచి సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని టీఆర్‌ఎస్‌ పార్టీ మెదక్‌ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు.

మెదక్‌ నియోజకవర్గంలో వంద మందికి దళితబంధు
మాట్లాడుతున్న ఎమ్మెలే ్య పద్మాదేవేందర్‌రెడ్డి

 పైలెట్‌ ప్రాజెక్టుగా ఆరు గ్రామాలు ఎంపిక 

మున్సిపాలిటీల్లో కూడా లబ్ధిదారుల ఎంపిక

త్వరలోనే నూతన కలెక్టరేట్‌ ప్రారంభం

ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి 


 మెదక్‌ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 10: భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా దళితుల గౌరవం పెంచుతూ, ఆర్థికంగా ఆదుకోవాలనే మంచి సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని టీఆర్‌ఎస్‌ పార్టీ మెదక్‌ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మెదక్‌ నియోజకవర్గంలో దళితబంధు అమలు చేయడానికి మెదక్‌ మండలానికి చెందిన కొంటూర్‌ గ్రామం, హవేళీఘనపూర్‌ మండలానికి చెందిన జక్కన్నపేట, పాపన్నపేట మండలానికి చెందిన అబ్లాపూర్‌, రామాయంపేట మండలానికి చెందిన శివాయిపల్లి, లింగంపేట మండలానికి చెందిన రాంపూర్‌, శంకరంపేటకు చెందిన చందంపేట గ్రామాల్లో ఉన్న దళితులందరికీ ఈ పథకాన్ని అందజేసేందుకు నిర్ణయించారని తెలిపారు. పైలెట్‌ ప్రాజెక్టుగా ఈ ఆరు గ్రామాల్లో పూర్తిస్థాయిలో దళితులందరికీ రూ.10లక్షల చొప్పున పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో ఇచ్చే ఈ నిధులతో ఒక యూనిట్‌ లక్ష్యంగా వ్యాపారాలు, సంస్థలను ఏర్పాటు చేసుకునేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తారన్నారు. మార్చిలో మున్సిపాలిటీల్లో కూడా దళితబంధు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు.


ఏప్రిల్‌లో జిల్లా కేంద్రానికి రైలు కూత

అక్కడక్కడ అసంపూర్తిగా ఉన్న అక్కన్నపేట-మెదక్‌ రైల్వేలైను పనులను త్వరితగతిన పూర్తి చేసి ఏప్రిల్‌లో మెదక్‌ ప్రజలకు రైలు కూత వినిపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే పద్మారెడ్డి తెలిపారు. గత బుధవారం మంత్రి హరీశ్‌రావు సమక్షంలో నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. రైల్వేలైన్‌ నిర్మాణ పనులకు రూ. 10 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందన్నారు. పనులు వెంటనే పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు రైల్వే అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.  జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్‌ భవనాన్ని కూడా ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గానికి ఎన్‌ఆర్‌ఈబీఎ్‌స కింద రూ.15కోట్లు మంజూరైనట్లు స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కింద  రూ.3కోట్లు మంజూరయ్యాయని,  గోసముద్రం నిర్మాణంలో ఉన్న మినిట్యాంక్‌బండ్‌ను పూర్తి స్థాయిలో చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.  ఎమ్మెల్యే వెంట జడ్పీ వైస్‌చైర్‌పర్సన్‌ లావణ్యరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, మాజీ వైస్‌ చైర్మన్‌ రాగి అశోక్‌, కౌన్సిలర్‌ వంజరి జయరాజ్‌, లక్ష్మీనారాయణగౌడ్‌, భీమరి కిషోర్‌, నాయకులు గంగాధర్‌, శ్రీనివాస్‌ రెడ్డి, శ్రీధరి, యాదవ్‌ ఉన్నారు. 

Updated Date - 2022-02-10T05:30:00+05:30 IST