Darshit: చిన్నారి దర్షిత్‌కు సీరియస్.. వైద్యులు ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2022-11-25T16:18:02+05:30 IST

విద్యుదాఘాతానికి గురై రెండు కాళ్లు పోగొట్టుకున్న మూడేళ్ల చిన్నారి దర్షిత్(Darshit) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఐసీయూలోకి తరలించి

Darshit: చిన్నారి దర్షిత్‌కు సీరియస్.. వైద్యులు ఏమన్నారంటే..
దర్షిత్‌కు సీరియస్..

కాకినాడ: విద్యుదాఘాతానికి గురై రెండు కాళ్లు పోగొట్టుకున్న మూడేళ్ల చిన్నారి దర్షిత్(Darshit) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఐసీయూలోకి తరలించి జీజీహెచ్ డాక్టర్లు సేవలందిస్తున్నారు. మరోవైపు బాధితురాలి తల్లిని ఆస్పత్రిలో హోంమంత్రి వనిత(Home Minister Vanitha) పరామర్శించారు. తన బిడ్డను కాపాడాలని ఆ మాతృమూర్తి కన్నీటిపర్యంతం అయ్యింది. ఇంటి మేడపై వేలాడుతున్న విద్యుత్ తీగలను తొలగించాలని వేడుకున్నప్పుడే స్పందించి ఉంటే బిడ్డకు ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని హోంమంత్రి ముందు తల్లి రోదించింది.

తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పైడిమెట్ట గ్రామానికి చెందిన జొన్నకూటి దర్శిత్‌ మిలింద్‌ ఈనెల 12న డాబాపైకి తల్లి వెనకాలే వెళ్లి ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురైన సంగతి తెలిసిందే. అప్పటినుంచి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న దర్శిత్‌కు తీవ్ర గాయాలైన చోట ఇన్ఫెక్షన్‌ తీవ్రతరం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యులు బాలుని కాళ్లు రెండూ మోకాళ్ల వరకు తొలగించారు. ఇంతటి దయనీయ పరిస్థితిలో ప్లాస్టిక్‌ సర్జరీ వార్డులో బాలుడు నరకయాతన అనుభవిస్తూ చికిత్స పొందుతున్నాడు. బాలునికి మెరుగైన వైద్యచికిత్సలు అందిస్తూ ఆరోగ్యంగా కోలుకునేలా వైద్యులు విశేష కృషిచేస్తున్నారు. అయితే బాలుడి ఆరోగ్యం కొంతమేర మెరుగవుతుందన్న తరుణంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో బాలుడు శ్వాస పీల్చుకోవడం కష్టతరమవ్వడంతో ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో వైద్యులు హుటాహుటిన సర్జికల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌(ఎస్‌ఐసీయూ)కు తరలించి ప్రత్యేక వైద్య చికిత్స అందించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో గురువారం రాత్రి రెస్పిరేటరీ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌(ఆర్‌ఐసీయూ)-1కు తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. సంక్లిష్టంగా మారిన బాలుడికి అనస్తీషియా వైద్యులతో పాటు పలు విభాగాల వైద్యులు వైద్య చికిత్స అందిస్తున్నారు. 48 గంటలు గడిస్తేనే గానీ బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఏం చెప్పలేమని ప్లాస్టిక్‌ సర్జరీ వైద్యులు తెలిపారు. చిన్నారి బాలుడు త్వరగా కోలుకోవాలని ప్రజలు ప్రార్థిస్తున్నారు.

dar.gif

గతంలో హోంమంత్రికి ఫిర్యాదు..

ఇంటి మేడపై విద్యుత్‌ వైర్లు వేలాడుతున్నాయని గడపగడప కార్యక్రమానికి వచ్చిన హోంమంత్రి వనితకు బాధితురాలు విన్నవించింది. అప్పుడే ఆమె స్పందించి ఉంటే తన బిడ్డకు ఈ ఉపద్రవం రాకపోయేదని దర్శిత్ తల్లి కన్నీటిపర్యంతమైంది.

Updated Date - 2022-11-25T16:20:28+05:30 IST