JAGAN: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ

ABN , First Publish Date - 2023-07-05T18:07:40+05:30 IST

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజిబిజిగా ఉన్నారు.

JAGAN: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ
ప్రధాని మోదీ- సీఎం జగన్ ఫైల్ ఫొటో

ఢిల్లీ: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజిబిజిగా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం జగన్ సమావేశం ముగిసింది. పలు కీలక అంశాలపై మోదీతో జగన్ సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. మోదీతో జగన్ దాదాపు గంటకు పైగా సమావేశమయ్యారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నా.. తనపై సీబీఐ నమోదు చేసిన అక్రమాస్తుల కేసుల్లో కదలిక, చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య కేసులో ముమ్మర దర్యాప్తు, సార్వత్రిక ఎన్నికలే ఎజెండాగా ప్రధాని, షాలతో చర్చిస్తారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రంలో అవినీతి, అరాచకం రాజ్యమేలుతున్నాయని గత నెల 11న విశాఖ బహిరంగ సభలో అమిత్‌షా జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. గంజాయి, భూకబ్జాలు, ల్యాండ్‌ మాఫియా, లిక్కర్‌ మాఫియా చెలరేగుతున్నాయని.. విశాఖ భూరాబందుల కేంద్రంగా మారిందనీ ఆరోపించారు. ఇక తన చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచినప్పుడల్లా జగన్‌ హస్తినకు వెళ్లి మోదీ, షాలను కలవడం పరిపాటిగా మారింది.

ఈ కేసు దర్యాప్తును జూన్‌ 30లోగా పూర్తిచేయాలని సుప్రీంకోర్టు సీబీఐకి విధించిన గడువు ముగిసింది. సరిగ్గా అదే రోజు ఆయన తమ్ముడు, కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని ఎనిమిదో నిందితుడిగా పేర్కొంటూ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టులో అనుబంధ చార్జిషీటు దాఖలు చేసింది. అలాగే జగన్‌పై ఉన్న అక్రమాస్తుల కేసుల్లో జూలై 31లోగా డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు ముగించాలని సీబీఐ కోర్టు నిందితులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో మోదీ, షాలతో జగన్‌ బుధవారం సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

Updated Date - 2023-07-05T18:21:33+05:30 IST