APIIC lands : ఏపీఐఐసీ భూముల్లో పాగా
ABN , First Publish Date - 2023-08-09T04:11:49+05:30 IST
విశాఖపట్నంలో ఇప్పటికే వేల కోట్ల విలువైన భూములు చేతులు మారాయి. ప్రభుత్వ భూములు/ఆస్తులు ‘తాకట్టు’లోకి వెళ్లిపోయాయి. ఇక... ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ) అధీనంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లను ‘అస్మదీయులకు’ అప్పగించడానికి పక్కా ప్రణాళిక

నిర్వహణ బాధ్యతలు థర్డ్ పార్టీకి
అభివృద్ధి పనుల పేరుతో అస్మదీయులకు
‘ఐలా’ ప్రాధాన్యం తగ్గించిన వైసీపీ
కమిటీలు పెట్టి వాటి ద్వారా పనులు
వ్యతిరేకిస్తున్న పారిశ్రామిక వర్గాలు
మరింత భారం మోపుతారని ఆందోళన
(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నంలో ఇప్పటికే వేల కోట్ల విలువైన భూములు చేతులు మారాయి. ప్రభుత్వ భూములు/ఆస్తులు ‘తాకట్టు’లోకి వెళ్లిపోయాయి. ఇక... ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ) అధీనంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లను ‘అస్మదీయులకు’ అప్పగించడానికి పక్కా ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. విశాఖపట్నంలోని ఆటోనగర్, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పారిశ్రామిక పార్కుల్లో సుమారు రూ.వెయ్యి కోట్ల విలువైన ‘అభివృద్ధి’ పనులకు ప్రణాళిక రూపొందించి, వాటి బాధ్యతను ప్రభుత్వ పెద్దలకు చెందిన సంస్థలకు కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారు. వాస్తవానికి ఇప్పటివరకు ఇలాంటి విధానమే లేదు. దీని వెనుక ఏపీఐఐసీ స్థలాల్లో పాగా వేయాలనే కుట్ర ఉన్నట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్కుల్లోనూ ఇదే కథ నడుస్తున్నట్లు సమాచారం. ఏపీఐఐసీ అనేది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే రియల్ ఎస్టేట్ సంస్థలాంటిది. రెవెన్యూ శాఖ నుంచి భూములు సేకరించి, వాటిని లేఅవుట్లుగా మార్చి, మౌలిక వసతులు కల్పించి, వాటిని చదరపు మీటర్ల లెక్కన పరిశ్రమలకు అమ్ముతుంది. మొదట్లో ఆయా పారిశ్రామిక పార్కుల నిర్వహణ బాధ్యతలను కూడా ఏపీఐఐసీనే చూసేది. కానీ, 1994లో ‘ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ’(ఐలా)ని తీసుకొచ్చి పార్కుల నిర్వహణ బాధ్యతను వాటికి అప్పగించారు. ఆ పార్కులో ఉన్న పరిశ్రమల నుంచే కొందరిని పాలకవర్గంగా పెట్టి వాటిని నడుపుతున్నారు. ఆయా పార్కుల్లో ఉన్న పరిశ్రమల నుంచి పురపాలక సంఘం వసూలు చేసే అన్ని పన్నులను ఐలా వసూలు చేస్తుంది. అందులో 25 శాతం స్థానిక సంస్థ(నగర పాలక/పురపాలక/పంచాయతీ)కు చెల్లించి, మిగిలిన 75 శాతం నిధులను ఆయా పార్కుల్లో వసతుల అభివృద్ధికి వినియోగిస్తుంది. కేంద్రం ఎంఎ్‌సఎంఈ విభాగం నుంచి పారిశ్రామిక వ్యర్థాలు, ఆఫీసు నిర్వహణ కింద కొంత మొత్తం ఇస్తుంది. ఇలా అనేక పార్కులు ఏర్పాటై దశాబ్దాలు గడిచాయి. వాటిలో అనేకం అభివృద్ధి పథాన నడుస్తున్నాయి. అందులో గాజువాక సమీపంలో ఉన్న ఆటోనగర్ ఒకటి. దీనిలో సుమారుగా 1,200 చిన్న, పెద్ద పరిశ్రమలు ఉన్నాయి. ఏటా రూ.10 కోట్ల ఆదాయం వస్తుంది. రిజర్వ్ నిధులు రూ.30 కోట్ల వరకు ఉన్నాయి. పార్కులన్నీ పది నుంచి వంద ఎకరాల విస్తీర్ణంలో ఉంటాయి. వాటిలో ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులు చేపడుతుంటారు. వాటికి టెండర్లు పిలవడం, ఖరారు చేయడం, పనులు పర్యవేక్షించడం వంటి అన్ని పనులు ఐలా చూసుకుంటుంది.
వైసీపీ వచ్చాక మారిన పరిస్థితి...
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఐలా పాలక వర్గాలకు ప్రాధాన్యం తగ్గించేశారు. వారితో సంప్రదించకుండానే పార్కుల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. కొత్తగా ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్ ఎస్టిమేషన్ కమిటీ’లు ఏర్పాటుచేసి, పనులు చేపడుతున్నారు. ఆ కమిటీల్లో ఎవరున్నారు, ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటైందనేది పెద్ద రహస్యం. స్థానిక ఎమ్మెల్యే సిఫారసు, సీఎం పేషీ నుంచి ఫోన్లు చేయించిన వారికే పనులు దక్కుతున్నాయి. అది కూడా ఏదో అయ్యాయన్నట్టుగా పనులు జరిపిస్తున్నారనే ఆరోపణలు న్నాయి. తాజాగా గాజువాక ఆటోనగర్ పార్కులో రూ.200 కోట్ల విలువైన మౌలికవసతుల పనులకు ప్రణాళిక రూపొందించారు. వీటిని కొత్తగా ఏర్పాటుచేసిన కమిటీనే చూస్తోంది. అలాగే అచ్యుతాపురం పార్కులో రూ.900 కోట్ల పనులకు ప్రణాళిక రూపొందించారు. అక్కడ కూడా కమిటీనే నేతృత్వం వహిస్తోంది. గతంలో ఇలా జరగలేదని పారిశ్రామిక వర్గాలు ఆరోపిస్తున్నాయి.
అయిన వారికోసం....
విశాఖపట్నం సమీపంలో వైసీపీ పెద్దలకు చెందిన ఓ సంస్థ పెద్ద ఫార్మాసిటీ నడుపుతోంది. అనేక పరిశ్రమల్లో వ్యర్థాల నిర్వహణ బాధ్యతంతా ఆ కంపెనీకే కట్టబెడుతున్నారు. ఆ సంస్థ ఆ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించకుండా సమీప గ్రామాల్లో పారబోస్తూ చెరువులు, భూగర్భ జలాల కలుషితానికి కారణమవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సంస్థకే ఈ పార్కుల నిర్వహణ బాధ్యత అప్పగించాలని ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇప్పటివరకు పారిశ్రామిక పార్కుల్లో సమీప నగర పాలక/పురపాలక సంస్థలు ఏ ప్రాతిపదికన పన్నులు వసూలు చేస్తున్నాయో ఐలాలు కూడా అలాగే తీసుకుంటున్నాయి. ఇప్పుడు థర్డ్ పార్టీ వస్తే.. ఆదాయం కోసం పన్నులు పెంచే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆస్తి పన్నును పారిశ్రామికవేత్తలు చెల్లించలేకపోతున్నారు. ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడానికి భూముల విలువలు పెంచేస్తోంది. ఆ విలువలు ఏటా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు థర్డ్ పార్టీకి ఇస్తే మరింత పన్నులు వేస్తారని, దీంతో పరిశ్రమలు మూసుకోవడం తప్ప మరో గత్యంతరం ఉండదని పారిశ్రామికవేత్తలు వాపోతున్నారు. ఇప్పటికే విద్యుత్ చార్జీలు అధికంగా ఉన్నాయని, ఈ వ్యయాలన్నీ వేసుకొని తమ ఉత్పత్తులకు ధరలు నిర్ణయిస్తే.. వాటిని స్టీల్‌ప్లాంటు వంటి సంస్థలు తీసుకోవడం లేదని అనుబంధ పరిశ్రమల నిర్వాహకులు వాపోతున్నారు.