Share News

వైసీపీకి భారీ షాక్‌

ABN , Publish Date - Dec 24 , 2023 | 11:29 PM

ఎన్నికలు సమీపిస్తున్న వేళా జిల్లాలో అధికార వైసీపీకి వరుస షాక్‌లు వెంటాడుతున్నాయి.

వైసీపీకి భారీ షాక్‌
బుడ్డా సమక్షంలో టీడీపీలోకి చేరిన వైసీపీ శ్రేణులు

కురుకుందలో వైసీపీ ఖాళీ ఫ నంద్యాల 34వ వార్డులో టీడీపీలోకి చేరిక

బుడ్డా సమక్షంలో 200 కుటుంబాలు చేరిక

వ్యాపారాల కోసమే శిల్పాకు రాజకీయాలు

రాబోయే ఎన్నికల్లో శిల్పా అడ్రస్‌ గల్లంతు : బుడ్డా

ఫరూక్‌ ఆధ్వర్యంలో టీడీపీలోకి వలస

వైసీపీ పాలనతో అన్ని వర్గాలు విసిగిపోయాయి :ఫరూక్‌

వైసీపీ పాలనతో అన్ని వర్గాలు విసిగిపోయాయి :ఫరూక్‌

ఎన్నికలు సమీపిస్తున్న వేళా జిల్లాలో అధికార వైసీపీకి వరుస షాక్‌లు వెంటాడుతున్నాయి. ఇటీవల ఆత్మకూరు మండలంలోనే పెద్దగ్రామంగా పేరుగాంచిన కరివేనలో వైసీపీ నుంచి భారీగా టీడీపీలోకి జరిగిన చేరికలను మరువకముందే మరో అతిపెద్ద గ్రామమైన కురుకుందలో ఊహించని విధంగా టీడీపీలోకి భారీ చేరికలు కొనసాగాయి. ఈ రెండు చేరికలతో ఆత్మకూరు మండలంలో టీడీపీకి బలం చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. నంద్యాలో పట్టణంలోని 34వ వార్డులో ఆదివారం వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు.

ఆత్మకూరు, డిసెంబరు 24: మండల పరిధిలోని కురుకుంద గ్రామంలో వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. మాజీ సర్పంచ్‌ నూర్‌అహ్మద్‌(బాబు), మధు, విజయరామారావు ఆధ్వర్యంలో సుమారు 200 కుటుంబాలు వైసీపీని వీడి శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి సమక్షంలో టీడీపీలోకి చేరాయి. ఈ సందర్భంగా వారికి మాజీ ఎమ్మెల్యే బుడ్డా టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎక్కడి నుంచో వలస వచ్చి మాయమాటలతో గెలుపొందిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి రాబోయే ఎన్నికల్లో అడ్రస్‌ గల్లంతు కానుందని విమర్శించారు. ఎన్నికల ముందే వీఆర్‌ఎస్పీ ప్రాజెక్ట్‌కు కృష్ణాజలాలతో ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేయిస్తానని చెప్పి ఇంతవరకు పట్టించుకున్న దాఖలాలే లేవని అన్నారు. అలాగే గ్రామానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. వ్యాపారాల కోసమే శిల్పా లాంటి రాజకీయాలు చేస్తున్నారే తప్ప ప్రజల కోసం కాదని ఎద్దేవ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, శిల్పా లాంటి దొంగలను నమ్మవద్దని హితవుపలికారు. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో టీడీపీ సత్తా ఏంటో చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యే గెలిస్తే వీఆర్‌ఎస్పీ ఆయకట్టు స్థిరీకరణకు కృషిచేయడమే కాకుండా మైనార్టీ ఆసుపత్రిలో వైద్యులను, సిబ్బంది నియమించి అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. పార్టీలోకి చేరిన వారిలో గ్రామానికి చెందిన యూసూఫ్‌ ఖాన్‌, ఉస్మాన్‌, హబివుల్లా, ఇస్మాయిల్‌, రహంతుల్లా, రోషన్న ఉన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ గోవిందరెడ్డి, టీడీపీ ఆత్మకూరు మండల, పట్టణాధ్యక్షులు శివప్రసాద్‌రెడ్డి, వేణుగోపాల్‌, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు రజాక్‌, రాష్ట్ర నాయకులు హిదాయతుల్లా, టీడీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు కలిముల్లా, లీగల్‌ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిరాజు, అడ్వకేట్‌ కేశవరెడ్డి, నాయకులు అబ్దుల్లాపురం బాష, కొప్పరపు రవి, ఫకృద్దిన్‌, మల్లికార్జునరెడ్డి తదితరులు ఉన్నారు.

నంద్యాల నూనెపల్లె : పట్టణంలోని 34వ వార్డులో వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. వార్డు టీడీపీ ఇన్‌చార్జి అహమ్మద్‌ హుసేన్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. అహమ్మద్‌ హుసేన్‌ ఆధ్వర్యంలో భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు, యువత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, నంద్యాల అసెంబ్లీ ఇన్‌చార్జి ఎన్‌ఎండీ ఫరూక్‌ వైసీపీ శ్రేణులను సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పారు. ఈ సందర్భంగా ఫరూక్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పాలనతో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని అన్నారు. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చి అన్ని వ్యవస్థలను జగన్మోహన్‌రెడ్డి ఛిన్నాభిన్నం చేశారని విమర్శించారు. దోచుకోవడం, దాచుకోవడం తప్ప రాష్ట్ర అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం గాలికివదిలేసిందన్నారు. టీడీపీ ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చంద్రబాబు పాలనను కోరుకుంటున్నారని, అందుకే వైసీపీని వీడి టీడీపీలోకి రావడం శుభసూచకమని పేర్కొన్నారు.

Updated Date - Dec 24 , 2023 | 11:29 PM