మొత్తం అర్జీలు 1902
ABN , First Publish Date - 2023-03-07T01:12:45+05:30 IST
ప్రజాసమస్యలపై జేకేసీకు ఇప్పటివరకు వచ్చిన 1902 అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ మాధవీలత సూచించారు. దీనిపై సీఎం కార్యాలయం నుంచి పర్యవేక్షణ ఉన్న నేపథ్యంలో మరింత శ్రద్ధ వహించాలని సూచించారు. జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన

ఒక్క సోమవారం వచ్చినవే 157 విజ్ఞాపనలు
ఆయా సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలని కలెక్టర్ ఆదేశం
బొమ్మూరు, మార్చి 6: ప్రజాసమస్యలపై జేకేసీకు ఇప్పటివరకు వచ్చిన 1902 అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ మాధవీలత సూచించారు. దీనిపై సీఎం కార్యాలయం నుంచి పర్యవేక్షణ ఉన్న నేపథ్యంలో మరింత శ్రద్ధ వహించాలని సూచించారు. జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన స్పం దనలో 157 అర్జీలను కలెక్టర్‌తో కలిసి డీఆర్వో నరసింహులు, టూరిజం అధికారి స్వామినాయుడులు స్వీకరించారు. పలు సమస్యలపై వినతులు ఇచ్చేందుకు పెద్దసంఖ్యలో అర్జీదారులు కలెక్టరేట్‌కు విచ్చేయడంతో కార్యాలయం కిటకిటలాడింది. బొమ్మూరు లెప్రసీ కాలనీకు చెందిన పలువురు అంత్యోదయ పథకం ద్వారా తమకు బియ్యం అందడం లేదని కలెక్టర్‌కు తెలిపారు. అలాగే ధవళేశ్వరానికి చెందిన డి.సరోజిని తన భర్త గోపి మోసం చేసి మానసిక రుగ్మత కలిగిన సర్టిఫికెట్ కాకినాడ డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి తెచ్చారని, తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, తనపై మోపిన తప్పుడు సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరారు. జిల్లాస్థాయిలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
పందుల పెంపకందార్లు బెదిరిస్తున్నారు
మేం నామవరంలో ఉంటున్నాం. మా ఇంటి దగ్గర పందులు పెంపకం వల్ల ఇబ్బందిగా ఉంటోంది. అక్కడే వాటి మాంసం విక్రయిస్తున్నారు. దీనిపై సెప్టెంబర్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. ఎటువంటి స్పందన లేదు. ఫిర్యాదు చేసినందుకు పెంపకందార్లు మా అమ్మను బెదిరిస్తున్నారు. ఏం చేయాలో దిక్కు తోచడంలేదు. - యనమదుల వీరలక్ష్మి,
నామవరం, రాజానగరం మండలం
టిడ్కో ఇళ్ల పేరుతో మోసం.. న్యాయం చేయండి...
మేము రాజమహేంద్రవరంలో నివశిస్తాం. గతంలో స్పందనలో టిడ్కో ఇళ్ల కోసం అర్జీ ఇచ్చాం. ఓ వ్యక్తి ఇల్లు ఇస్తానని చెప్పి దఫాల వారీగా రూ.3.37 లక్షలు తీసుకున్నాడు. ఎన్నిసార్లు అడిగినా ఇల్లు వస్తుంది, కంగారు పడకండి అని నమ్మించాడు. డబ్బు ఇచ్చి 3 నెలల అయ్యింది. కనీసం డబ్బులు ఇవ్వమని అడిగితే కారణాలు చెప్పి సెల్ స్విచ్‌ఆఫ్ చేశాడు. ఆ వ్యక్తికి అధికారులతో కూడా పరిచయం ఉంది. కలెక్టర్ ద్వారా న్యాయం జరుగుతుందని వచ్చాం.
- పి.భవాని, యర్రాయమ్మ, గాయత్రి, నాగజ్యోతి, బాధితులు
స్థలం ఉంది ఇల్లు లేదు..
మేము ఇద్దరం దివ్యాంగులం. ఒకరికి కళ్లు కనిపించవు, మరొకరికి కాలు సరిగా లేదు. ప్రభుత్వం మాకు ఇళ్ల పట్టా ఇచ్చింది. కట్టుకోవడానికి సహాయం చేయమంటే రెండో దఫాలో ఇళ్లు కడతారు, అప్పటివరకు ఏం చేయలేమని సచివాలయం అధికారులు చెబుతున్నారు. మాకు గూడు, సరైన మరుగుదొడ్డి లేక అంగవైకల్యం వల్ల అవస్థలు పడుతున్నాం.
- ఆకుల రామకృష్ణ, పప్పల యేసుబాబు,
కామరాజుపేట, గోకవరం మండలం
జాన్ మృతిపై దర్యాప్తు చేయాలి..
తొర్రేడు గ్రామానికి చెందిన పల్లి జాన్‌బాబు అనుమాన స్థితిలో మృతి చెందాడు. ఇంటి నుంచి మాములుగా వెళ్లిన వ్యక్తి చనిపోవడానికి కారణం తెలియాలి. మృతుని తల్లిదండ్రులకు న్యాయం చేయాలి. పోలీసులు దర్యాప్తు చేయాలని కలెక్టర్‌ను కోరాం.
- బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు సుమంత్‌బాబు, కార్యదర్శి హత్తిరాం, మండల అధ్యక్షుడు ఏసు, మృతుని తల్లిదండ్రులు