Education Minister: ఏపీలో పాఠశాలల ప్రారంభంపై మంత్రి బొత్స ప్రకటన.. సీఎం జగన్ చేతుల మీదుగా జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ
ABN , First Publish Date - 2023-06-08T19:43:11+05:30 IST
జూన్ 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు (Schools) ప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Education Minister Botsa Satyanarayana) తెలిపారు.
విజయవాడ: జూన్ 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు (Schools) ప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Education Minister Botsa Satyanarayana) తెలిపారు. ఒక్కో విద్యార్ధికి సుమారు రూ. 2500 విలువైన జగనన్న విద్యా కానుక కిట్ ఇస్తున్నామని, విద్యా కానుక కిట్‌ను ఈ నెల 12న పల్నాడు జిల్లా క్రోసూరు గ్రామంలో సీఎం జగన్ (CM JAGAN) విద్యార్ధులకు అందచేస్తారని మంత్రి బొత్స వెల్లడించారు. విద్యా కానుక కోసం ప్రభుత్వం రూ. 1100 కోట్లను ఖర్చు చేస్తోందని మంత్రి చెప్పారు. పదవ తరగతి, ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఈ నెల 20న సీఎం జగన్ సత్కరిస్తారన్నారు.
రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానిస్తామని, ఈ నెల 28న నాల్గవ విడత అమ్మఒడి నిధులను సీఎం జగన్ విడుదల చేస్తారని చెప్పారు.
మొదటి దశలో 12 వేల పాఠశాలల్లో సాంకేతికత ద్వారా ఈ నెల 12 నుంచి విద్యను అందిస్తామని, విద్యార్థులు అభివృద్ధి చెందాలని మూడవ తరగతి నుంచి ఐదవ తరగతి, ఆరు నుంచి తొమ్మిది వరకు ప్రైమరీ జూనియర్‌ను ప్రవేశపెడుతున్నామని బొత్స అన్నారు. గోరు ముద్ద ద్వారా విద్యార్ధులకు మంచి భోజనం అందిస్తున్నామని, నూతన విద్యా విధానంలో మార్పులకు అనుగుణంగా ఏపీలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు.
పునాది నుంచే విద్యార్ధి ఎదుగుదలకు చర్యలు తీసుకుంటున్నామని, నిధుల గురించి ఎక్కడా రాజీపడడం లేదని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో తక్కువ ఉత్తీర్ణత వచ్చినా పాఠశాలపై ప్రత్యేక దృష్టి పెంచామని, 10వ తరగతి, ఇంటర్ పరీక్షల్లో విద్యార్ధులు తప్పితే మళ్లీ వారు అదే తరగతిలో చదువుకునే అవకాశం కల్పిస్తున్నామని, త్వరలోనే జీవో రాబోతుందన్నారు. ఇటువంటి విద్యార్థులకు అమ్మ ఒడి, విద్యాదీవెన కూడా ఇస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో 80 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు చేశామని, తమ పైన రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా పూర్తి పారదర్శకంగా చేశామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.