Somu Veerraju: ఉద్యోగులపై ప్రభుత్వం దొంగ దెబ్బ: సోము వీర్రాజు
ABN , First Publish Date - 2023-03-09T19:32:53+05:30 IST
ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం దొంగ దెబ్బ తీస్తోందని, ఉద్యమాలను అణిచి వేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు (Somu Veerraju) ఆరోపించారు.
విశాఖపట్నం: ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం దొంగ దెబ్బ తీస్తోందని, ఉద్యమాలను అణిచి వేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు (Somu Veerraju) ఆరోపించారు. ప్రభుత్వం హామీలు ఇచ్చి నెరవేర్చకపోవడంతో వాటి కోసం రాజకీయ పార్టీల మాదిరిగా ఉద్యోగులు ఉద్యమాలు చేయాల్సి వస్తోందన్నారు. ఉద్యోగులకు బీజేపీ (BJP) అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలను (MLC election) దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులకు ప్రభుత్వం కొన్ని ఆశలు కల్పించిందని, వాటికి లొంగిపోవద్దని వీర్రాజు హితవు పలికారు. ఉద్యోగులు సేవ చేయాల్సింది ప్రభుత్వానికే గానీ వైసీపీ (YCP)కి కాదన్నారు. ఉద్యోగులు డీఏ సంగతి దేవుడెరుగు...ఒకటో తేదీన జీతాలు వస్తే చాలనుకునే పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వ సలహాదారులకు మాత్రం సకాలంలో జీతాలు అందుతున్నాయని తెలిపారు. ఆయా సలహాదారుల వల్ల ప్రజలకు ఏమి మేలు జరిగిందో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేవదాయ శాఖను ప్రభుత్వం ఆదాయ వనరుగా మార్చుకుందని సోము వీర్రాజు ఆరోపించారు.