CM Chandrababu : అరాచక శక్తుల్ని ఉక్కుపాదంతో అణిచేయండి
ABN , Publish Date - Mar 18 , 2025 | 03:40 AM
అరాచక శక్తులు బయట ఉండటానికి వీల్లేదు.. ఉక్కుపాదంతో అణచి వేయండి’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ఆదేశించారు.

డీజీపీ గుప్తాకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం
టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్యపై సీరియస్
చెప్పి మరీ హత్యలు చేస్తున్నారు
వేట కొడవళ్లతో నరికి చంపుతున్నారు
ఇలాంటి వారు బయట ఉండటానికి వీల్లేదు: సీఎం
అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): ‘పట్ట పగలు, వేట కొడవళ్లతో నరికి చంపుతున్నారు.. ముందుగా చెప్పి మరీ పీకలు కోస్తున్నారు.. ఇటువంటి అరాచక శక్తులు బయట ఉండటానికి వీల్లేదు.. ఉక్కుపాదంతో అణచి వేయండి’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో ఈ నెల 15న వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అనుచరుడు వెంకటరమణ చేతిలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త రామకృష్ణ మృతి అధికార పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. సోమవారం శాసనసభ, మండలి లాబీల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబును డీజీపీ కలిసి రాష్ట్రంలో శాంతి భద్రతలపై వివరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ హత్యపై సీరియస్ అయిన చంద్రబాబు ‘వైసీపీ వాళ్ల నుంచి తన ప్రాణానికి ముప్పుందని వీడియో ద్వారా వేడుకున్న కార్యకర్తను కాపాడుకోలేక పోవడం చాలా బాధగా ఉంది’ అన్నట్లు తెలిసింది. పోలీసుల వైఫల్యంపైనా పెదవి విరిచినట్లు సమాచారం. అక్కడి సీఐతో పాటు స్థానిక పోలీసులపైనా వేటు వేశామని, ఐదుగురు నిందితుల్లో ఏ1 సహా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని డీజీపీ వివరణ ఇచ్చారు.
ఎస్పీలతో డీజీపీ టెలీ కాన్ఫరెన్స్
సీఎం ఆదేశాలతో వెంటనే కార్యాచరణ మొదలు పెట్టిన డీజీపీ గుప్తా జిల్లాల ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘మీ జిల్లాలో రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టండి. వారి కదలికల్ని గమనిస్తూ అనుమానం వచ్చిన వెంటనే రంగంలోకి దిగండి. ఎక్కడికక్కడ బైండోవర్లు చేయండి. ఎవరైనా ప్రాణహాని ఉందని పోలీసు స్టేషన్‌కు వస్తే భద్రత కల్పించండి’ అంటూ కీలక ఆదేశాలు జారీ చేశారు.
నేతల నిట్టూర్పు..
తనకు ప్రాణహాని ఉందన్న కార్యకర్తను అధికారంలో ఉన్నప్పుడు కూడా కాపాడుకోలేక పోవడం చేతగాని తనమేనంటూ చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేతో పాటు పలువురు నేతలు మంత్రి లోకేశ్ వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘అప్పట్లో అంగళ్లులో మన నాయకుడిపై దాడి చేశారు.. ఇప్పుడు పుంగనూరులో మన కార్యకర్త ను నరికి చంపారు.. ప్రభుత్వం మారినా ఏమీ తేడా లేదు’ అంటూ నేతలు నిట్టూర్చారు. ఈ హత్యను సీరియ్‌సగా తీసుకుంటామని లోకేశ్ హామీ ఇచ్చారు.