Cyber ​​attack of YCP : వైసీపీ వైరస్‌!

ABN , First Publish Date - 2023-07-11T04:00:37+05:30 IST

నిఘా వర్గాలు అనుమానితుల ఫోన్లను హ్యాక్‌ చేస్తుంటాయి. కొన్నిసార్లు రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ పోలీసులు అధికారిక అనుమతితో ఫోన్లను ట్యాప్‌ చేస్తుంటారు. ఇక... పోలీసులు అనధికారికంగా కూడా హ్యాకింగ్‌/ట్యాపింగ్‌ చేసే సందర్భాలూ ఉన్నాయి. సైబర్‌ నేరగాళ్లు, చీటర్స్‌ కూడా హ్యాకింగ్‌కు పాల్పడుతుంటారు.

Cyber ​​attack of YCP : వైసీపీ వైరస్‌!

సెల్‌ఫోన్లలోకి అనధికార చొరబాటు

విపక్ష నేతలు, విమర్శకులే టార్గెట్‌

టెక్నాలజీ సాయంతో ఫోన్లు హ్యాక్‌

ఫొటోలు, వీడియోలు,

మెసేజ్‌ల సహా సమస్తం లాగేస్తున్నారు

ట్విటర్‌లో బయటపెట్టి బెదిరింపులు

లండన్‌ మహిళ వివరాలు బట్టబయలు

టీడీపీ నేత మూడేళ్ల కుమార్తె ఫొటో సైతం

పులివెందుల వైసీపీ నేత అరాచకం

హ్యాకింగ్‌ టెక్నాలజీ వాడుతున్నారా?

దర్యాప్తు సంస్థలు సహకరిస్తున్నాయా?

వైసీపీ నేతల సైబర్‌ దాడి రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతోంది. ప్రతిపక్ష నేతలు, సోషల్‌ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారి సమస్త సమాచారాన్ని వారి ఫోన్ల నుంచి లాగేస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆధారాలను వారే బయటపెడుతున్నారు.

ప్రభుత్వం అడిగితే ఆధార్‌ నంబర్‌ ఇవ్వాలా? వద్దా? అని నిర్ణయుంచుకునే హక్కు పౌరుడికి ఉందని సుప్రీం కోర్టు చెప్పింది. అలాంటిది... ఓ మహిళ వ్యక్తిగత సమాచారాన్ని సోషల్‌ మీడియాలో పెట్టడం పౌరహక్కుల ఉల్లంఘనతో పాటు వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే. అయినా మహిళా కమిషన్‌ కానీ పోలీసులు కానీ జోక్యం చేసుకోవడం లేదు.

(అమరావతి - ఆంధ్రజ్యోతి) : నిఘా వర్గాలు అనుమానితుల ఫోన్లను హ్యాక్‌ చేస్తుంటాయి. కొన్నిసార్లు రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ పోలీసులు అధికారిక అనుమతితో ఫోన్లను ట్యాప్‌ చేస్తుంటారు. ఇక... పోలీసులు అనధికారికంగా కూడా హ్యాకింగ్‌/ట్యాపింగ్‌ చేసే సందర్భాలూ ఉన్నాయి. సైబర్‌ నేరగాళ్లు, చీటర్స్‌ కూడా హ్యాకింగ్‌కు పాల్పడుతుంటారు. కానీ... గతంలో కనీవినీ ఎరుగని విధంగా, బరితెగింపునకు పరాకాష్ఠగా ఒక రాజకీయ పార్టీయే సెల్‌ఫోన్లను హ్యాక్‌ చేస్తోందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. వైసీపీ సోషల్‌ మీడియా విభాగం ఈ దారుణానికి పాల్పడుతున్నట్లు బలమైన ఆధారాలు బయటపడ్డాయి. ఇంకా చెప్పాలంటే... ‘మీ ఫోన్లలోకి చొరబడి గుట్టు లాగేస్తున్నాం’ అని వైసీపీ సోషల్‌ మీడియా విభాగమే తన పోస్టుల ద్వారా స్పష్టం చేస్తోంది. సంబంధిత వ్యక్తులు తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్టు చేయని, ఇతరులకు షేర్‌ చేయని సమాచారాన్ని కూడా వీరు తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ పెద్దలకు బాగా సన్నిహితుడు, పులివెందుల వైసీపీ నేత రవీందర్‌రెడ్డి ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాల్లో పెట్టిన పోస్టులు పరిశీలిస్తే ప్రత్యర్థులపై జరుగుతున్న సైబర్‌ దాడి ఆందోళన కలిగిస్తోంది. ఈ డేటా ఎవరి నుంచి ఎవరికి వెళ్లింది? పులివెందుల వైసీపీ నేత చేతికి ఎలా చిక్కింది? ఎవరి ఫోన్‌కో వచ్చిన మెసేజ్‌ మరొకరికి ఎలా చేరింది? అది సోషల్‌ మీడియాలో ఎలా ప్రత్యక్షమైంది? వంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


లండన్‌ నుంచి పులివెందులకు

ఆమె... తెలుగుదేశం పార్టీ వీరాభిమాని. లండన్‌లో ఉంటున్నారు. ఇటీవల వైసీపీ సోషల్‌ మీడియా ఆమెను టార్గెట్‌ చేసింది. ఆమె పోర్న్‌స్టార్‌ అంటూ ఆమె వ్యకిత్వాన్ని, గౌరవాన్ని దెబ్బతీసేలా పోస్టులు పెట్టింది. ఇది జరిగిన కొద్దిరోజులకే... పులివెందుల వైసీపీ నేత రవీందర్‌రెడ్డి తన ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాల్లో ఆమె వ్యక్తిగత ఫొటోలు బయటపెట్టారు. ఆమె సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ షేర్‌ చేయని ఫొటోలు, తల్లిదండ్రులతో కలిసి ఉన్నవి ఫొటోలు కూడా పోస్టు చేశారు. ఇదెలా సాధ్యమైందని ఆరా తీస్తుండగానే... ఆమె ఫోన్‌ నెంబర్‌, ఇంటి అడ్రస్‌, ఆధార్‌ నంబర్‌, ఇతర సమగ్ర సమాచారం ఉన్న బయోడేటా బయట పెట్టారు. ఏవో ఒకట్రెండు ఫొటోలు సేకరించి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని, టీడీపీలో క్రియాశీలకంగా పనిచేయకుండా అడ్డుకునేందుకే సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారని మొదట్లో భావించారు. కానీ.. ఎక్కడో లండన్‌లో ఉంటున్న ఆమె ఫోన్‌లోని డేటా పులివెందులలో ఉంటున్న వ్యక్తికి ఎలా చేరిందన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో కీలక వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఆమె ఫోన్‌కు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇతర మాధ్యమాల ద్వారా బగ్స్‌నుపంపి హ్యాక్‌ చేసి ఉంటారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మూడేళ్ల పాప ఫొటో సైతం..

ఆయన... తెలుగుదేశం పార్టీలో కీలక పద విలో ఉన్నారు. ఐటీడీపీ వ్యవహారాలు చూస్తున్నారు. తన మూడేళ్ల కుమార్తెను ఎత్తుకుని మురిపెం చేస్తున్న ఫొటోలను ఆయన ఇంతకుముందు ఎప్పుడూ సోషల్‌ మీడియాలో పోస్టు చేయలేదు. తన ఫోన్‌లోనే దాచుకున్నారు. ఇతరులకు షేర్‌ కూడా చేయలేదు. అయినా అవి వైసీపీ నేత రవీందర్‌రెడ్డి చేతికి చేరాయి. ఆయన ఫోన్‌లోని ఫొటోలు ఒక్కొక్కటిగా వైసీపీ నేత సోషల్‌ మీడియా ఖాతాలో ప్రత్యక్షమవుతున్నాయి. ఇదె లా సాధ్యమైంది? అన్నది ప్రశ్న.

కేసు పెట్టినా.. బరితెగింపు

ఆమె... టీడీపీ మహిళా నేత. ఇటీవల పులివెందుల వైసీపీ నేత రవీందర్‌రెడ్డిపై కేసు పెట్టారు. సోషల్‌ మీడియాలో తనపై అసభ్య పోస్టులు, వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత రవీందర్‌రెడ్డి మరింత రెచ్చిపోయారు. ఆ మహిళా నేత ఫోన్‌లోని వ్యక్తిగత ఫొటోలు, మెసేజ్‌ల వివరాలు కొన్నింటిని బయటపెట్టారు. ఆమె ఫోన్‌లో ఉన్న వివరాలు రవీందర్‌రెడ్డికి ఎలా చేరాయన్నదే ప్రశ్న. ఫోన్‌ను హ్యాక్‌ చేసినట్లు స్పష్టమవుతోందని విశాఖకు చెందిన సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడు సునీల్‌ పేర్కొన్నారు,.

Updated Date - 2023-07-11T04:54:15+05:30 IST