Siemens: సంబంధం లేకపోతే.. ఇవన్నీ ఏంటి?
ABN , First Publish Date - 2023-09-14T02:44:52+05:30 IST
మా పేరుతో పచ్చి దగా! స్కిల్ డెవల్‌పమెంట్ ప్రాజెక్టు వందశాతం మోసం’... అని జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ చెప్పేసిందట! అలాగని ఈ-మెయిల్ పంపిందట! దోపిడీ అక్షరాలా నిజమనేందుకు ఇదే నిదర్శనమట! జగన్ పత్రిక పతాక శీర్షికలో ప్రచురించిన వార్త
ఈ ఫొటో చూడండి! ఇది... 2016 జూన్ 3వ తేదీనాటి చిత్రం. ఇది... స్కిల్ డెవల్‌పమెంట్ ప్రాజెక్టుపై జరిగిన సమావేశం! ఇందులో చంద్రబాబు ఎదురుగా కూర్చుని ‘ప్రాజెక్టు’ గురించి వివరిస్తున్న వ్యక్తి సునీల్ మాథుర్. సీమెన్స్ సంస్థ ఇండియా సీఈవో, దక్షిణాసియా వ్యవహారాలకు అధిపతి! ఇప్పటికీ ఆయన అవే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరి... ‘సీమెన్స్’కు తెలియకుండానే స్కిల్ డెవల్‌పమెంట్ ప్రాజెక్టు ఏపీలో అమలైందంటే నమ్మేదెవరు? జగన్ పత్రిక ఎవరి చెవిలో పూలు పెట్టాలనుకుంటోంది?
ఈ-మెయిల్ అంటూ జగన్ పత్రిక కథనం
నాడు ఏపీతో స్వయంగా సీమెన్స్ చర్చలు
దక్షిణాసియా హెడ్ సునీల్ మాథుర్ రాక
చంద్రబాబుతోనూ ఆయన సమావేశం
ఇప్పటికీ సీమెన్స్‌లోనే మాథుర్
‘సీమెన్స్’ పేరుతోనే శిక్షణ కేంద్రాలు
రూ.58 కోట్లు అందినట్లు ధ్రువీకరణ
మరి.. సంబంధం లేదని ఎలా అంటారు?
మెయిల్‌లో ఏముందో.. జగన్ పత్రిక ఏం రాసిందో?
(అమరావతి - ఆంధ్రజ్యోతి): ‘మా పేరుతో పచ్చి దగా! స్కిల్ డెవల్‌పమెంట్ ప్రాజెక్టు (Skill Development Project) వందశాతం మోసం’... అని జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ చెప్పేసిందట! అలాగని ఈ-మెయిల్ పంపిందట! దోపిడీ అక్షరాలా నిజమనేందుకు ఇదే నిదర్శనమట! జగన్ పత్రిక పతాక శీర్షికలో ప్రచురించిన వార్త ఇది! ‘స్కిల్ డెవల్‌పమెంట్ ప్రాజెక్టుకూ, మాకూ ఎలాంటి సంబంధం లేదు! మాపేరు వాడుకుని మోసం చేశారు’... అనేదే దీని సారాంశం! ఇది నిజమా? సీమెన్స్ సంస్థ ప్రమేయం లేకుండానే స్కిల్ డెవల్‌పమెంట్ ప్రాజెక్టు ఏపీలో మొదలైందా? ఆ సంస్థ భాగస్వామ్యం లేకుండానే నాటి చంద్రబాబు సర్కారు దీనిపై ఒప్పందం కుదుర్చుకుందా? ఆ అవకాశమే లేదు. ఎందుకంటే... సీమెన్స్ ఇండియా సీఈవో, దక్షిణాసియా వ్యవహారాల అధిపతి సునీల్ మాథుర్ స్వయంగా ఈ ప్రాజెక్టుపై జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. అంతేకాదు... ఈ ప్రాజెక్టు అమలులో భాగంగా ఏపీ ప్రభుత్వం నుంచి రూ.58 కోట్లు అందినట్లు సీమెన్స్ స్వయంగా అంగీకరించింది. మరి... ‘సంబంధం లేదు’ అని సీమెన్స్ చెప్పే అవకాశమే లేదు. నిజంగా అలాంటి ఈ-మెయిల్ వచ్చిందా అన్నది అసలు ప్రశ్న.
ఈ ప్రశ్నలకు బదులేదీ?
‘మీరు మా రాష్ట్రానికి వచ్చి స్కిల్ డెవల్‌పమెంట్ ప్రాజెక్టు చేపట్టండి’ అని చంద్రబాబు సర్కారు (Chandrababu) కోరలేదు. సీమెన్స్ ప్రతినిధులే వచ్చి... గుజరాత్‌లో తాము చేపట్టిన ప్రాజెక్టు గురించి వివరించి ఏపీలోనూ దీనిని అమలు చే స్తే బాగుంటుందని ప్రతిపాదించారు. గుజరాత్ ప్రభుత్వంతో సీమెన్స్ తరఫున ఒప్పందంపై సంతకాలు చేసిన అప్పటి సీమెన్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సుమన్ బోస్ అదే హోదాలో ఏపీ ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందంపైనా సంతకం చేశారు. మరి సీమెన్స్‌కు సంబంధం లేదంటే ఎలా?
జగన్ మీడియా పరిభాషలో సుమన్ బోస్ మోసగాడు, ఈడీ కేసుల్లో నిందితుడు అనే అనుకుందాం. కానీ... ఏపీలో ఈ ప్రాజెక్టుపై జరిగిన చర్చల్లో సీమెన్స్ ఇండియా సీఈవో, దక్షిణాసియా వ్యవహారాల అధిపతి సునీల్ మాథూర్ స్వయంగా పాల్గొన్నారు. ఏపీ సర్కారుకు సీమెన్స్, డిజైన్‌టెక్‌ల నడుమ 2015 డిసెంబరు 3న ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత జరిగిన నాలుగు సమావేశాల్లో సునీల్ ముథూర్ పాల్గొన్నారు. 2016 జూన్ 3వ తేదీన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన సమావేశంలో ఆయన చర్చలు జరుపుతున్న చిత్రాన్ని చంద్రబాబు అప్పట్లో అధికారికంగా ట్వీట్ చేశారు. ఇప్పటికీ సునీల్ మాథుర్ సీమెన్స్‌లో అదే పదవిలో ఉన్నారు. మరి... ‘నాకు సంబంధం లేదు’ అని సీమెన్స్ ఎలా చెబుతుంది? తమ పేరు చెప్పి మోసం చేసి ఉంటే... సునీల్ మాథుర్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదు.
ఏపీకి సాఫ్ట్‌వేర్ అందించినందుకు సీమెన్స్ ఇంటర్నేషనల్‌కు 58.08 కో ట్ల రూపాయల నిధులు చేరాయి. ఈ మొత్తం తమకు ముట్టిందని సీమెన్స్ కూడా చెబుతోంది. ఇటు ఈడీకి, అటు స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్‌కు అదే విషయాన్ని తెలియజేసింది. ప్రాజెక్టు పేరిట డ బ్బులు తీసుకుని ఇప్పుడు ‘సంబంధం లేదు’ అని సీమెన్స్ అనగలదా?
స్కిల్ డెవల్‌పమెంట్ ప్రాజెక్టు కింద చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాలన్నింటిపైనా ‘సీమెన్స్’ పేరు పెద్దపెద్ద అక్షరాలతో ఏర్పాటు చేశారు. ఆరేళ్లుగా అవి ఆ పేరుతోనే నడుస్తున్నాయి. మరి... సంబంధంలేని ప్రాజెక్టుకు తమ పేరు వాడుకుంటుంటే అంతర్జాతీయ సంస్థ అయిన సీమెన్స్ ఎందుకు చూస్తూ ఊరుకుంది?
‘మా పేరు చెప్పి మోసం చేశారు’ అని సీమెన్స్ చెప్పినట్లుగా జగన్ మీడియా ప్రచురించిన కథనం ‘ఫోక్స్‌వ్యాగన్’ స్కామ్‌ను గుర్తుకు తెస్తోంది. అప్పట్లో విశాఖలో కార్లకంపెనీ పెడతామంటూ ఫోక్స్ వ్యాగన్ ఇండియా ప్రతినిధి షుష్టర్, మరికొందరితో కలిసి ఏపీ సర్కారుకు టోపీ పెట్టారు. ఎలాంటి నిర్ధారణలు లేకుండానే మంత్రి బొత్స సత్యనారాయణ రూ.11.5 కోట్లు విడుదల చేశారు. ఆ డబ్బులను మోసగాళ్లు నిమిషాల్లోనే ఖాళీ చేశారు. ఆ తర్వాత... తమతో సంబంధంలేకుండా షుష్టర్ ఈ కథంతా నడిపాడని ఫోక్స్‌వ్యాగన్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘ఏం చేస్తాం. డబ్బులుపోయాయ్’ అంటూ బొత్స తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. కానీ... స్కిల్ డెవల్‌పమెంట్ ప్రాజెక్టు అలా కాదు. 40 చోట్ల నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటయ్యాయి. లక్షల మందికి శిక్షణ లభించింది. వేలమందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ ప్రాజెక్టు ఇప్పటికీ నడుస్తోంది. మరి... ‘మాకు సంబంధం లేదు’ అని సీమెన్స్ ఎలా చెప్పగలదు?