God's Lands: దేవుడి భూములు మాయం

ABN , First Publish Date - 2023-04-19T02:16:20+05:30 IST

దేవదాయ శాఖలో 41 వేల ఎకరాల భూములు మాయమయ్యాయి. రెండేళ్ల క్రితం వరకూ రాష్ట్రంలో అన్ని దేవాలయాలకు కలిపి 4,21,941 ఎకరాల భూమి ఉందని లెక్కల్లో చూపించేవారు.

God's Lands: దేవుడి భూములు మాయం

దేవదాయ శాఖలో 41 వేల ఎకరాలు మిస్సింగ్‌

విలువ వేల కోట్ల రూపాయలు!

రికార్డుల్లో గతంలో 4.21 లక్షల ఎకరాలు

ఇప్పుడా లెక్క 3.80 లక్షల ఎకరాలకు కుదింపు

సమీక్షలో అధికారులపై మంత్రి ఆగ్రహం

ఏమయ్యాయో లెక్క తేల్చాలని ఆదేశం

అమరావతి, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): దేవదాయ శాఖలో 41 వేల ఎకరాల భూములు మాయమయ్యాయి. రెండేళ్ల క్రితం వరకూ రాష్ట్రంలో అన్ని దేవాలయాలకు కలిపి 4,21,941 ఎకరాల భూమి ఉందని లెక్కల్లో చూపించేవారు. ఆ శాఖ రికార్డుల్లో కూడా ఇదే లెక్క చూపించేవారు. ఇప్పుడా భూములు 3,80,600 ఎకరాలకు తగ్గిపోయాయి. మొన్నటి వరకూ రికార్డుల్లో ఉన్న భూమి ఎలా తగ్గిందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. దాదాపు 41,340 ఎకరాలు తగ్గిపోయాయి. మంగళవారం దేవదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆలయాల భూములపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు చెప్పిన లెక్కల్లో తేడాను ఆయన గమనించారు. మిగిలిన భూమి ఏమైందని అధికారులను ప్రశ్నించారు. దీనికి ఎవరి వద్దా సమాధానం లేదు. దీంతో ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ భూమి ఏమైందో తేల్చాలని ఆదేశాలిచ్చారు.

నలుగురు డీసీల పరిధిలో భూములు..

దేవదాయ శాఖ పరిధిలో నాలుగురు డిప్యూటీ కమిషనర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు ఒకరు, ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణాకు ఒకరు, ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఒకరు, ఉమ్మడి రాయలసీమ జిల్లాలకు ఒకరు చొప్పున డీసీలే ఉన్నారు. వీరంతా ఆలయాల పరిధిలోని భూముల వ్యవహారాలు మొత్తం చూసుకుంటారు. మొన్నటి వరకూ విశాఖపట్నం డీసీ పరిధిలో 50,233 ఎకరాలు, కాకినాడ డీసీ పరిధిలో 62,649 ఎకరాలు, గుంటూరు డీసీ పరిధిలో 1,48,481 ఎకరాలు, కర్నూలు డీసీ పరిధిలో 1,60,576 ఎకరాలున్నట్లు లెక్కలు చూపించేవారు. మంగళవారం జరిగిన సమీక్షలో విశాఖపట్నం డీసీ పరిధిలో 63,072 ఎకరాలు, కాకినాడ డీసీ పరిధిలో 67,808 ఎకరాలు, గుంటూరు డీసీ పరిధిలో 82,522 ఎకరాలు, కర్నూలు డీసీ పరిధిలో 1,67,197 ఎకరాలున్నట్లు మంత్రికి ఇచ్చిన పత్రాల్లో పేర్కొన్నారు. లెక్కలు తప్పు వేశారా? లేదా భూములు కాజేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వంద, రెండొందలు ఎకరాలైతే ఎన్‌వోసీలు ఇచ్చారనుకుందాం. కానీ, 41 వేల ఎకరాలు ఏమయ్యాయన్నది సర్వత్ర ప్రశ్నార్థకంగా మారింది.

పూర్తి నిర్లక్ష్యం...

భూముల పట్ల దేవదాయశాఖ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ఈవోల స్థాయిలోనే నిర్లక్ష్యం బయటపడుతోంది. ఉదాహరణకు మాన్సాస్‌ ట్రస్ట్‌ భూముల కౌలును పరిశీలిస్తే ఎకరానికి రూ.100, రూ.1000, రూ.1500 మాత్రమే కౌలు తీసుకుంటున్నారు. ఈ రోజుల్లో ఎకరాకు రూ.100 కౌలు తీసుకోవడంపై ఉన్నతాధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఆలయాల్లో ఈవోలు భూముల కౌలుకు వేలం కూడా నిర్వహించడం లేదు. దేవదాయశాఖలో కొన్ని నిబంధలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. భూముల వేలం పెడుతున్నట్లు, అనుమతి కోసం కమిషనర్‌కు లేఖ రాస్తారు. ఆ లేఖలు కమిషనర్‌కు పంపించకుండా వారి వద్దనే ఉంచుకుంటున్నారు. ఆ లేఖలు ఆరు నెలల తర్వాత డీమ్డ్‌టుబీ అప్రూవ్డ్‌ అవుతాయి. తద్వారా నచ్చిన వారికి భూములు ధారాదత్తం చేస్తున్నారు. ఈ క్రమం లో కొన్ని భూములు అక్రమంగా మ్యుటేషన్లు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-04-19T02:16:20+05:30 IST