Mla Balineni : రాజకీయాల కోసం ఆస్తులను పోగొట్టుకున్నా
ABN , First Publish Date - 2023-12-11T02:39:02+05:30 IST
‘రాజకీయాల కోసం నా ఆస్తులను పోగొట్టుకున్నానే తప్ప ఎవ్వరినీ మోసం చేయలేదు. నేను చదువుకునే రోజుల్లో నా స్నేహితులు ఏదైనా అవసరం ఉందంటే నా వద్ద లేకపోయినా ఇంట్లో తీసుకొని వచ్చి ఇచ్చిన గుణం నాది. ల్యాండ్ సీలింగ్

ల్యాండ్ సీలింగ్‌లో భూములను ఇచ్చిన కుటుంబం మాది
మంత్రిగా ఉన్నప్పుడు పార్టీ కోసమిస్తే డబ్బులు తీసుకున్నా
15 కోట్లు అప్పుంది... టీడీపీ సానుభూతిపరులే ఇచ్చారు
మళ్లీ ఒంగోల్లోనే పోటీ..: ఎమ్మెల్యే బాలినేని
ఒంగోలు (కలెక్టరేట్), (క్రైం), డిసెంబరు 10: ‘రాజకీయాల కోసం నా ఆస్తులను పోగొట్టుకున్నానే తప్ప ఎవ్వరినీ మోసం చేయలేదు. నేను చదువుకునే రోజుల్లో నా స్నేహితులు ఏదైనా అవసరం ఉందంటే నా వద్ద లేకపోయినా ఇంట్లో తీసుకొని వచ్చి ఇచ్చిన గుణం నాది. ల్యాండ్ సీలింగ్ సమయంలోనే భూములను వెనక్కి ఇచ్చిన కుటుంబం మాది’ అని మాజీ మంత్రి, ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు లాయర్‌పేటలోని తన స్వగృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘నేను ఒంగోలులో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన మాటలను వక్రీకరించడం హాస్యాస్పదంగా ఉంది. నేను మంత్రిగా ఉన్న సమయంలో పార్టీ కార్యక్రమాలకు కొంత చందాలు వచ్చాయని చెప్తే.. దాన్ని నేను డబ్బులు తీసుకున్నట్లు ప్రచారం చేయడం బాధాకరం. నాకు రూ.15 కోట్ల అప్పు ఉంది. ఆ మొత్తం కూడా టీడీపీ సానుభూతిపరుల వద్దే తీసుకున్నా. తిరిగి చెల్లిస్తానన్న నమ్మకంతోనే వారు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచే పోటీచేస్తున్నా. గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే అధికంగా వస్తుంది. నేను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఓ స్నేహితుడితో జరిగిన పందెంపై మాట్లాడానని, తన కుమారుడు ప్రణీత్‌రెడ్డి బీఆర్‌ఎస్ గెలుస్తుందన్న నమ్మకంతో ఉండటంతో పందెం వేయలేదు. నేను మాట్లాడిన మాటలను వక్రీకరించి టీడీపీ నేతలు ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోతే ఆ తప్పంతా వైసీపీ మీద వేసేందుకు ప్రయత్నాలు చేయడం దుర్మార్గం. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు నిర్వహణ సక్రమంగా లేని కారణంగా ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడింది. త్వరలోనే గుండ్లకమ్మకు గేట్లు ఏర్పాటు చేస్తాం’ అని బాలినేని స్పష్టం చేశారు.
పొత్తుపై సమాధానం చెప్పాలి
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకగా.. జనసేన బీజేపీతో కలిసి పోటీ చేసిందని బాలినేని అన్నారు. హైదరాబాద్‌లో సెటిలర్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ అక్కడ కాంగ్రె్‌సకు ఒక్క సీటు కూడా రాలేదన్నారు. హైదరాబాద్‌లో టీడీపీ బలపరిచిన వ్యక్తులు ఓడారు కాబట్టి ఏపీలో కూడా అదే పరిస్థితి ఉండబోతుందని బాలినేని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో వేర్వేరు పార్టీలతో అంటకాగి ఇక్కడ(ఏపీలో) మాత్రం టీడీపీ, జనసేనలు పొత్తు పెట్టుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో వేర్వేరుగా ఎందుకు పోటీ చేశాయో ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
బాలినేని వివాదాస్పద వ్యాఖ్యలపై ఫిర్యాదు
ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని వివాదాస్పద వ్యాఖ్యలపై జిల్లా పోర్టుఫోలియో జడ్జికి ఫిర్యాదు చేస్తున్నట్లు వైసీపీ రెబల్ నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న బాలినేని తెలంగాణ ఎన్నికల్లో పార్టీల గెలుపోటములపై బెట్టింగ్ కాసినట్లు చెప్పడం అభ్యంతరకరమన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో డబ్బులు తీసుకొని పనులు చేశానని బహిరంగంగా ప్రకటించడం చట్ట విరుద్ధమన్నారు. ఆయా అంశాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని పోర్టుఫోలియో జడ్జికి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, బాలినేనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీసీసీ అధ్యక్షుడు ఈదా సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం విలేకరులతో మాట్లాడారు. బాలినేని భారీ సినిమా తీస్తానని ప్రకటించడాన్ని బట్టి ఆయన వద్ద అవినీతి సొమ్ము భారీగానే ఉన్నట్లు అర్థమవుతుందన్నారు.