ముంచు నీళ్లు!
ABN , First Publish Date - 2023-03-05T23:12:40+05:30 IST
జిల్లా ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు అనేక చోట్ల రక్షిత నీటి పథకాలు ఉన్నాయి. వీటి ద్వారా సరఫరా చేసే నీటిని చాలా ప్రాంతాల్లో క్లోరినేషన్ చేయడం లేదు. పలుచోట్ల పైప్‌లైన్‌లకు విచ్చలవిడిగా ఏర్పడిన లీకులతో మురుగునీరు చేరి తాగునీరు కలుషితమవుతోంది. దీంతో ప్రజలు ఎక్కువగా శుద్ధి జలాన్ని వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మినరల్ వాటర్‌కు డిమాండ్ ఏర్పడింది. దీనికితోడు ఈ ఏడాది మార్చిలోనే ఎండలు మండుతుండంతో తాగునీటి వనరులు అడుగంటుతున్నాయి.
పుట్టగొడుగుల్లా మినరల్ వాటర్ ప్లాంట్లు
కనీస ప్రమాణాలు కరువు
జిల్లాలో ఒక్కదానికీ ఐఎ్‌సఐ గుర్తింపు లేని వైనం
గృహ అవసరాల ముసుగులో బోర్లు
నేరుగా ట్యాంకులకు ఎక్కించి
బబుల్స్‌లో నింపి విక్రయం
దోచుకుంటున్న నిర్వాహకులు
ప్రమాదంలో ప్రజారోగ్యం
మామూళ్ల మత్తులో అధికారులు
జిల్లాలో మినరల్ వాటర్ కేంద్రాల నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టానుసారం ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. కనీస ప్రమాణాలు పాటించకుండా, నీటిని పూర్తిస్థాయిలో శుద్ధి చేయకుండా విక్రయిస్తూ ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు. ఎలాంటి అనుమతులు, ఐఎ్‌సఐ గుర్తింపు లేకుండా రోజుకు లక్షల లీటర్ల నీటిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. కనీసం తనిఖీలు కూడా చేపట్టకపోవడం వెనుక మినరల్ వాటర్ కేంద్రాల నిర్వాహకుల నుంచి భారీగా నజరానాలు అందడమే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఒంగోలు (కార్పొరేషన్), మార్చి 5 : జిల్లా ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు అనేక చోట్ల రక్షిత నీటి పథకాలు ఉన్నాయి. వీటి ద్వారా సరఫరా చేసే నీటిని చాలా ప్రాంతాల్లో క్లోరినేషన్ చేయడం లేదు. పలుచోట్ల పైప్‌లైన్‌లకు విచ్చలవిడిగా ఏర్పడిన లీకులతో మురుగునీరు చేరి తాగునీరు కలుషితమవుతోంది. దీంతో ప్రజలు ఎక్కువగా శుద్ధి జలాన్ని వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మినరల్ వాటర్‌కు డిమాండ్ ఏర్పడింది. దీనికితోడు ఈ ఏడాది మార్చిలోనే ఎండలు మండుతుండంతో తాగునీటి వనరులు అడుగంటుతున్నాయి. ప్రజలకు నీటి అవసరాలు పెరగడంతో మినరల్ వాటర్ అమ్మకాలు ఊపందుకున్నాయి. దీన్ని ఆసరా చేసుకొని ఆయా కేంద్రాల నిర్వాహకులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. కనీస జాగ్రత్తలు పాటించకుండా, నీటిని పూర్తిస్థాయిలో శుద్ధి చేయకుండా అమ్ముతూ ప్రజలను దోచుకుంటున్నారు.
విచ్చలవిడిగా ప్లాంట్‌లు
జిల్లాలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఆర్వో ప్లాంట్లను విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్నారు. గృహ అవసరాల కోసం అని బోర్లు ఏర్పాటు చేసుకొని వాటి నుంచి నీటిని ప్యూరిట్ ద్వారా శుద్ధి చేసి ట్యాంకర్లకు పంపుతున్నారు. కొందరు నేరుగా బోరు నీటినే క్యాన్‌లకు నింపుతున్నారు. దాన్ని లీటరు రూ.2, అర లీటరు రూ.1, క్యాను రూ.20 నుంచి రూ.30 వరకూ అమ్మతున్నారు. కొందరు నేరుగా ఇళ్లకే బబుల్స్ ద్వారా సరఫరా చేస్తున్నారు. ఒక్కో ప్లాంట్‌లో రోజుకు దాదాపు రూ.20వేల నుంచి 25వేల వరకూ వ్యాపారం జరుగుతున్నట్లు అంచనా. ప్రభుత్వ నిబంధనలన్నీ పాటించి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే రూ.30లక్షలకుపైన ఖర్చవుతుంది. కానీ ప్రమాణాలు పాటించకుండా ఎక్కువ మంది రూ.5 నుంచి రూ.7లక్షలు మాత్రమే వెచ్చించి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు.
ఒక్కదానికీ ఐఎ్‌సఐ గుర్తింపు లేదు
ఒంగోలు నగరంలో దాదాపు 250 వరకు నీటి శుద్ధి కేంద్రాలు ఉండగా ఇతర పట్టణాలు, గ్రామాల్లో సుమారు500 వరకూ నడుస్తున్నాయి. వీటిలో ఒంగోలులోని నాలుగు కేంద్రాలకుమాత్రమే ఆరంభంలో ఐఎ్‌సఐ గుర్తింపు తీసుకున్నారు. ఏటా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది. కానీ ఎవ్వరూ ఆ పని చేయలేదు. దీన్ని బట్టి ప్రస్తుతం జిల్లాలో ఉన్న ప్లాంట్‌లలో ఒక్కదానికి కూడా ఐఎ్‌సఐ గుర్తింపు లేదన్న విషయం అర్థమవుతుంది.
నిబంధనల ప్రకారం చేయాల్సింది ఇలా..
నీటిని శుద్ధి చేయాలంటే తొలుత ఇసుక ఫిల్టర్‌లోకి, అనంతరం కార్బన్ ఫిల్టర్‌లోకి పంపాలి. అక్కడ శుద్ధి చేసిన అనంతరం సాఫానర్‌లోకి పంపి తర్వాత రెండు ఫిల్టర్‌ల ద్వారా శుద్ధి చేసి ఆర్వో ప్లాంట్‌కు చేర్చాలి. అక్కడ నుంచి రివర్స్ ఆస్మోసిస్ ద్వారా యూఎ్‌సఏ ల్యాంప్‌నకు పంపి స్టెరిలైజేషన్... అనంతరం ఓజోనైజేషన్ చేయాలి. తర్వాత నీటిని ట్యాంకులకు నింపాలి. అక్కడ నీరును 24 గంటల వరకు నిల్వ ఉంచిన తర్వాత వినియోగించాలి. ప్లాంట్ చుట్టూ పరిశుభ్రమైన వాతావరణం ఉండాలి. ప్రతి ఆరునెలలకు ఒకసారి ఆహార భద్రత అధికారులు ప్లాంట్‌ను తనిఖీ చేసి ధ్రువీకరణ పత్రం ఽమంజూరు చేయాల్సి ఉంది. వాటర్ ప్లాంట్‌కు ఐఎ్‌సఐ అనుమతి తప్పనిసరి. ప్రాథమిక అనుమతి కోసమే రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం రూ.89 వేలు కట్టి రెన్యువల్ చేసుకోవాలి.ప్రతి కేంద్రంలోనూ నీటి పరీక్షల కోసం మైక్రో బయాలజీ, కెమిస్ట్రీ ల్యాబ్‌లు, ఏసీ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి. కానీ జిల్లాలో అక్కడక్కడా ఒకట్రెండు చోట్ల తప్ప ఎక్కడా ప్రమాణాలు పాటించడం లేదు.
మామూళ్ల మత్తులో అధికారులు
తాగునీటి ప్లాంట్‌లను ఆహార భద్రత అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సి ఉండగా ఆ ఊసే కరువైంది. గతంలో మునిసిపాలిటీలలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌ల పేరుతో ప్రత్యేక అధికారులు ఉండేవారు. ఆ బాధ్యతల నుంచి వారిని తప్పించి ఆహార భద్రత అధికారులకు అప్పగించారు. అయితే వారు మినరల్ వాటర్ ప్లాంట్‌లలో లోపాలపై కనీస దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. వాటర్ ప్లాంట్‌ల నిర్వాహకుల నుంచి భారీ మొత్తాలు పుచ్చుకొని మిన్నకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రజలఆరోగ్యంపై ప్రభావం
శుద్ధి జలం అనుకొని ప్రతి రోజూ ప్రజలు తాగుతున్న నీటి ద్వారా తెలియకుండానే అనారోగ్యం బారిన పడుతున్నారు. కనీస ప్రమాణాలు పాటించకుండా బోరు నీటినే నేరుగా క్యాన్‌లలో నింపి అమ్మడం ద్వారా పలు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉన్న నీటిని తాగితే మలేరియా, టైఫాయిడ్ వంటి రోగాల బారిన పడతారు. ప్రధానంగా తాగునీటి ద్వారా ఉత్పన్నమయ్యే బాక్టీరియా కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. అందులో అభివృద్ధి చెందే ఫంగస్ వలన లివర్, జీర్ణకోశ వ్యాధుల బారిన పడతారు. ఉదర సంబంధ వ్యాధులతోపాటు కీళ్లనొప్పులు వచ్చే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో బోరు వాటర్‌ను నేరుగా ట్యాంకులకు నింపి విక్రయిస్తున్నారు. ఆ నీటిని తాగిన వారి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు నీటి విక్రయ కేంద్రాలపై తనిఖీలు విస్తృతం చేసి సురక్షిత నీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.