Varun Kumar: మహానాడులో 2 నిమిషాల అద్భుత ప్రసంగం.. పార్టీ అధిష్టానాన్ని ఆకర్షించిన వరుణ్
ABN , First Publish Date - 2023-05-28T14:03:36+05:30 IST
సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ప్రతి ఒక్కరినీ కదిలించి, యువతను సామాజిక సేవ వైపు ఎన్టీఆర్ (NTR) నడిపించారని, అదే స్ఫూర్తిని...
రాజమండ్రి: సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ప్రతి ఒక్కరినీ కదిలించి, యువతను సామాజిక సేవ వైపు ఎన్టీఆర్ (NTR) నడిపించారని, అదే స్ఫూర్తిని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేటికీ కొనసాగిస్తున్నారని టీడీపీ తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ కుమార్ (Varun Kumar) అన్నారు. ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని రాజమండ్రిలో జరుగుతున్న మహానాడు (Mahanadu) వేదికగా యువతను ఆయన ప్రోత్సహిస్తున్న తీరే దానికి నిదర్శనమన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యపై రాజమహేంద్రవరంలో జరుగుతున్న మహానాడు వేదికగా తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ కుమార్ అద్భుతమైన ప్రసంగం చేశారు. తనకిచ్చిన రెండు నిమిషాల కాలాన్ని సద్వినియోగం చేసుకుని.. మహానాడు వేదికపై సింహ గర్జన చేశారు. యువతను చైతన్య పరిచేలా ప్రసంగించారు. రాష్ట్రంలో జగన్ సర్కార్‌ను ఇంటికి పంపడం ఖాయమని, తమకు ఉద్యోగాలు లేకుండా చేసిన ముఖ్యమంత్రిని, ఆయన ఎమ్మెల్యేలను పదవుల నుంచి తీసేసి రాజకీయంగా నిరుద్యోగులుగా మారుస్తామని వరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.
అనర్గళంగా సాగిన ప్రసంగంతో అధినేత చంద్రబాబు నాయుడిని ఆకట్టుకున్నారు వరుణ్. తెలుగు యువత శక్తిని చాటావంటూ పలువురు నేతలు ప్రశంసించారంటే వరుణ్ వాగ్ధాటి ఎలా సాగిందో ఇట్టే అర్థమవుతుంది.
సామాన్య కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలో వరుణ్ ప్రస్థానం ప్రారంభమైంది. ఒకనాడు చంద్రబాబునాయుడి పక్కన నిలబడి ఓ ఫోటో తీసుకుంటే అదే భాగ్యమనుకున్న యువకుడు.. నేడు మహానాడు లాంటి చరిత్రాత్మకమైన వేదిక నుంచి అశేషమైన తెలుగుదేశం శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించడం నిజంగా గొప్ప విషయమే. చిత్తూరు జిల్లాకు చెందిన వరుణ్ క్రమశిక్షణతో, బాధ్యతగల కార్యకర్తగా తనను తాను తీర్చిదిద్దుకుంటూ, పార్టీ దృష్టిని ఆకర్షించారు. గతంలో ఆంధ్రప్రదేశ్ లో తయారయ్యే మద్యంలో హానికర రసాయనాలు ఉన్నాయన్న విషయం మీద అధ్యయనం చేసి సంచలనాత్మక విషయాలను వెల్లడించారు. దీని మీద ప్రభుత్వంలోని మంత్రులు, కార్యదర్శి స్థాయిలో వివరణ ఇవ్వాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో సైతం చురుకుగా ఉండే వరుణ్, పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ క్షేత్ర స్ధాయిలో పలు పోరాటాలు చేశారు. పార్టీ కోసం కష్టపడాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని.. అధికార పార్టీ ఆగడాలకు చెక్ పెడతామని, వచ్చేది తెదేపా ప్రభుత్వమే అని వరుణ్ కుమార్ అన్నారు.