Senior IPS officer: ఆ సారంతే!
ABN , First Publish Date - 2023-03-27T03:20:40+05:30 IST
ఆయన సీనియర్ ఐపీఎస్ అధికారి. డీజీపీ ర్యాంకు హోదాలో ఉన్నారు. ఎక్కడ పనిచేసినా వివాదాలు కామన్. గతేడాది నుంచి పోస్టింగ్ లేకుండా ఉన్నారు. అయితే ఆ సార్ ఏకంగా 12 మంది హోంగార్డులను ఆర్డర్లీలుగా నియమించుకున్నారు.

వివాదాస్పదంగా సీనియర్ ఐపీఎస్ తీరు
డీజీ ర్యాంకులో ఉన్నా పోస్టింగ్ లేదు
ఆర్డర్లీలుగా 12 మంది హోంగార్డులు
‘ఫైర్’లో జీతం.. అధికారి ఇంట్లో పని
పెంపుడు కుక్క కోసమే ముగ్గురు
(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఆయన సీనియర్ ఐపీఎస్ అధికారి. డీజీపీ ర్యాంకు హోదాలో ఉన్నారు. ఎక్కడ పనిచేసినా వివాదాలు కామన్. గతేడాది నుంచి పోస్టింగ్ లేకుండా ఉన్నారు. అయితే ఆ సార్ ఏకంగా 12 మంది హోంగార్డులను ఆర్డర్లీలుగా నియమించుకున్నారు. వాళ్లందరికీ అగ్నిమాపక శాఖ జీతాలు ఇస్తోంది. అగ్ని ప్రమాదాలు, విపత్తుల్లో స్పందించడం వారి డ్యూటీ. కానీ ఆ అధికారి ఇంట్లో పనితోపాటు కుక్కను చూసుకోవడానికి పరిమితమయ్యారు. కేవలం పెంపుడు కుక్కను చూసు కోవడానికి ముగ్గుర్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పోలీసు, అగ్నిమాపక శాఖల్లో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఆ అధికారి గతంలో అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేశారు. ‘నేనెవరి మాటా వినను. మంత్రి చెప్పినా వినేదేలే’ అంటూ మూడేళ్లలో మూడు పోస్టులు కోల్పోయారు.
గత ప్రభుత్వంలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో పనిచేసిన ఆ అధికారి సిబ్బందిని నిరంతరం సొంతపనులకు వాడుకునేవారనే ఆరోపణ లున్నాయి. వైసీపీ ప్రభుత్వం రాగానే కీలకమైన శాఖకు అధిపతిగా నియమితులయ్యారు. పారిశ్రామిక వేత్తలతో ఆయన వ్యవహరించే తీరు సరిగా లేదంటూ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం అక్కడి నుంచి ఆయన్ను తప్పించింది. కొన్నాళ్లు ఖాళీగా ఉన్నారు. ఆ తర్వాత ఆర్టీసీ ఎండీగా నియమితులైనా మార్పు రాలేదు. అగ్నిమాపక శాఖలో ఫైళ్లన్నీ పెండింగ్‌లో పెట్టడం, సిబ్బంది పని విధానాన్ని ఇష్టారీతిన మార్చడంతో వివాదాస్పదంగా మారారు.
రెండు సార్లు ఉపేక్షించిన ప్రభుత్వం మూడోసారి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. గతేడాది నుంచి పోస్టింగ్ లేకుండా ఉంటున్నారు. ఆయన ఎక్కడ పని చేసినా కొందరు ప్రైవేటు వ్యక్తుల్ని తన పనులు చేసేందుకు నియమించుకుంటారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో కీలకమైన పోస్టింగ్‌లో చేరిన వెంటనే పదిమందికి పైగా సహాయకుల్ని నియమించుకుని ప్రభుత్వం నుంచి జీతాలు చెల్లించారు. ఆ తర్వాత రవాణా సంస్థ అకౌంట్ నుంచి చెల్లించేలా ఏర్పాటు చేశారు. అనంతరం అగ్నిమాపక శాఖ నుంచి జీతాలు చెల్లించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో తనకు హోంగార్డులు అవసరమున్నారంటూ ఆ 14 మందిని నియమించుకున్నారు.
తనకు వ్యక్తిగత సహాయకురాలిగా ఉండే ‘మేడమ్’ను సైతం హోంగార్డు కింద చూపించి మరో పద్దు నుంచి అదనంగా కొంత మొత్తం చెల్లించే ఏర్పాట్లు చేశారు. సార్ వ్యవహారంపై అగ్నిమాపక శాఖ సిబ్బంది నిరసన తెలపడం, ప్రభుత్వ పెద్దల వద్ద మంత్రి ఆవేదన వ్యక్తం చేయడంతో చివరకు పోస్టింగ్ పోయింది. కానీ ఆయన నియ మించుకున్న హోంగార్డులకు మాత్రం ఇప్పటికీ జీతాలు అందుతూనే ఉన్నాయి. ఆయన తర్వాత మరో డీజీ మారినా పన్నెండు మందికి ఇస్తున్నారు. వారికి జీతాలు ఇచ్చేది ఫైర్ డిపార్ట్‌మెంట్. పని చేసేదేమో మాజీ బాస్ ఇంట్లో. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ శాఖలో హోంగార్డుల్ని నియమించుకోవాలన్నా పోలీసుశాఖ ఎంపిక చేస్తుంది. కానీ అగ్నిమాపక శాఖలో అందుకు విరుద్ధంగా నియామకాలు జరిగినా అభ్యంతరం చెప్పలేదు. పని చేయకున్నా జీతాలు మాత్రం చెల్లిస్తున్నారు.