AP Highcourt: అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట

ABN , First Publish Date - 2023-09-06T16:13:14+05:30 IST

టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. అర్నేష్‌ కుమార్ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది.

AP Highcourt: అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట

అమరావతి: టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి (TDP Leader Ayyannapatrudu)హైకోర్టులో(AP Highcourt) ఊరట లభించింది. అర్నేష్‌ కుమార్ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. గన్నవరం నియోజకవర్గంలోని ఆత్కూర్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని అయ్యన్నపాత్రుడు హైకోర్టును ఆశ్రయించారు. సీఎం జగన్, ఇతర ప్రజా ప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే పేర్ని నాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై అయ్యన్నపాత్రుడు వేసిన పిటీషన్‌పై ఈరోజు(బుధవారం) హైకోర్టులో విచారణ జరిగింది. న్యాయవాది వీవీ సతీష్ వాదనలు వినిపించారు. పోలీసులు నమోదు చేసిన ఐపీసీ సెక్షన్‌‌లు 505(2) , 153A పిటిషనర్‌కు వర్తించదని వాదించారు. అసభ్య పదజాలం ప్రచురించి ప్రచారం చేసిన వారికి 505(2) వర్తిస్తుందని సతీష్ చెప్పారు.


ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులపై అలాంటి పద ప్రయోగం చేయవచ్చా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇలాంటి భాషను వాడటం సరికాదని హైకోర్టు చెప్పింది. అధికార పార్టీ నేతలు అసభ్య పదజాలం వాడటం వల్లే ఇటువంటి భాషను వాడాల్సి వచ్చిందని న్యాయవాది సతీష్ కోర్టుకు తెలియజేశారు. రాజకీయ కక్షతోనే కేసు పెట్టారని వాదించారు. పిటీషనర్‌కు ఇటువంటి భాష వాడటం అలవాటు అయిపోయిందని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అర్నేష్‌ కుమార్ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శక సూత్రాలను పాటించాలని హైకోర్టు ఆదేశించింది.

Updated Date - 2023-09-06T16:13:14+05:30 IST