Chandrayaan-3: విజయంపై ప్రముఖులు ఏమన్నారంటే..
ABN , First Publish Date - 2023-08-23T21:37:28+05:30 IST
చంద్రుని దక్షణ ధృవంపై చంద్రయాన్-3 (Chandrayaan-3)విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేయడంతో పాటు విజయాన్ని సాధించిన ఇస్రో శాస్త్రవేత్తల(ISRO scientists)కు పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి ప్రయోగాలు మరిన్ని విజయవంతం కావాలని కోరుకుంటూ చంద్రయాన్-3 కోసం అహర్నిశలు కృషి చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
చంద్రుని దక్షణ ధృవంపై చంద్రయాన్-3 (Chandrayaan-3)విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేయడంతో పాటు విజయాన్ని సాధించిన ఇస్రో శాస్త్రవేత్తల(ISRO scientists)కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి ప్రయోగాలు మరిన్ని విజయవంతం కావాలని కోరుకుంటూ చంద్రయాన్-3 కోసం అహర్నిశలు కృషి చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
నెగిటివ్ కామెంట్లను ఇస్రో బుస్టింగ్గా తీసుకుంది: గవర్నర్ తమిళిసై
ఇస్రో శాస్త్రవేత్తలకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరి ప్రార్థనా ఫలమే చంద్రయాన్-3 విజయం. నెగిటివ్ కామెంట్లను కూడా ఇస్రో ఒక బుస్టింగ్గా తీసుకుంది. ఒక ప్లాన్, కమిట్మెంట్తోనే ఇది సాధ్యమైందని తమిళిసై పేర్కొన్నారు.
చంద్రయాన్-3 ప్రయోగం సంపూర్ణ విజయం: సీఎం కేసీఆర్
చంద్రయాన్-3 ప్రయోగం సంపూర్ణ విజయాన్ని సాధించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. చంద్రుని దక్షిణ ధ్రువం మీదకు ల్యాండర్ మాడ్యూల్‌ను చేర్చిన మొట్టమొదటి దేశంగా ప్రపంచ అంతరిక్ష పరిశోధన రంగంలో భారతదేశం సరికొత్త అధ్యాయాన్ని లిఖించిందని కేసీఆర్ పేర్కొన్నారు.
దేశానికి చందమామ అందిన రోజు: నారా లోకేశ్
దేశానికి చందమామ అందిన రోజుని ఇస్రో తీసుకొచ్చిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. చంద్రయాన్-3 విజయం అవధుల్లేని ఆనందం కలిగించింది. ఇస్రో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇస్రో శాస్త్రవేత్తలకు, చంద్రయాన్-3 టీమ్‌కు నారా లోకేశ్ అభినందనలు తెలిపారు.
మరిన్ని ప్రయోగాలకు స్ఫూర్తి: పవన్ కల్యాణ్
ఇస్రో శాస్త్రవేత్తలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ఇది దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన విజయం.చంద్రయాన్-3 విజయం మరిన్ని ప్రయోగాలకు స్ఫూర్తి. ఇస్రో బృందానికి వెన్నుదన్నుగా నిలిచిన.. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి పవన్ అభినందనలు తెలిపారు.
ఇస్రో చరిత్రలో ఇదొక శుభదినం: రేవంత్‌రెడ్డి
చంద్రయాన్-3 విజయవంతం పట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు,వారి కృషి ఫలించింది. శాస్త్రవేత్తల్లో మరింత ఆత్మవిశ్వాసం పెంచింది. ఇది భారత దేశ చారిత్రాత్మకమైన ఘట్టం.. ఇస్రో చరిత్రలో ఇదొక శుభదినం అని రేవంత్‌రెడ్డి తెలిపారు.
ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచాం: పురంధేశ్వరి
ఇస్రో శాస్త్రవేత్తలకు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అభినందనలు తెలిపారు. చంద్రయాన్-3 విజయవంతం కావడం ఆనందంగా ఉంది. మోదీ ఆధ్వర్యంలో మరో అద్భుతమైన మైలురాయిని చేరాం. అంతరిక్ష పరిశోధనలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచామని పురంధేశ్వరి పేర్కొన్నారు.
ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు : నందమూరి బాలకృష్ణ
చరిత్ర సృష్టించిన భారత శాస్త్రవేత్తలకు తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభినందనలు తెలిపారు. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిన భారత శాస్త్రవేత్తలకు, వారిని ప్రోత్సహించిన భారత ప్రభుత్వానికి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు.