Yanamala Ramakrishnudu: 2024 రాజకీయ సునామీలో వైసీపీ ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోతుంది
ABN , Publish Date - Dec 29 , 2023 | 04:19 PM
2024లో రానున్న రాజకీయ సునామీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. అబద్ధాలు, అసత్య ప్రచారాలు, కుట్రలు కుతంత్రాలు...
Yanamala Ramakrishnudu On YCP: 2024లో రానున్న రాజకీయ సునామీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. అబద్ధాలు, అసత్య ప్రచారాలు, కుట్రలు కుతంత్రాలు, మోసకారి హామీల పునాదులపై కట్టిన వైసీపీ పునాదులు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నుండి జగన్‌కు వ్యతిరేక గాలి వీస్తోందని పేర్కొన్నారు. జగన్ రెడ్డిని ఒక్కొక్కరుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు వదిలేస్తున్నారని చెప్పారు. టిక్కెట్ ఇస్తామన్నా.. ‘‘మాకొద్దు మహాప్రభో, గౌరవం లేని చోట మేం ఉండలేం’ అని తేల్చి చెప్పేస్తున్నారని వెల్లడించారు.
వైనాట్ 175 అంటున్న జగన్ రెడ్డికి తమ సొంత గడ్డ పులివెందులలోనే గెలిచే పరిస్థితులు లేవని యనమల ధ్వజమెత్తారు. 2019లో జగన్ వదిలిన బాణం తిరిగి అతనివైపే దూసుకొస్తోందని.. పులివెందులలో అతనిని ఓడించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి అరాచకాలు, అన్యాయాలు, దుర్మార్గాలకు బుద్ధి చెప్పేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఉద్ఘాటించారు. 2024లో జగన్ రెడ్డిని గద్దె దించేందుకు అన్ని సామాజికవర్గాలు రెడీగా ఉన్నాయన్నారు. ‘‘సైకోపోవాలి.. సైకిల్ రావాలి’’ అనే నినాదాన్ని రాష్ట్ర ప్రజలు అందుకున్నారని.. 2024లో విజయ దుందుభి మోగించేది తమ తెలుగుదేశం పార్టీనే అని నమ్మకం వెలిబుచ్చారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపుని అడ్డుకోవడం ఎవరివల్లా కాదని తేల్చి చెప్పారు.
అంతకుముందు కూడా.. ఏపీ సీఎం జగన్‌పై యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. నిశ్శబ్ద విప్లవం బహిరంగ విప్లవమవుతోందని అన్నారు. రాష్ట్రంలో ప్రజలంతా నిశ్శబ్దంగా ఉన్నారని వైసీపీ భావిస్తోందని.. జగన్ రెడ్డి దోపిడీ, మితిమీరిన అహంకారంతో ప్రజల తిరుగుబాటు బహిరంగమవుతోందని పేర్కొన్నారు. తొలుత జగన్ చేతకాని పాలనపై సొంత ఎంపీ రఘురామకృష్ణమ రాజు బయటపెట్టారని.. తర్వాత ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగరేశారని చెప్పారు. పంచాయతీల్లోని సమస్యలపై ఎంపీటీసీలు, సర్పంచులు గళం విప్పి నిలదీశారనిక.. అభ్యర్ధుల మార్పు నిర్ణయాలతో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సైతం ధిక్కార స్వరం వినిపిస్తున్నారని ఎద్దేవా చేశారు.