Education: విదేశీ విద్య పథకంలో ఎస్సీ, ఎస్టీల్లో లబ్ధిపొందింది ఎంత మందో తెలిస్తే..!

ABN , First Publish Date - 2023-07-28T12:41:05+05:30 IST

దేశీ విద్యా దీవెన పథకం అమలు తీరు అంతా మిథ్యగా తయారైంది. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా వైసీపీ సర్కారు (Ycp Government) నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది. ఇప్పటికే కల్యాణమస్తు పథకంలో వధూవరులకు టెన్త్‌క్లాస్‌ అర్హత పెట్టారు.

Education: విదేశీ విద్య పథకంలో ఎస్సీ, ఎస్టీల్లో లబ్ధిపొందింది ఎంత మందో తెలిస్తే..!

జగన్ సర్కార్ మరో ఝలక్

లబ్ధిదారుల సంఖ్య తగ్గింపునకు ఎత్తులు

వర్సిటీలకు సబ్జెక్టుల వారీగా ర్యాంకింగ్‌లు

50లోపు ర్యాంకు ఉంటేనే ఇస్తామని మెలిక

ఈ సంవత్సరం 144 మందికే ప్రయోజనం

భారీగా తగ్గిన ఎస్టీ, ఎస్టీ లబ్ధిదారుల సంఖ్య

ఈసారి ఐదుగురు ఎస్సీ విద్యార్థులకే లబ్ధి

మంత్రుల తీరుపై ఆయా వర్గాల మండిపాటు

(అమరావతి- ఆంధ్రజ్యోతి): విదేశీ విద్యా దీవెన పథకం అమలు తీరు అంతా మిథ్యగా తయారైంది. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా వైసీపీ సర్కారు (Ycp Government) నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది. ఇప్పటికే కల్యాణమస్తు పథకంలో వధూవరులకు టెన్త్‌క్లాస్‌ అర్హత పెట్టారు. ఈ పథకం లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు వైసీపీ సర్కారు ఉన్న దారులన్నీ వెతుకుతోంది. విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలనుకొనే ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సాయం అందించాలన్నదే విదేశీ విద్యాదీవెన పథకం లక్ష్యం. గత టీడీపీ ప్రభుత్వంలో అమలైన ఈ పథకాన్ని వైసీపీ అధికారంలోకి రాగానే అటకెక్కించింది. క్షేత్రస్థాయిలో ఆందోళనలతో ఇటీవలే జగనన్న విదేశీ విద్యాదీవెన పేరుతో పునరుద్ధరించింది. అయితే నిబంధనలు మరింత కఠినతరం చేయడంతో పాటు విద్యార్థులకు సరిగ్గా అవగాహన కల్పించకపోవడంతో చాలామంది పథకానికి దూరమయ్యారు. మొదట 200 క్యూఎస్‌ ర్యాంకింగ్‌ కలిగిన విదేశీ యూనివర్సిటీల్లో సీట్లు పొందిన విద్యార్థులకే ప్రభుత్వం విదేశీ విద్య సాయాన్ని అందిస్తుందని ప్రకటించారు. దాంతో చంద్రబాబు హయాంలో అమలైన పథకంతో పోలిస్తే లబ్ధిదారుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. చంద్రబాబు హయాంలో 4,923 మందికి ఈ పథకం ద్వారా ప్రయోజనం అందిస్తే, గతేడాది కేవలం 213 మందికి అమలుచేసి చేతులు దులుపుకున్నారు. తాజాగా ఆ సంఖ్యను కూడా మరింత తగ్గించేందుకు కొత్త ఎత్తులు వేశారు. క్యూఎస్‌ ర్యాంకింగ్‌ కాకుండా ఆయా సబ్జెక్టుల వారీగా వర్సిటీల ర్యాంకింగ్‌ 50లోపు ఉంటేనే విదేశీ విద్య కల్పిస్తామని మెలిక పెట్టారు. ఒక్కో సబ్జెక్ట్‌కు 50 నుంచి 70 యూనివర్సిటీలను కేటాయించారు. ప్రభుత్వం నిర్దేశించిన 21 సబ్జెక్టుల వారీగా టాప్‌-50 ర్యాంకుల్లో నిలిచిన వర్సిటీల్లో సీట్లు సంపాదించిన వారికి మాత్రమే విదేశీ విద్య సాయం అందించనున్నారు. దీంతో ఈ ఏడాది లబ్ధిదారుల సంఖ్య మరింత తగ్గిపోయింది. గతేడాది 213 మందికి బటన్‌ నొక్కగా, ఇప్పుడు రెండేళ్లకూ కలిపి 357 మందికి లబ్ధి కలిగిస్తూ సీఎం జగన్‌ (Cm jagan) గురువారం బటన్‌ నొక్కారు. దీంతో గతేడాది పోను ఈ ఏడాది కొత్తగా 144 మందికే పథకం మంజూరైంది.

పేద విద్యార్థులకు బురిడీ

పథకాల అమల్లో రకరకాల డ్రామాలాడుతున్న జగన్‌ సర్కారు... విదేశీ విద్యలో పేద విద్యార్థులకు బురిడీ కొట్టింది. గతంలో చంద్రబాబు ఇచ్చిన సాయం గోరంత.... తాము ఇవ్వబోయేది కొండంత అంటూ గత ఎన్నికల సమయంలో జగన్‌ డప్పాలు కొట్టుకున్నారు. అప్పట్లో పలువురు ఐఏఎస్‌ అధికారులు కసరత్తు చేసి రూపొందించిన మార్గదర్శకాలను కాదని, జగనన్న విదేశీ విద్యాదీవెన పేరుతో కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేశారు. ఏకంగా సీఎస్‌ ఇచ్చిన ఉత్తర్వుల్లోనే గత ప్రభుత్వంలో ఈ పథకం విద్యార్థులకు ఉపయోగపడలేదని, అందుకే తాము కొత్త మార్గదర్శకాలు తెచ్చామని ప్రకటించుకున్నారు. గతం టీడీపీ హయాంలో విదేశాల్లో ఏ యూనివర్సిటీలో సీట్లు తెచ్చుకున్నా... విదేశీ విద్య అమలు చేశారు. అయితే కొత్త నిబంధనల ప్రకారం 200 క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌ యూనివర్సిటీల్లో సీట్లు పొందిన వారికే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చారు. దాని పర్యవసానంగా 10శాతం మందే లబ్ధి పొందారు. తాజాగా సబ్జెక్టుల వారీగా 50 లోపు ర్యాంకు వచ్చిన వర్సిటీల్లో చేరేవారికే సాయం అందిస్తున్నారు.’’’

ఎస్సీ, ఎస్టీలకు దగా...

విదేశీ విద్య పథకంలో ఈసారి ఎస్సీల లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గతేడాది కేవలం 28మంది లబ్ధి పొందగా, ఈ ఏడాది ఐదుగురు మాత్రమే అర్హత సాధించారు. ఎస్టీ లబ్ధిదారుల సంఖ్య కూడా దారుణంగా పడిపోయింది. అయితే ఆ వివరాలు బహిర్గతం కాకుండా సర్కారు జాగ్రత్తలు తీసుకుంది. గత టీడీపీ హయాంలో ఆఖరి సంవత్సరంలోనే 300 మంది ఎస్సీలకు విదేశీ విద్య కోసం ఫీజు అందిస్తే.. వైసీపీ సర్కారు రెండేళ్లలో కేవలం 33మందికి ఇచ్చినట్లు ప్రకటించింది. అంటే అప్పట్లో ఇచ్చిన సంఖ్యలో 10శాతం మాత్రమే. ఇక ఎస్టీ విద్యార్థుల విషయానికొస్తే గతేడాది ఒక్కరు కూడా ఈ పథకంలో అర్హత సాధించలేదు. అంటే ఒక్క ఎస్టీ విద్యార్థికి కూడా జగన్‌ ప్రభుత్వం విదేశీ విద్య ప్రయోజనం కల్పించలేదు. ఓవైపు ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల సంఖ్య దారుణంగా పడిపోయినా, గత ప్రభుత్వంలో ఇచ్చిన సంఖ్య కంటే తక్కువగా ఇచ్చినా కూడా ఆయా శాఖల మంత్రులు మాత్రం సీఎం జగన్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆ మంత్రుల తీరుపై ఎస్సీ, ఎస్టీ వర్గాలు మండిపడుతున్నాయి.

Updated Date - 2023-07-28T12:41:05+05:30 IST