Moon Houses: 2040 నాటికల్లా చంద్రునిపై మానవుల కోసం ఇళ్లు.. ప్రణాళికలు చేపట్టిన నాసా | NASA Plans To Build Homes For Humans On The Moon By 2040 ABK

Moon Houses: 2040 నాటికల్లా చంద్రునిపై మానవుల కోసం ఇళ్లు.. ప్రణాళికలు చేపట్టిన నాసా

ABN , First Publish Date - 2023-10-03T16:58:00+05:30 IST

భారత్‌తో పాటు మరికొన్ని దేశాల్లోని అంతరిక్ష పరిశోధన సంస్థలు ఇప్పటికే చంద్రునిపై పలు అధ్యయనాలు జరిపాయి. మానవ జీవనానికి అనువైన వాతావరణం అక్కడ ఉందా? లేదా? అనే విషయంపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే...

Moon Houses: 2040 నాటికల్లా చంద్రునిపై మానవుల కోసం ఇళ్లు.. ప్రణాళికలు చేపట్టిన నాసా

భారత్‌తో పాటు మరికొన్ని దేశాల్లోని అంతరిక్ష పరిశోధన సంస్థలు ఇప్పటికే చంద్రునిపై పలు అధ్యయనాలు జరిపాయి. మానవ జీవనానికి అనువైన వాతావరణం అక్కడ ఉందా? లేదా? అనే విషయంపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే.. అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా మాత్రం ఒక అడుగు ముందుకేసి, అక్కడ మానవుల కోసం గృహాలను నిర్మించాలని ప్రణాళికలు రచిస్తోంది. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. 2040 నాటికల్లా చంద్రునిపై ఇళ్ల నిర్మాణాలను నాసా చేపట్టనుందట! చంద్రుని ఉపరితలంపై పరిశోధనలు జరిపేందుకు గాను వ్యోమగాములు అత్యధిక సమయం చంద్రునిపై ఉండేందుకు ఈ నిర్మాణాలు తోడ్పడుతాయని నాసా భావిస్తోంది. 3డీ ప్రింటర్లను చంద్రునిపైకి పంపించి.. అక్కడున్న రాక్ చిప్స్, ఖనిజ శకలాల సహకారంతో ఈ ఇళ్లను నాసా నిర్మించనుంది.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

ఈ విషయంపై నాసా డైరెక్టర్ నిక్కీ వెర్కీసర్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం మనం అత్యంత కీలకమైన సమయంలో ఉన్నాం. కొన్ని మార్గాల్లో ఇది ఒక కలలా అనిపించొచ్చు. మరికొన్ని మార్గాల్లో.. చంద్రునిపైకి చేరుకోవడం అనివార్యమని అనిపిస్తుంది. పలు విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో.. అత్యాధునిక సాంకేతిక ఆధారంగా ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని అనుకుంటున్నాం. మేమంతా ఒక ఉమ్మడి లక్ష్యంతో.. సరైన సమయంలో సరైన వ్యక్తులను ఒక చోటుకి చేర్చాం. చంద్రునిపైకి మేము తప్పకుండా చేరుకుంటామని భావిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ అడుగు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకు తగిన ప్రధాన సామర్థ్యాలను అభివృద్ధి చేస్తే.. చంద్రునిపైకి చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ప్రస్తుతం 3డీ ప్రింటర్ పరిశోధన దశలో ఉంది. దీని పనితీరుని మేము పరిక్షిస్తున్నాం. 2024 ఫిబ్రవరిలో ఈ 3డీ ప్రింటర్‌ను చంద్రునిపైకి పంపుతాం’’ అని చెప్పుకొచ్చారు.

అయితే.. అంతకన్నా ముందు ఆర్టెమిస్-2, ఆర్టెమిస్-3 ప్రయోగాలకు నాసా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంతకుముందు చేపట్టిన ఆర్టెమిస్-1 మిషన్ విఫలమైంది. ఇందులో మనుషులు కాకుండా రోబోట్స్‌ మాత్రమే ఉంచి, కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి పంపాలనుకున్నారు. అయితే.. ఇది చివరి నిమిషంలో బ్లాస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆర్టెమిస్-2 మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాముల్ని పంపించేందుకు నాసా రెడీ అవుతోంది. అయితే.. వీళ్లు నేరుగా చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అవ్వరు. చంద్రుని ఉపరితలానికి 9 వేల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి వెళ్లి, చంద్రుడిని చుట్టేసి వస్తారు. ఈ యాత్ర విజయవంతం అయ్యాక.. 2025 లేదా 2026లో ఆర్టెమిస్-3 మిషన్‌ని స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ సహాయంతో నాసా చేపడుతుంది. ఈ మిషన్‌లో భాగంగా ఒక మహిళతో పాటు నలుగురు వ్యోమగాములు చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అవుతారని నాసా పేర్కొంది.

Updated Date - 2023-10-03T16:58:00+05:30 IST