‘ఆర్డినెన్స్’పై సుప్రీంకు ఆప్
ABN , First Publish Date - 2023-07-01T03:03:37+05:30 IST
ఢిల్లీ ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న గ్రూప్-ఏ అధికారుల బదిలీ సహా వారిపై క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన అధికారాల విషయంలో ..
న్యూఢిల్లీ, జూన్ 30: ఢిల్లీ ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న గ్రూప్-ఏ అధికారుల బదిలీ సహా వారిపై క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన అధికారాల విషయంలో కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టుగా మారిందని శుక్రవారం దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది. తక్షణం స్టే విధించాలని అభ్యర్థించింది. ఈ ఆర్డినెన్స్ ఢిల్లీలో వేళ్లూనుకున్న ప్రజాస్వామ్య పాలనను, సమాఖ్య వ్యవస్థను ఉల్లంఘిస్తోందని పేర్కొంది. ఆర్టికల్ 123 ప్రకారం కేంద్రానికి రాజ్యాంగం ప్రసాదించిన ఆర్డినెన్స్ రూపొందించే అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని వివరించింది. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతానికి ఆర్టికల్ 239ఏఏ ప్రకారం రాజ్యాంగ బద్ధంగా లభించిన హామీలను ఈ ఆర్డినెన్స్ తుంగలో తొక్కుతోందని పేర్కొంది. మరోరకంగా కోర్టు ధిక్కరణకు కూడా పాల్పడినట్టేనని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్‌పై తక్షణమే స్టే విధించాలని కోర్టును కోరింది.