Haryana : అమృత్‌పాల్ సింగ్ గాలింపులో కీలక మలుపు
ABN , First Publish Date - 2023-03-23T18:06:42+05:30 IST
పంజాబ్ పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా పట్టుబడని ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh)కు, ఆయన సహచరుడు
న్యూఢిల్లీ : పంజాబ్ పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా పట్టుబడని ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh)కు, ఆయన సహచరుడు పపల్ ప్రీత్ సింగ్‌కు ఆశ్రయమిచ్చిన మహిళ బల్జీత్ కౌర్‌ను హర్యానా పోలీసులు (Haryana Police) అరెస్ట్ చేశారు. ఆమె హర్యానాలోని కురుక్షేత్ర జిల్లాలో తన ఇంట్లో వీరికి ఆశ్రయం ఇచ్చినట్లు తెలుస్తోంది.
వారిస్ పంజాబ్ డే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు వరుసగా ఆరో రోజు గురువారం కూడా గాలింపు జరుపుతున్నారు. మొదటి రోజు 50కి పైగా వాహనాల్లో ఆయనను పోలీసులు వెంటాడారు. అయినప్పటికీ వారి నుంచి ఆయన తప్పించుకోగలిగారు. ఆయన దేశం విడిచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించినట్లు కొందరు అనుమానిస్తున్నారు. ఆయన పంజాబ్ నుంచి తప్పించుకోగలిగినట్లు కనిపిస్తోంది.
హర్యానాలోని కురుక్షేత్ర పోలీసు సూపరింటెండెంట్ సురీందర్ సింగ్ భోరియా ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, షహబాద్ ప్రాంతంలో నివసిస్తున్న బల్జీత్ కౌర్ అనే మహిళను తాము అరెస్ట్ చేశామని చెప్పారు. ఆమె తన ఇంట్లో అమృత్‌పాల్ సింగ్, ఆయన సహచరుడు పపల్ ప్రీత్ సింగ్‌లకు ఆదివారం ఆశ్రయం ఇచ్చారని తెలిపారు. ఆమెను పంజాబ్ పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు.
పంజాబ్ పోలీసులు గురువారం అమృత్‌పాల్ ప్రైవేట్ భద్రతా సిబ్బందిలో ఒకరైన తేజిందర్ సింగ్ గిల్‌ను అరెస్ట్ చేశారు. అజ్నాలా పోలీస్ స్టేషన్‌పై దాడిలో ఈయన కూడా పాల్గొన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Modi surname: ఊహించని పరిణామం... రాహుల్‌కు మద్దతుగా నిలిచిన కేజ్రీవాల్
Rahul Gandhi Vs Rajnath Singh : రాహుల్ గాంధీకి శిక్షపై రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు