Delhi Mayor Election : ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్

ABN , First Publish Date - 2023-01-06T15:10:45+05:30 IST

ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ కౌన్సిలర్ల మధ్య ఘర్షణ, అరాచకం వల్ల ఢిల్లీ నగర పాలక సంస్థ (MCD) మేయర్ పదవికి

Delhi Mayor Election : ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్
Delhi Municipal Corporation

న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ కౌన్సిలర్ల మధ్య ఘర్షణ, అరాచకం వల్ల ఢిల్లీ నగర పాలక సంస్థ (MCD) మేయర్ పదవికి శుక్రవారం జరగవలసిన ఎన్నికలు వాయిదా పడ్డాయి. డిసెంబరులో ఎన్నికలు జరిగిన తర్వాత ఏర్పాటైన తొలి సమావేశంలో ఆప్, బీజేపీ కౌన్సిలర్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపైనా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పైనా పెద్ద ఎత్తున ఆరోపణలతో నినాదాలు చేశారు. దీంతో సమావేశం రసాభాస అయింది. దీంతో మేయర్ ఎన్నిక నిరవధికంగా వాయిదా పడింది.

ఈ సమావేశానికి తాత్కాలిక స్పీకర్‌గా బీజేపీ కౌన్సిలర్ సత్య శర్మను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (Lieutenant Governor VK Saxena) నియమించారు. సత్య శర్మ నామినేటెడ్ సభ్యుల చేత ముందుగా ప్రమాణ స్వీకారం చేయించేందుకు ప్రయత్నించారు. నామినేటెడ్ మెంబర్ మనోజ్ కుమార్‌ను ప్రమాణ స్వీకారానికి సత్య శర్మ ఆహ్వానించడంతో ఆప్ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు సభ మధ్యలోకి వెళ్లి నినాదాలు చేశారు. ఎన్నికైన కౌన్సిలర్లు ముందుగా ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంటుందని చెప్పారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా 10 మంది నామినేటెడ్ సభ్యులను లెఫ్టినెంట్ గవర్నర్ నియమించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో ఆప్, బీజేపీ కౌన్సిలర్లు ఒకరినొకరు తోసుకుంటూ, బిగ్గరగా అరుస్తూ, నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు.

మేయర్ పదవిని అనైతికంగా సొంతం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఆరోపించింది. ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ (Saurabh Bhardwaj) మాట్లాడుతూ, మేయర్ ఎన్నికలో నామినేటెడ్ కౌన్సిలర్లు పాల్గొనడంపై నిషేధం ఉందన్నారు. మేయర్ పదవిని అనైతిక మార్గాల్లో పొందాలని బీజేపీ గూండాలు ప్రయత్నిస్తున్నారన్నారు. యావత్తు ఢిల్లీ ప్రజలు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, బీజేపీ గూండాయిజాన్ని గమనిస్తున్నారని చెప్పారు. తాము కాంగ్రెస్ పార్టీ వంటివారం కాదని, తమది ఆమ్ ఆద్మీ పార్టీ అని, బీజేపీని ఎలా ఎదుర్కొనాలో తమకు తెలుసునని చెప్పారు. బీజేపీ నేతల భాషలోనే వారికి ఎలా సమాధానం చెప్పాలో తమకు తెలుసునన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ నేతల ప్రవర్తన అత్యంత సిగ్గు చేటు అని బీజేపీ ఆరోపించింది. వారి సిగ్గు చేటు ప్రవర్తనతో అత్యంత దారుణమైన అరాచకం పరాకాష్టకు చేరుకుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ నేత బైజయంత్ జయ్ పాండా మాట్లాడుతూ, ఢిల్లీ నగర పాలక సంస్థలో కౌన్సిలర్ల సభలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతల సిగ్గు చేటు ప్రవర్తనలో వారి అరాచకం పరాకాష్టకు చేరిందన్నారు. ఆప్ కౌన్సిలర్లు రాజ్యాంగాన్ని కొంచెం అయినా గౌరవించలేదన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ నియమించిన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయకుండా భౌతిక దాడులకు తెగబడటం ఎంత మాత్రం ఆమోదించదగినది కాదన్నారు.

బీజేపీ ఎంపీ పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ ఇచ్చిన ట్వీట్‌లో, ఆమ్ ఆద్మీ పార్టీ ధరించిన అప్రజాస్వామిక ముసుగు నేడు తొలగిపోయిందన్నారు. దేశానికి ఆ పార్టీ నిజ స్వరూపం వెల్లడైందన్నారు. ఢిల్లీ నగర పాలక సంస్థకు మేయర్ నియామకం జరగనేలేదని, అయినప్పటికీ, ఆప్ గూండాల గూండాయిజం ప్రారంభమైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవింద్ కేజ్రీవాల్ తన నివాసంలో అధికారులను కొడుతుంటారని, ఆయన (AAP) ఎమ్మెల్యేలు పెద్దలను కొడుతూ ఉంటారని, ఇది సిగ్గు చేటు అని మండిపడ్డారు.

ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్య శర్మ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, సభను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు తాను ప్రయత్నించానని చెప్పారు. ప్రశాంతంగా కూర్చోవాలని తాను సభ్యులను కోరానని, కానీ రసాభాస చేయాలని వారు కోరుకున్నారని ఆరోపించారు. సభ సాధారణ స్థితికి చేరుకుంటే, అందరు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

ఆప్, బీజేపీ సభ్యులు గందరగోళం కొనసాగించడంతో మేయర్ ఎన్నిక కోసం ఓటింగ్ ప్రారంభం కాకుండానే సభ వాయిదా పడింది. తదుపరి కార్యాచరణను ప్రిసైడింగ్ ఆఫీసర్ నిర్ణయిస్తారని తెలుస్తోంది. శుక్రవారం పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే, సభను శనివారం సమావేశపరచవచ్చునని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ తెలిపింది.

Updated Date - 2023-01-06T15:20:40+05:30 IST

News Hub