Indigo Flight: ఇండిగో విమానంలో ఊహించని ఘటన.. రక్తపు వాంతులు చేసుకున్న ప్రయాణికుడు.. ఆ తర్వాత ఏమైందంటే?
ABN , First Publish Date - 2023-08-22T15:49:43+05:30 IST
ఇండిగో విమానం గాల్లో ఉన్నప్పుడు ఒక ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఒక ప్రయాణికుడు ఉన్నట్లుండి రక్తపు వాంతులు చేసుకున్నాడు. దీంతో.. విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అయితే..
ఇండిగో విమానం గాల్లో ఉన్నప్పుడు ఒక ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఒక ప్రయాణికుడు ఉన్నట్లుండి రక్తపు వాంతులు చేసుకున్నాడు. దీంతో.. విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అయితే.. అతను అప్పటికే మృతి చెందాడు. మృత్యువాత పడ్డ ప్రయాణికుడు (62) ముంబై నుంచి రాంచీకి వెళ్లే 6E 5093 అనే ఇండిగో విమానం సోమవారం రాత్రి 8 గంటలకు ఎక్కాడు. విమానం టేకాఫ్ అయ్యి, కాసేపు గాల్లో ఎగిరేంతవరకు అతడు బాగానే ఉన్నాడు. కానీ, ఉన్నట్లుండి అతడు ఒక్కసారిగా రక్తపు వాంతులు చేసుకున్నాడు. ఇది గమనించిన విమాన సిబ్బంది, వెంటనే పైలట్‌కు సమాచారం అందించారు. పైలట్ ఉన్నతాధికారుల్ని సంప్రదించి.. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా నాగ్‌పూర్‌కి మళ్లించి, బాబా సాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు.
ఆ ప్రయాణికుడ్ని వెంటనే ఎయిర్‌పోర్ట్ నుంచి నాగ్‌పూర్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కానీ.. అతడు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కిమ్స్ ఆసుపత్రికి చెందిన వైద్య నిపుణుడు ఏజాజ్ షమీ మాట్లాడుతూ.. మృతుడు క్షయవ్యాధి, కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని తెలిపారు. ఆ సమస్యల వల్లే అతడు విమానంలో రక్తపు వాంతులు చేసుకున్నాడన్నారు. ఆసుపత్రికి తీసుకొచ్చేలోపే అతడు ప్రాణాలు విడిచాడని చెప్పారు. మరోవైపు.. ఈ ఘటనపై ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా స్పందించింది. ఇండిగో 6E 5093 విమానంలో ఒక ప్రయాణికుడు అనారోగ్యం కారణంగా రక్తం కక్కుకున్నాడని, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి అతడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించామని, కానీ దురదృష్టవశాత్తు అతడు ప్రాణాలు కోల్పోయాడని ఓ ప్రకటనలో ఎయిర్‌లైన్స్ తెలిపింది.