PM Modi: 6న రామేశ్వరంలో ప్రధాని మోదీ పర్యటన
ABN , Publish Date - Apr 02 , 2025 | 10:55 AM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 6వ తేదీన రామేశ్వరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పాంబన్ వంతెనను ఆయన ప్రారంభించనున్నారు. అలాగే పలు కార్యక్రమాల్లో కూడా ప్రధాని పాల్గొననున్నారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు అటు అధికార యంత్రాంగం ఇటు బీజేపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు.

- అపాయింట్‌మెంట్ కోరిన ఈపీఎస్
చెన్నై: ఈ నెల 6న రామేశ్వరం(Rameshwaram) ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. ప్రధాని కోసం మండపం క్యాంప్ హెలిపాడ్‌లో మంగళవారం ఉదయం వైమానిక దళానికి చెందిన రెండు హెలికాప్టర్లతో ట్రయల్ రన్ నిర్వహించారు. అదే సమయంలో రామేశ్వరంలో ప్రధాని మోదీని కలుసుకునేందుకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) అపాయింట్‌మెంట్ కోరారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా(Union Home Minister Amit Shah) చొరవ మేరకు బీజేపీ, అన్నాడీఎంకే మధ్య పొత్తు ఖరారు చేసుకునే విషయమై మోదీతో ఈపీఎస్ చర్చలు జరుపనున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తను కూడా చదవండి: Chicken Neck History: ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన చికెన్ నెక్ చరిత్ర ఇదే
అధికారిక సమాచారం మేరకు ఈ నెల 6న ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మదురై విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుండి వైమానిక దళం హెలికాప్టర్‌లో రామేశ్వరం మండపం క్యాంప్ సమీపంలో ఉన్న హెలిపాడ్‌లో దిగుతారు. అక్కడి నుండి కారులో పాంబన్ వంతెన ప్రాంతానికి చేరుకుంటారు. కొత్త వంతెనను అధికారులతో కలిసి పరిశీలించిన తర్వాత ఆ వంతెన ప్రారంభోత్సవం కోసం రామేశ్వరం బస్‌స్టేషన్ సమీపంలో వేదిక ప్రాంతానికి చేరుకుంటారు. ఆ ప్రత్యేక వేదికపై నుండి మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రూ.550 కోట్లతో నిర్మించిన పాంబన్ వంతెనను ప్రారంభిస్తారు.
ఈ నేపథ్యంలో మోదీ పర్యటనను పురస్కరించుకుని సుమారు ఐదువేలమందికి పైగా పోలీసులతో రామేశ్వరం అంతటా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మోదీ తన పర్యటనలో భాగంగా పర్వతవర్థినీ సమేత రామనాధస్వామివారి ఆలయాన్ని కూడా సందర్శించనున్నారు. దీంతో ఆ ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే మఫ్టీలో పోలీసులు నిఘా వేస్తున్నారు. మంగళవారం ఉదయం నుండి తూత్తుకుడి, తిరునల్వేలి, కన్నియాకుమారి, విరుదునగర్ తదితర జిల్లాల నుండి సాయల్‌కుడి ఈస్ట్‌కో్‌స్టరోడ్డు మీదుగా రామనాథపురం, రామేశ్వరం వైపు వచ్చే అన్ని వాహానాలను సముద్రతీర భద్రతాదళం ఏఎస్పీ ఆదేశాలతో ఎస్‌ఐ పాల్‌రాజ్ ప్రత్యేక బృందం తనిఖీ చేసిన మీదటే అనుమతిస్తున్నారు.
ఇదిలా ఉండగా ప్రధాని నరేంద్రమోదీని కలుసుకునేందుకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు మదురైలో ప్రధాని మోదీతో భేటీ కోసం అపాయింట్‌మెంట్ కోరుతూ ప్రధాని కార్యాలయానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఇటీవల అమిత్‌షాతో ఈపీఎస్ భేటీ తరువాత అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు, సెంగోట్టయ్యన్ కూడా అమిత్‌షాతో రహస్యంగా సమావేశమయ్యారు. అన్నాడీఎంకేలో జరుగుతున్న అంతర్గత విభేదాలను మరచి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు దిశగా తదుపరి చర్యలు తీసుకోమంటూ సెంగోటయ్యన్‌కు అమిత్‌షా సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితులలోనే ప్రధాని మోదీతో భేటి అయ్యేందుకు ఈపీఎస్ అప్పాయింట్‌మెంట్ కోరినట్లు అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
Ipupuva Laddu: ఇప్పపువ్వు లడ్డూ!
ప్రయాణికులకు తప్పనున్న చిల్లర తిప్పలు
Read Latest Telangana News and National News