Former Chief Minister: మా పార్టీకి ఎవరి దయాదాక్షిణ్యాలూ అక్కర్లేదు
ABN , First Publish Date - 2023-02-11T07:44:04+05:30 IST
అన్నాడీఎంకేకు ఎవరి దయదాక్షిణ్యాలు అక్కర్లేదని సొంతబలంతోనే ఈరోడ్ ఈస్ట్ నియోజకవర్గ ఉప ఎన్నికలో గెలిచే సత్తా తమకుందని

చెన్నై, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకేకు ఎవరి దయదాక్షిణ్యాలు అక్కర్లేదని సొంతబలంతోనే ఈరోడ్ ఈస్ట్ నియోజకవర్గ ఉప ఎన్నికలో గెలిచే సత్తా తమకుందని ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) ధీమా వ్యక్తం చేశారు. తిరునల్వేలిలో పార్టీ ప్రముఖుడి ఇంట జరిగిన వివాహవేడుకలో ఆయన పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈరోడ్ నియోజకవర్గం ప్రజలకు రూ.484కోట్ల వ్యయంతో కావేరి నది నుంచి సురక్షిత తాగునీటి సరఫరా పథకాన్ని అమలు చేశామన్నారు. గత ఇరవై నెలలుగా డీఎంకే(DMK) ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. డెల్టా జిల్లాల్లో పంట నష్టాలకు అన్నాడీఎంకే ప్రభుత్వం హెక్టారుకు రూ.20వేల నష్టపరిహారం ప్రకటిస్తే అప్పట్లో ప్రతిపక్షనేతగా ఉన్న స్టాలిన్ రూ.30 వేలు చెల్లించాలని పట్టుబట్టారని, ప్రస్తుతం డెల్టా జిల్లాల్లో వర్షాలకు పంట కోల్పోయినవారికి రూ.20వేల నష్టపరిహారమే చెల్లించటం గర్హనీయమన్నారు. అన్నాడీఎంకే ఎప్పుడూ ఇతర పార్టీల మద్దతుతో మనుగడ సాధించలేదని, తమ పార్టీ వల్లే ఇతర పార్టీలు మనుగడ సాగిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఈరోడ్ ఈస్ట్‌లో అన్నాడీఎంకే అభ్యర్థి ఘన విజయం సాధిస్తారని ఆయన జోస్యం చెప్పారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కలం పేరుతో సముద్రంలో కలం స్తూపం నిర్మించేందుకు రూ.80 కోట్ల ప్రజాధనం ఖర్చు చేయడం భావ్యం కాదని, ఆయన సమాధి దగ్గర రూ.కోటితో కలం స్తూపం నిర్మించి, మిగతా రూ.79 కోట్లను విద్యార్థులకు విద్యాసామగ్రి అందజేయటం మంచిదని ఈపీఎస్ హితవు పలికారు.