ISRO Chandrayaan-3 : జాబిల్లిని ముద్దాడాలని..

ABN , First Publish Date - 2023-07-14T02:07:07+05:30 IST

చందమామపై చెరగని ‘ముద్ర’ వేయడానికి ఇస్రో రెడీ అయింది. అంతరిక్ష ప్రయోగ రంగంలో భారత కీర్తి ప్రతిష్ఠల్ని మరింత ఇనుమడింపజేసి.. స్వదేశీ పరిజ్ఞానంపై మన నమ్మకాన్ని మరింత పెంచే మూన్‌ మిషన్‌కు సర్వం సిద్ధం చేసింది.

ISRO Chandrayaan-3 : జాబిల్లిని ముద్దాడాలని..

ఇస్రో చంద్రయాన్‌-3 యాత్ర నేడే

శ్రీహరికోటలో కౌంట్‌డౌన్‌ ప్రారంభం

మధ్యాహ్నం 2:35 గంటలకు ప్రయోగం

ఎల్‌వీఎం-3ఎం4 రాకెట్‌తో నింగిలోకి

భూకక్ష్యలో 24 రోజులపాటు భ్రమణం

ఆ తర్వాత చంద్రుని దిశగా ప్రయాణం

ఆగస్టు 23న జాబిల్లిపై దిగనున్న ల్యాండర్‌

చెంగాళమ్మకు ఇస్రో చైర్మన్‌ పూజలు

శ్రీవారిపాదాల వద్ద రాకెట్‌ నమూనా

సూళ్లూరుపేట, న్యూఢిల్లీ, బెంగళూరు, జూలై 13: చందమామపై చెరగని ‘ముద్ర’ వేయడానికి ఇస్రో రెడీ అయింది. అంతరిక్ష ప్రయోగ రంగంలో భారత కీర్తి ప్రతిష్ఠల్ని మరింత ఇనుమడింపజేసి.. స్వదేశీ పరిజ్ఞానంపై మన నమ్మకాన్ని మరింత పెంచే మూన్‌ మిషన్‌కు సర్వం సిద్ధం చేసింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఎవరూ చూడని నిగూఢ రహస్యాలను ఛేదించే చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని శుక్రవారం చేపట్టనుంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) ఈ ప్రయోగానికి వేదిక కానుంది.

దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ గురువారం మధ్నాహ్నం 1.05 గంటలకు ప్రారంభమైంది. ఈ కౌంట్‌డౌన్‌ 25.30 గంటల పాటు నిరాటంకంగా కొనసాగిన అనంతరం బాహుబలి రాకెట్‌ ఎల్‌వీఎం3-ఎం4 శుక్రవారం మధ్యాహ్నం 2:35 గంటలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి చంద్రయాన్‌-3తో నింగిలోకి దూసుకెళ్లనుంది. మొదట 24 గంటల కౌంట్‌డౌన్‌తో ప్రారంభించాలని శాస్త్రవేత్తలు భావించారు. కానీ, స్వల్పమార్పులు చేసి కౌంట్‌డౌన్‌ను 25.30 గంటలకు పెంచి ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఈ రాకెట్‌ ద్వారా 3,900 కిలోల బరువున్న చంద్రయాన్‌-3 పేలోడ్‌ను రోదసీలోకి పంపనున్నారు. రాకెట్‌ నుంచి విడిపోయాక వ్యోమనౌకను భూకక్ష్య నుంచి చంద్రుని కక్ష్య వరకూ మోసుకెళ్లే ప్రొపల్షన్‌ మాడ్యూల్‌, అక్కడి నుంచి చంద్రునిపై దిగిన తర్వాత పరిశోధనలు చేసేందుకు విక్రమ్‌ ల్యాండర్‌, ఉపరితలంపై తిరుగుతూ పరిశోధనలు చేపట్టే ప్రగ్యాన్‌ రోవర్‌ చంద్రయాన్‌-3లో ఉన్నాయి.

24.jpg

చెంగాళమ్మకు ఇస్రో చైర్మన్‌ పూజలు

ప్రయోగ నేపథ్యంలో ఇస్రో సీనియర్‌ శాస్రవేత్తలందరూ శ్రీహరికోటకు చేరుకొని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌ గురువారం షార్‌ సమీపంలో సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయానికి విచ్చేసి రాకెట్‌ విజయం కోసం ప్రత్యేక పూజలు చేశారు. చంద్రయాన్‌-3 విజయవంతం కావాలని కోరుకుంటూ ఇస్రో శాస్త్రవేత్తలు కూడా గురువారం తిరుమలలో రాకెట్‌ నమూనాను శ్రీవారిపాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహించారు.


భారత్‌వైపు ప్రపంచ దేశాల చూపు

అంతరిక్ష రంగంలో ఇప్పటికే ఎన్నో విజయాలు సొంతం చేసుకొన్న ఇస్రో చంద్రయాన్‌-3 ప్రయోగంతో ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు భారత్‌వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. చంద్రయాన్‌-2 వైఫల్యం తర్వాత నాలుగేళ్ల పాటు ఎంతో శ్రమించిన ఇస్రో చంద్రయాన్‌-3ని సిద్ధం చేసింది. గత లోపాలను సరిదిద్దుకుని మరింత పకడ్బందీగా దీన్ని రూపొందించింది. నాలుగేళ్లపాటు భూమిపైనే అనేక సామర్థ్య పరీక్షలు నిర్వహించి అన్నీ సజావుగా ఉన్నాయన్న నమ్మకం కలిగిన తర్వాతే మూడోసారి జాబిల్లి యాత్రకు శ్రీకారం చుట్టింది. ఈసారి ఎన్ని అవాంతరాలు ఎదురైనా చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపి తీరుతామని ఇస్రో శాస్రవేత్తలు ధీమాగా ఉన్నారు. కాగా, చంద్రయాన్‌-3 నేపథ్యంలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ ప్రయోగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించనున్నారు.

భూమి చుట్టూ 24 రోజులు తిరిగాక..

చంద్రయాన్‌-3ను ప్రొపల్షన్‌ మాడ్యూల్‌, రోవర్‌, ల్యాండర్‌తో సిద్ధం చేశారు. భూమికి 3.84 లక్షల కిమీల దూరంలో ఉన్న చంద్ర మండలాన్ని చేరుకొనేందుకు ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌ చంద్రయాన్‌-3ను తొలుత 100 కిలోమీటర్ల ఎత్తులోని భూకక్ష్యలోకి చేర్చుతోంది. ఆ తర్వాత రాకెట్‌ నుంచి చంద్రయాన్‌-3 విడిపోతుంది. ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ భూకక్ష్యలోనే 24 రోజులపాటు తిరిగిన తర్వాత చంద్ర కక్ష్యవైపు ప్రయాణిస్తుంది. చంద్రుడికి 30 కిమీల దూరంలో అందులోని ల్యాండర్‌ విడిపోయి దక్షిణ ధ్రువం వైపు దిగుతుంది. అన్నీ సజావుగా సాగితే ఆగస్టు 23 లేదా 24న చంద్రయాన్‌-3లోని ల్యాండర్‌ చంద్రుని ఉపరితలంపై దిగుతుంది. అనంతరం ల్యాండర్‌ నుంచి రోవర్‌ బయటకు వచ్చి చంద్రునిపై 14 రోజుల పాటు పరిశోధనలు చేస్తుంది. ఇది విజయవంతమైతే అమెరికా, రష్యా, చైనా తర్వాత చంద్రునిపై ల్యాండర్‌ను దింపిన దేశంగా భారత్‌ రికార్డు సృష్టించనుంది.

రెండు దశాబ్దాల్లో మూడు ప్రయోగాలు!

చంద్రునిపై అన్వేషణ కోసం ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-3కి వేళయింది. ఇస్రో ఇప్పటికే రెండు మూన్‌ మిషన్లు చేపట్టగా ఇది మూడోది. ఈ క్రమంలో ఇస్రోది సుదీర్ఘ ప్రయాణం. అసలు చంద్రయాన్‌ ప్రాజెక్టుకు రెండు దశాబ్దాల క్రితమే బీజం పడింది. 2003 ఆగస్టు 15న అప్పటి ప్రధాని వాజ్‌పేయి చంద్రయాన్‌ ప్రాజెక్టును ప్రకటించారు. నాటి నుంచి ఈ మిషన్‌పై దృష్టిపెట్టిన ఇస్రో 2008 అక్టోబరు 11న పీఎ్‌సఎల్వీ-సీ11 రాకెట్‌ ద్వారా తొలి మూన్‌ మిషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఆ తర్వాత చంద్రునిపై ల్యాండర్‌, రోవర్‌ను దింపి ఉపరితలంపై అధ్యయనం చేపట్టే లక్ష్యంతో చంద్రయాన్‌-2 శ్రీకారం చుట్టింది. 2019 జూలై 22న ఈ ప్రయోగం చేపట్టగా.. ఆగస్టు 22న చంద్రయాన్‌ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అయితే ఆర్బిటర్‌ నుంచి విడిపోయిన ల్యాండర్‌ మరికొద్దిసేపట్లో చంద్రునిపై దిగుతుందనగా ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఇస్రో కల చెదిరింది. అయితే ఈ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకున్న ఇస్రో.. కొనసాగింపుగా చంద్రయాన్‌-3 ప్రయోగానికి సిద్ధమైంది.

విడిభాగాలు అందించిన ఎల్‌ అండ్‌ టీ

ఇస్రో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు చంద్రయాన్‌-3లో ప్రముఖ సంస్థ లార్సన్‌ అండ్‌ టుబ్రో (ఎల్‌ అండ్‌ టీ) భాగస్వామ్యమైంది. ఈ ప్రయోగానికి సంబంధించి కొన్ని విడిభాగాలను తాము సరఫరా చేసినట్టు ఆ సంస్థ గురువారం తెలిపింది. చంద్రయాన్‌-3లో ఉపయోగించిన నాజిల్‌ బకెట్‌ ప్లాంజ్‌, గ్రౌండ్‌, ఫ్లయిట్‌ ప్లేట్స్‌ వంటి విడిభాగాలను తమ కంపెనీ అందించిందని పేర్కొంది.

హైదరాబాద్‌ కంపెనీ సహకారం

కూకట్‌పల్లి, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ఉపగ్రహాల తయారీలో వినియోగించే వివిధ రకాల పరికరాలను తయారు చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన నాగసాయి ప్రెసిషన్‌ ఇంజనీర్స్‌ (ఎన్‌ఎ్‌సపీఈ)ను ఇస్రో ప్రశంసించింది. ఈ మేరకు ఇస్రో ఉన్నతాధికారి డాక్టర్‌ ఆనంద లేఖ రాశారు. ఈ సంస్థ చంద్రయాన్‌-2, చంద్రయాన్‌-3, ఆదిత్య-ఎల్‌1, గగన్‌యాన్‌ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతోపాటు 50 ప్రయోగాలకు శాటిలైట్‌ బ్యాటరీ ఉత్పత్తులు, లాంచ్‌ వెహికల్స్‌లో వాడే విడిభాగాలను అందించించింది. ఇస్రో, హాల్‌, భెల్‌ వంటి కంపెనీలకు తాము పరికరాలు అందించామని ఆ సంస్థ ఎండీ బీఎన్‌ రెడ్డి చెప్పారు.

అగ్రశ్రేణిలో నిలబెడుతుంది: నంబి

చంద్రయాన్‌-3 విజయం సాధిస్తే.. అగ్రశ్రేణి దేశాలు అమెరికా, రష్యా, చైనా సరసన భారత్‌ నిలుస్తుందని, అలాగే దేశంలో అంతరిక్ష శాస్త్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ అన్నారు. ప్రపంచ అంతరిక్ష వ్యాపారంలో భారత్‌ తన వాటాను పెంచుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. సాంకేతికత అభివృద్ధిలో భారత్‌ ఇప్పుడు ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నందున.. ఈ రంగంలో మరిన్ని స్టార్ట్‌పలు ప్రవేశించే అవకాశం కూడా పెరుగుతుందన్నారు.

Updated Date - 2023-07-14T02:07:07+05:30 IST