MDMK: ఈ గవర్నర్ అసలే వద్దు!
ABN , First Publish Date - 2023-06-21T08:14:41+05:30 IST
డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవిని రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎండీఎంకే ఆధ్వర్యంలో సం
- రీకాల్ చేయాలంటూ ఎండీఎంకే సంతకాల ఉద్యమం
- సీపీఐ నేత నల్లకన్ను తొలి సంతకం
చెన్నై, (ఆంధ్రజ్యోతి): డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవిని రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎండీఎంకే ఆధ్వర్యంలో సంతకాల ఉద్యమం ప్రారంభమైంది. స్థానిక ఎగ్మూరులోని ఎండీఎంకే ప్రధాన కార్యాలయం ‘తాయగం’లో మంగళవారం ఉదయం ఏర్పాటైన ప్రత్యేక సభలో పార్టీ ప్రధాన కార్యదర్శి వైగో సమక్షంలో సీపీఐ సీనియర్ నేత నల్లకన్ను తొలి సంతకం చేసి ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఎండీఎంకే ముఖ్య కార్యదర్శి దురై వైగో, పార్టీ నేతలు వాంజియ దేవన్, జీవన్, కళగకుమార్, పూంగా రాందాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైగో మాట్లాడుతూ... రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి(State Governor RN Ravi) శాసనసభలో ప్రభుత్వ ప్రసంగపాఠంలో ఉన్న పెరియార్, అంబేడ్కర్, అన్నాదురై పేర్లను దురుద్దేశపూర్వకంగా విడిచి పెట్టి తనకు నచ్చిన విధంగా చదివేశారన్నారు. మార్క్సిజానికి కాలం చెల్లిందని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారని, అంతటితో ఆగకుండా పెట్టుబడుల సమీకరణ కోసం ముఖ్యమంత్రి స్టాలిన్ జరిపిన విదేశీ పర్యటనను కూడా విమర్శించారన్నారు. వీటికి తోడు ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించకుండా నిరంకుశ ధోరణిని ప్రదర్శిస్తూ డీఎంకే(DMK) ప్రభుత్వానికి బద్ధ శత్రువులా వ్యవహరిస్తున్నారన్నారు. గతంలో నాగాలాండ్(Nagaland)లో పని చేసినప్పుడు కూడా ఇదేరీతిలో ప్రవర్తించడం వల్లే ఆ రాష్ట్ర ప్రజలు తరిమికొట్టారని అన్నారు. ఇటీవల జరిగిన తమ పార్టీ సర్వసభ్యమండలి సమావేశంలో గవర్నర్ తీరును ఖండిస్తూ సంతకాల ఉద్యమం జరపాలని నిర్ణయించామన్నారు. ఆ మేరకు జూలై 20 వరకు రాష్ట్రమంతటా తమ పార్టీ నేతలు పర్యటించి సంతకాలు సేకరించనున్నారని తెలిపారు. ఈ ఉద్యమానికి డీఎంకే మిత్రపక్షాలు కూడా మద్దతివ్వాలని వైగో కోరారు.