Nagaland polls: వృద్ధులకు రూ.3,000 పెన్షన్, మహిళలకు 33 శాతం రిజర్వేషన్: ఖర్గే
ABN , First Publish Date - 2023-02-21T16:57:44+05:30 IST
నాగాలాండ్‌లో శాంతి, సుస్థిరత, సర్వతోముఖాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ..
కోహిమా: నాగాలాండ్ (Nagaland)లో శాంతి, సౌభాగ్యం, సుస్థిరత, సర్వతోముఖాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. నాగాలాండ్‌లోని దిపూపార్ గ్రామం పబ్లిక్ గ్రౌండ్స్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఖర్గే సోమవారంనాడు ప్రసంగిస్తూ, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకునే తరుణం ఇదేనని అన్నారు.
నాగాలాండ్‌ను గత 20 ఏళ్లుగా ఎన్‌డీపీపీ, ఎన్‌పీఎఫ్, బీజేపీ దోచుకున్నాయని ఆరోపించారు. ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారని, క్రిస్టియన్ సొసైటీపై దాడులు జరుగుతున్నాయని, మతం, కులంపేరుతో ప్రజలను విడగొడుతున్నారని అన్నారు. గత తొమ్మిదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో విద్వేషాలు, భయాలతో కూడిన వాతావరణం నెలకొందన్నారు. ఈశాన్య నాగాలాండ్ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అన్ని చర్యలూ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని గెలిచించాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే రూ.3000 చొప్పున వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని, ఎంఎన్ఆర్‌ఈజీఏ జాబ్ కార్డ్ ఉన్న వారందరికీ 100 శాతం పేమెంట్లు చెల్లిస్తామని, ఉన్నత విద్య కోసం జీరో శాతం వడ్డీతో రుణాలు ఇస్తామని చెప్పారు. స్వచ్ఛమైన తాగునీరు, పారిశుధ్య సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాగా, 60 మంది సభ్యుల నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 27న జరుగనుంది. మార్చి 2న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.
ఎన్నికల బరిలో..
బీజేపీ, ఎన్‌డీపీపీ సంయుక్తంగా ఈసారి ఎన్నికలకు వెళ్తోంది. ఎన్‌డీపీపీ 40 సీట్లలో, బీజేపీ 20 సీట్లలో పోటీ చేస్తోంది. ఎన్‌పీఎఫ్ సొంతంగా పోటీలో ఉంది. 22 మందిని బరిలోకి దింపింది. 23 చోట్ల పోటీలో ఉంది. 2018 ఎన్నికల్లో ఎన్‌డీపీపీ 18 సీట్లు, బీజేపీ 12 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదు. ఎన్‌పీఎఫ్ 26 సీట్లు దక్కించుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 2021 సెప్టెంబర్‌లో అధికార ఎన్‌డీపీపీ, బీజేపీతో ఎన్‌పీఎఫ్ చేరింది. అయితే 2022 ఏప్రిల్‌లో మాజీ సీఎం టీర్ జెలియాంగ్ సారథ్యంలో ఆ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు ఎన్‌డీపీపీలో విలీనమయ్యారు.