Parliament Monsoon session: మధ్యాహ్నం 2 గంటలకు మణిపూర్ ఘటనపై చర్చ- పీయూష్ గోయల్
ABN , First Publish Date - 2023-07-31T12:37:04+05:30 IST
మణిపూర్ ఘటనపై మధ్యాహ్నం 2 గంటలకు పార్లమెంట్‌లో చర్చ జరుగుతుందని కేంద్ర మంత్రి, రాజ్యసభలో సభాపక్ష నేత పీయూష్ గోయల్ వెల్లడించారు. ప్రతిపక్ష సభ్యులు వారికి ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. మణిపూర్ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని గోయల్ తెలిపారు.
ఢిల్లీ: మణిపూర్ ఘటనపై మధ్యాహ్నం 2 గంటలకు పార్లమెంట్‌లో చర్చ జరుగుతుందని కేంద్ర మంత్రి, రాజ్యసభలో సభాపక్ష నేత పీయూష్ గోయల్ వెల్లడించారు. ప్రతిపక్ష సభ్యులు వారికి ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. మణిపూర్ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని గోయల్ తెలిపారు. అయితే ప్రతిపక్ష సభ్యులు ఇప్పటికే సభకు సంబంధించిన 9 ముఖ్యమైన రోజులను వృథా చేశారని ఆయన అన్నారు. ఈ సారి మాత్రం అలా జరగకుండా మణిపూర్ అంశంపై చర్చ జరగాలని కోరుకుంటున్నామని పీయూష్ గోయల్ చెప్పారు. కాగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి మణిపూర్‌లో శాంతిభద్రతల సమస్యపై కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రతిపక్ష సభ్యులు అడ్డుకోవడంంతో ఉభయసభలు పలుమార్లు వాయిదాపడ్డాయి. మరోవైపు మణిపూర్ అంశంపై రూల్ 267 కింది చర్చలు జరపాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబడుతున్నారు. అలాగే పార్లమెంట్ సాధారణ కార్యకలాపాలను నిలిపివేయడానికి నోటీసులు ఇచ్చారు.
కాగా అంతకుముందు మణిపూర్ ఘటనపై చర్చ చేపట్టాలని పార్లమెంటులో విపక్షాలు మరోసారి వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చాయి. బీఆర్ఎస్ తరఫున ఏడుగురు రాజ్యసభ సభ్యులు నోటీసులు ఇచ్చారు. లోక్‌సభలోబీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం నోటీసులు దాఖలు చేశారు. ఉభయ సభల్లో సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని విప్ జారీ చేశారు. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఈరోజు సభ ముందుకు రానున్న నేపథ్యంలో తమ సభ్యులకు విపక్షాలు విప్ జారీ చేశాయి. ఈ రోజు లోక్‌సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే ఢిల్లీ ప్రభుత్వంలో పని చేసే ఉన్నతాధికారులకు బదిలీల అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వం చేతులలోకి వెళ్తాయి.