Parliament Special Session: పార్లమెంట్ ఉభయసభలు వాయిదా.. రేపు తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతాయంటే?
ABN , First Publish Date - 2023-09-18T18:51:34+05:30 IST
ఈరోజు (సోమవారం) ప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. తొలుత ఉదయం 9:30 గంటలకు పాత పార్లమెంట్ భవనం ముందు గ్రూప్ ఫోటో దిగి.. అనంతరం 11 గంటల సమయంలో...
ఈరోజు (సోమవారం) ప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. తొలుత ఉదయం 9:30 గంటలకు పాత పార్లమెంట్ భవనం ముందు గ్రూప్ ఫోటో దిగి.. అనంతరం 11 గంటల సమయంలో పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఉభయసభల ఎంపీలు భేటీ అవుతారు. రేపటి నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో ఉభయ సభలు జరుగుతాయి. లోక్‌సభ సమావేశాలు రేపు మధ్యాహ్నం 1:15 గంటలకు వాయిదా పడగా.. రాజ్యసభ మధ్యాహ్నం 2:15 గంటలకు పునఃప్రారంభమవుతాయి.
అంతకుముందు.. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభైనప్పుడు ప్రధాని మోదీ పాత భవనానికి వీడ్కోలు పలుకుతూ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ఈ భవనం నిర్మించాలనే నిర్ణయం బ్రిటీష్ పాలకులదే అయినప్పటికీ.. దీని కట్టడానికి పడిన శ్రమ, డబ్బు మొత్తం మన దేశవాసులదేనన్న నిజానికి మనం ఎప్పటికీ మర్చిపోకూడదన్నారు. ఆ నిజాన్ని గర్వంగా చెప్పుకోవాలని ఉద్ఘాటించారు. కొత్త ఆశ, విశ్వాసంతో ఎంపీలందరూ సరికొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగుపెడతారని చెప్పారు. అనంతరం ఈ సమావేశాలు వాడీవేడీగా సాగాయి. ప్రతిపక్షాలు తమ మాటల తూటాలకు పదును పెడితే.. అధికార పార్టీ నేతలు కూడా అందుకు తగినట్టే కౌంటర్లు ఇచ్చారు.
ఇక పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడిన తర్వాత సాయంత్రం 6.30 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించారు. అంతకుముందు ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు మంత్రులతో సమావేశం అయ్యారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి గదిలో ఈ సమావేశం జరగ్గా.. ప్రహ్లాద్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలను ఒక్కొక్కరుగా కలిశారు. ప్రహ్లాద్ జోషి గదిలో జరిగిన సమావేశంలో ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, అనురాగ్ ఠాకూర్, అర్జున్ రామ్ మేఘ్వాల్ మరియు వి మురళీధరన్ ఉన్నారు. మరోవైపు.. రేపటి నుంచి కొత్త భవనంలో సమావేశాలు జరగనున్నాయి.