శిశు మరణాల నియంత్రణలో భారత్ భేష్
ABN , Publish Date - Mar 28 , 2025 | 06:00 AM
శిశు మరణాల నియంత్రణలో భారత్ కృషిని ఐక్యరాజ్య సమితి ప్రసంశించింది. ఈ విషయంలో భారతదేశాన్ని ఓ మార్గదర్శక దేశంగా అభివర్ణించింది. ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా ఇది సాధ్యమైందని పేర్కొంది.

పురోగతిలో మార్గదర్శకంగా నిలిచింది: ఐరాస నివేదిక
న్యూఢిల్లీ, మార్చి 27: శిశు మరణాల నియంత్రణలో భారత్ కృషిని ఐక్యరాజ్య సమితి ప్రసంశించింది. ఈ విషయంలో భారతదేశాన్ని ఓ మార్గదర్శక దేశంగా అభివర్ణించింది. ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా ఇది సాధ్యమైందని పేర్కొంది. ఆరోగ్య వ్యవస్థకు నిధుల కేటాయింపు ద్వారా లక్షలాది మంది శిశువుల ప్రాణాలను భారత్ కాపాడగలిగిందని ప్రస్తుతించింది. శిశు మరణాల అంచనాపై ఐరాస సంయుక్త బృందం తన నివేదికను ఇటీవల విడుదల చేసింది. శిశు మరణాల నియంత్రణలో ఐదు దేశాలను మార్గదర్శక దేశాలుగా పేర్కొంది.
వాటిలో భారత్‌తో పాటు నేపాల్, సెనెగల్, ఘనా, బురుండి ఉన్నాయి. నివారించదగ్గ శిశు మరణాల విషయంలో విభిన్న వ్యూహాలను ఈ దేశాలు అనుసరించాయని, తద్వారా శిశు మరణాల నియంత్రణ పురోగతిలో వేగం పెంచాయని ఆ నివేదిక కొనియాడింది. స్థిరమైన పాలన, అవసరమైన నిధుల కేటాయింపు ఈ స్థితికి రావడానికి దోహదపడ్డాయని తెలిపింది. భారత్‌లో 2000 సంవత్సరం నుంచి ఐదేళ్ల లోపు బాలల మరణాలు 70ు, నవజాత శిశువుల మరణాలు 61ు తగ్గాయని వెల్లడించింది. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు, మానవ వనరుల పెరుగుదల, వైద్యాన్ని అందుబాటులోకి తేవడం, ఆరోగ్య పథకాలతో ఇది సాధ్యమైందని తెలిపింది.