Manglik : అత్యాచార బాధితురాలికి కుజ దోషం ఉందా?.. హైకోర్టు ఆదేశాలను నిలిపేసిన సుప్రీంకోర్టు..

ABN , First Publish Date - 2023-06-04T12:16:41+05:30 IST

అత్యాచార బాధితురాలి జాతకంలో కుజ దోషం ఉందో, లేదో పరిశీలించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు శనివారం

Manglik : అత్యాచార బాధితురాలికి కుజ దోషం ఉందా?.. హైకోర్టు ఆదేశాలను నిలిపేసిన సుప్రీంకోర్టు..

న్యూఢిల్లీ : అత్యాచార బాధితురాలి జాతకంలో కుజ దోషం ఉందో, లేదో పరిశీలించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు శనివారం (జూన్ 3) నిలిపేసింది. జ్యోతిషం సైన్స్ ఔనా? కాదా? అనే అంశం జోలికి వెళ్లడం లేదని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. నిందితుని బెయిలు దరఖాస్తుపై విచారణ జరిపేటపుడు ఇటువంటి ఆదేశాలు ఇచ్చి ఉండకూడదని తెలిపింది. ఇది పూర్తిగా సందర్భరహితమైన చర్య అని, వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. అసలు విషయాన్ని దీనితో ముడిపెట్టడాన్ని మాత్రమే తాము పరిశీలిస్తున్నామని తెలిపింది.

అత్యాచార బాధితురాలికి కుజ దోషం ఉందని నిందితుని తరపు న్యాయవాది అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనంలో వాదించారు. జాతకంలో కొన్ని గ్రహాలు కలవడం వల్ల కుజ దోషం ఏర్పడుతుందని, ఇది సంతోషకరమైన జీవితానికి అడ్డంకిగా నిలుస్తుందని చెప్పారు. ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం నిందితునికి లేదని చెప్పారు. అయితే బాధితురాలి తరపు న్యాయవాది మాట్లాడుతూ, తన క్లయింట్‌కు కుజ దోషం లేదన్నారు.

ఈ వాదనలపై హైకోర్టు స్పందిస్తూ, నిందితుడు, బాధితురాలు తమ పుట్టిన తేదీ, సమయంతో కూడిన బర్త్ చార్టులను 10 రోజుల్లోగా లక్నో విశ్వవిద్యాలయంలోని జ్యోతిష్య విభాగం అధిపతికి అందజేయాలని ఆదేశించింది. ఈ ఇద్దరి జాతకాల వివరాలను మూడు వారాల్లోగా సీల్డ్ కవర్లో సమర్పించాలని జ్యోతిష్య విభాగాధిపతిని ఆదేశించింది.

బాధితురాలి ఆరోపణల ప్రకారం, తనను పెళ్లి చేసుకుంటానని నిందితుడు హామీ ఇవ్వడంతో అతనితో ఆమె అత్యంత సన్నిహితంగా మెలిగింది. పెళ్లి చేసుకోవాలని ఆమె కోరినపుడు, ‘‘నీకు కుజ దోషం ఉంది’’ అని చెప్పి, పెళ్లి చేసుకోవడానికి అతను తిరస్కరించాడు. ఇదిలావుండగా, నిందితునికి హైకోర్టు బెయిలు మంజూరు చేసింది.

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, జ్యుడిషియల్ ఫోరం ఇలాంటి దరఖాస్తును అనుమతించేటపుడు ఇది ఒక అంశం కాగలదా? అనేదే ఏకైక ప్రశ్న అన్నారు. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడం కోసం సమర్ధ న్యాయస్థానం జ్యోతిషాన్ని పరిశీలించకూడదన్నారు. హైకోర్టులో తదుపరి విచారణ జూన్ 26న జరుగుతుంది.

హైకోర్టు మే 23న ఇచ్చిన ఈ ఆదేశాలను సుప్రీంకోర్టు జూన్ 3న నిలిపేసింది. జ్యోతిషం అనేది సైన్స్‌యా? కాదా? అనే అంశం జోలికి వెళ్లడం లేదని జస్టిస్ సుధాంశు ధూలియా, పంకజ్ మిట్టల్ వెకేషన్ బెంచ్ చెప్పింది. నిందితుని బెయిలు దరఖాస్తుపై విచారణ జరిపేటపుడు ఇటువంటి ఆదేశాలు ఇవ్వకుండా ఉండి ఉండవలసిందని తెలిపింది. హైకోర్టు పార్టీల జాతకాల నివేదికలను ఎందుకు కోరిందో అర్థంకావడం లేదని తెలిపింది. బెయిలు దరఖాస్తుపై విచారణ జరిపేటపుడు ఆస్ట్రాలజీ రిపోర్టు అవసరం లేదని స్పష్టం చేసింది. దరఖాస్తులోని యోగ్యతల ఆధారంగా తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు తెలిపింది.

ఇవి కూడా చదవండి :

Rajastan : బహిరంగ సభలో మైక్‌ను నేలకేసి కొట్టిన సీఎం గెహ్లాట్.. కారణం ఏంటో తెలుసా...

Odisha train accident : ఒడిశా రైలు ప్రమాదంపై మోదీకి కాంగ్రెస్ సూటి ప్రశ్నలు

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-06-04T12:16:44+05:30 IST