Vande Bharat train: వందేభారత్ రైలుకు పెరుగుతున్న క్రేజ్
ABN , First Publish Date - 2023-01-06T11:40:33+05:30 IST
దేశ రైల్వేల ప్రగతికి అద్దంపట్టేలా పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో సిద్ధంచేసిన వందే భారత్ రైలు(Vande Bharat train)కు క్రమేపీ

- 48 రోజులు
- 1,41,127 మంది ప్రయాణం
- రూ. 10.2 కోట్ల ఆదాయం
బెంగళూరు, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): దేశ రైల్వేల ప్రగతికి అద్దంపట్టేలా పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో సిద్ధంచేసిన వందే భారత్ రైలు(Vande Bharat train)కు క్రమేపీ క్రేజ్ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా మొత్తం ఏడు మార్గాల్లో వందేభారత్ రైళ్ళు సంచరిస్తుండగా ఇందులో దక్షిణాదిలో మైసూరు- చెన్నయ్‌ల మధ్య ఐదో రైలును ఇటీవల బెంగళూరు నగరంలో ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాచనగరి మైసూరు(Mysore)లో ప్రతిరోజూ మధ్యాహ్నం 1.05 గంటలకు బయల్దేరే వందేభారత్ రైలు అదే రోజు రాత్రి 7-30 గంటలకు చెన్నై చేరుకుంటోంది. ఈ రైలు మధ్యలో క్రాంతివీర సంగొళ్ళిరాయణ్ణ బెంగళూరు సిటీ రైల్వేస్టేషన్‌లో 5 నిముషాలు, కాట్పాడి జంక్షన్‌లో 5 నిముషాలు మాత్రమే ఆగుతుంది. బెంగళూరు నుంచి మైసూరుకు కేవలం 1.45 గంటల సమయంలో చేరుకునే అవకాశం వందేభారత్ రైలు ద్వారా ప్రయాణీకులు తమ సమయాన్ని ఆదా చేసుకునేందుకుగాను ఈ రైల్లో ప్రయాణించేందుకు బాగా ఇష్టపడుతున్నారు. మైసూరులో ప్రతిరోజూ మధ్యాహ్నం 1.05 గంటలకు బయల్దేరే వందేభారత్ రైలు బెంగళూరు, కాట్పాడి స్టేషన్ల హాల్ట్‌లతో కలిపి రాత్రి 7-30 కు చెన్నయ్ చేరుకుంటుంది. అంటే మైసూరు నుంచి చెన్నయ్‌కు 496 కిమీ దూరాన్ని ఈ రైల్లో కేవలం 6 గంటల 25 నిముషాల్లో చేరుకోవచ్చు. ఈ దక్షిణాది తొలి వందేభారత్ రైలులో 16 పాసింజర్ కార్లు ఉన్నా యి. మొత్తం సీట్ల సామర్ధ్యం 1128. ఇందులో రెండు ఎగ్జిక్యూటివ్ కంపార్ట్‌మెంట్లు ఉన్నాయి. మిగిలనవన్నీ చైర్‌కార్లు. ఒక్కో ఎగ్జిక్యూటివ్ చైర్‌కారు సామర్ధ్యం 52 సీట్లు కాగా ఒక్కోచైర్ కారు సామర్ధ్యం 78గా ఉంది. కాగా వందేభారత్ రైల్ల్లో గురువారం మీడియా ప్రతినిధులు బెంగళూరు నుంచి మైసూరు వరకు ప్రయాణించి సదుపాయాలు, ప్రయాణికుల అనుభూతుల్ని అడిగితెలుసుకున్నారు. రైల్లో సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని అయితే శతాబ్దిరైలు మాదిరిగానే టికెట్ల ధర ఉంటే చాలా బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వందేభారత్ రైలు మైసూరు-బెంగళూరు నగరాల మధ్య గంటకు 100 కిమీ వేగంతోనూ, బెంగళూరు-చెన్నయ్‌ల మధ్య గంటకు 110 కిమీ వేగంతో ప్రయాణిస్తోంది. దశలవారీగా ఈ రైలు వేగాన్ని గంటకు 130 కిమీ మేరకు పెంచుకుంటూ పోతామని రైల్వే అధికారులు మీడియాకు తెలిపారు. ప్రస్తుతం మైసూరు-బెంగళూరు మార్గంలో రైల్లో ఆక్యుపెన్నీ కాస్త తక్కువగానే ఉన్నా బెంగళూరు-చెన్నయ్ మార్గంలో ఆక్యుపెన్సీ పూర్తిస్థాయిలో ఉంటోందన్నారు. ఎన్నో అత్యాధునిక సదుపాయాలు కలిగిన వందేభారత్ రైల్లో ప్రయాణం విమాన ప్రయాణాన్ని తలపిస్తుందనడంతో సందేహమే లేదు.
టికెట్ చార్జీలివే
చెన్నయ్- నుంచి మైసూరుకు వందేభారత్ రైల్లో టికెట్ చార్జీ ఎగ్జిక్యూటివ్ చైర్‌కారులో అయితే రూ.2295గానూ కార్‌చైర్‌లో అయితే రూ1200 గానూ ఉంది. కాగా మైసూరు నుంచి చెన్నయ్‌లకు టికెట్ చార్జీ ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్‌లో రూ.2485గానూ, కార్‌చైర్‌లో అయితే రూ.1365 గానూ ఉంది. బెంగళూరు-మైసూరుల మధ్య ప్రయాణచార్జీ రూ. 515గా ఉంది. గంటాముప్పావుగంటలో మైసూరుకు చేరుకోవాలనుకునే ప్రయాణీకులకు ఈ రైలు ఎంతో అనువుగా ఉంది. శుభ్రత, సేవల విషయంలోనూ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం కనిపించింది.