Myanmar Earthquake: మయన్మార్‌కు భారత్ ఆపన్న హస్తం.. మొదలైన ఆపరేషన్ బ్రహ్మ
ABN , Publish Date - Mar 29 , 2025 | 01:31 PM
వరుస భూకంపాలతో కుదేలైన మయన్మార్‌ను ఆదుకునేందుకు భారత్ ముందుకు వచ్చింది. భూకంప ధాటికి విలవిల్లాడుతున్న మయన్మార్‌కు భారీ ఎత్తున సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధం అయ్యింది. ఇందుకోసం ఆపరేషన్ బ్రహ్మ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.

న్యూఢిల్లీ: వరుస భూకంపాలతో మయన్మార్, థాయ్‌లాండ్ దేశాలు అల్లాడుతున్నాయి. రిక్టార్ స్కేల్ మీద ఈ భూకంప తీవ్రత 7.7 పాయింట్స్‌గా నమోదయ్యింది. భూకంప ధాటికి మయన్మార్, థాయ్‌లాండ్ దేశాల్లో పెద్ద పెద్ద భవనాలు, చెట్లు కుప్పకూలాయి. శిథిలాల కింద వందల మంది చిక్కుకున్నారు. మరెంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడ చూసిన కూలిపోయిన భవనాలు.. శిథిలాల కింద నుంచి వినిస్తున్న కాపాడండి అనే శబ్ధాలు, శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో కూడా భూ విలయం విధ్వంసం సృష్టించింది. ప్రభుత్వం, ఆర్మీ.. సహాయక చర్యల్లో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా ప్రకృతి విపత్తులతో అల్లాడుతున్న మయన్మార్‌ను ఆదుకునేందుకు భారత్ ముందుకు వచ్చింది. మయన్మార్‌కు ఆపన్న హస్తం అందించింది
భూకంప ధాటికి చిగురుటాకులా వణుకుతున్న మయన్మార్‌ను ఆదుకునేందుకు భారత్ ముందుకు వచ్చింది. మయన్మార్‌కు సాయం చేసేందుకు గాను ఆపరేషన్ బ్రహ్మ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా ఢిల్లీ నుంచి 15 టన్నుల రిలీఫ్ మెటిరియల్‌ను మయన్మార్‌కు పంపించింది భారత ప్రభుత్వం. వీటిల్లో దుప్పట్లు, ఆహార పదార్థాలు, హైజీన్ కిట్స్, టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, వాటర్ ప్యూరిఫైయర్స్, సోలార్ ల్యాంప్స్, జనరేటర్ సెట్లు వంటి కీలకమైన రోజువారీ అవసరాలతో కూడిన సహాయ సామగ్రి ఉంది. వీటిని మయన్మార్‌కు తరలించేందుకు ఐఏఎఫ్ సీ 130 జే విమానం బయలుదేరి వెళ్లినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
మయన్మార్‌లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా ఇప్పటి వరకు 1,000 మంది మరణించారని.. 2,376 మంది గాయపడ్డారని తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉంటే.. మయన్మార్ మృతుల సంఖ్య 10,000 దాటవచ్చని అమెరికా ఏజెన్సీ అంచనా వేసింది. ఇప్పటికే మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. భూకంప తీవ్రతకు పలు ప్రాంతాల్లో పెద్ద పెద్ద భవనాలు నేలమట్టం అయ్యాయి. ఆ శిథిలాల కింద వేల మంది చిక్కుకోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మయన్మార్‌లోని నేపిడాలో వెయ్యి పడకల ఆస్పత్రి, మాండలే నగరంలో ఐకానిక్ వంతెనతో పాటుగా పలు ప్రాంతాల్లో ఉన్న ఎత్తైన ఆలయాలు, గోపురాలు భూకంప తీవ్రతకు కుప్పకూలాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. స్టేటస్ ప్రియులకు ఇక పండగే
మా బండి నిండిపోయింది.. ఆ ఎమ్మెల్యేలను ఏం చేసుకోవాలి