Karnataka Elections: నాకు లెక్కలు బాగా తెలుసు..141 సీట్లు గెలుస్తాం : డీకే

ABN , First Publish Date - 2023-04-29T14:44:44+05:30 IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 224 సీట్లలో 141 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని...

Karnataka Elections:  నాకు లెక్కలు బాగా తెలుసు..141 సీట్లు గెలుస్తాం : డీకే

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Elctions) 224 సీట్లలో 141 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar) ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర బీజేపీ ఆ పార్టీ యావత్ కేంద్ర నాయకత్వాన్ని ఎన్నికల ప్రచారంలో మోహరించిందని, అయితే మోదీ (Narendra Modi) మ్యాజిక్ కర్ణాటకలో పనిచేయదని చెప్పారు. ప్రజలు పూర్తిగా స్థానిక, అభివృద్ధి అంశాలపై దృష్టి సారించారని అన్నారు. తనకు, తమ పార్టీ నేత సిద్ధరామయ్యకు మధ్య ముఖ్యమంత్రి పదవి విషయంలో ఎలాంటి పోటీ లేదని, తమ ఏకైక లక్ష్యం ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించి, కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమేనని 'పీటీఐ' వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో శివకూమార్ చెప్పారు.

అభివృద్ధే ప్రధాన అంశం...

కర్ణాటక శాంతిని కాంక్షించే రాష్ట్రమని, ఇక్కడి ప్రజలు ఎంతో పరిపక్వత కలిగిన వారని డీకే తెలిపారు. దేశ ఆర్థికాభివృద్ధికి దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటక 'గేట్‌వే' వంటిదని తెలిపారు. బీజేపీ భావోద్వేగ అంశాలను లేవనెత్తుతుందని, తాము మాత్రం అభివృద్ధి అంశాల గురించే మాట్లాడతామని అన్నారు. ధరల పెరుగుదలతో సామాన్యప్రజానీకం అనేక ఇబ్బందులకు గురవుతోందని, వారి ఇబ్బందులను తాము తొలగిస్తామని చెప్పారు. మూడున్నరేళ్లుగా బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం విఫలమైందని, 10 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు జరిగినట్టు బీజేపీ చెబుతోందని, కానీ ఒక్క ఇన్వెస్టర్ కూడా ఉద్యోగాల కల్పన చేపట్టలేదని ఆయన అన్నారు. నిరుద్యోగం తీవ్ర స్థాయిలో ఉందని చెప్పారు.

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరణకు ఈ ఎన్నికల ఫలితాలు కీలకం అనుకుంటున్నారా అని అడిగినప్పుడు, జాతీయ స్థాయిలో ఐక్యతకు ఇది ఆరంభమని, కర్ణాటక ప్రజలు తమ తీర్పు ద్వారా దేశానికి సందేశం ఇవ్వబోతున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 141 సీట్లు గెలుచుకుంటుందని కుండబద్ధలు కొట్టారు. 35 ఏళ్లుగా అసెంబ్లీలో ఉన్నానని, ఎనిమిది సార్లు పోటీ చేసి ఏడుసార్లు గెలిచానని, తనకున్న సుదీర్ఘ అనుభవాన్ని బట్టి ఈ లెక్కలు కచ్చితంగా చెప్పగలుగుతున్నానని, పెద్ద సంఖ్యలో సీట్లు గెలుస్తామని అన్నారు.

జగడాల్లేవు...

ముఖ్యమంత్రి పదవి విషయంలో సిద్ధరామయ్యతో 'జగడం'పై అడిగినప్పుడు... జగడం ఎక్కడుంది? అని డీకే ప్రశ్నించారు. అలాంటి ఒక్క సంఘటన కానీ, ఒక్క విషయంలో విభేదించినట్టు కానీ చూపించమని నిలదీశారు. యడియూరప్పలా (బీజేపీ నేత) తాను పదవి కోసం కంటతడి పెట్టేది లేదన్నారు. తాము ఐక్యంగా ఉన్నామని, ఐక్యంగానే పోరాడతామని, బీజేపీని ఓడించి, కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే తమ ఏకైక లక్ష్యమని అన్నారు. కేపీసీసీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మీకే ఉన్నాయని అనుకోవచ్చా అని అడిగినప్పుడు, కాంగ్రెస్ పార్టీ గెలుపే ఇప్పుడు తమ ఉందున్న లక్ష్యమని, సీఎం ఎవరనేది ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీనే నిర్ణయిస్తుందని డీకే శివకుమార్ తెలిపారు.

Updated Date - 2023-04-29T14:44:44+05:30 IST