ఆడపిల్ల... ఆదుకునే పిల్ల
ABN , Publish Date - Apr 02 , 2025 | 06:04 AM
ఆడపిల్ల భారం కాదని తన తల్లిదండ్రులకే కాదు, మొత్తం ప్రపంచానికే నిరూపించి చూపించాలనుకుంది ప్రముఖ మిక్స్‌డ్ మార్షల్ ఆర్టిస్ట్ పూజా తోమర్. ఉత్తర్‌ప్రదేశ్ బుధానా గ్రామానికి చెందిన పూజ, యుఎఫ్‌సి ఫైట్ గెలిచిన...

స్ఫూర్తి
ఆడపిల్ల భారం కాదని తన తల్లిదండ్రులకే కాదు, మొత్తం ప్రపంచానికే నిరూపించి చూపించాలనుకుంది ప్రముఖ మిక్స్‌డ్ మార్షల్ ఆర్టిస్ట్ పూజా తోమర్. ఉత్తర్‌ప్రదేశ్ బుధానా గ్రామానికి చెందిన పూజ, యుఎఫ్‌సి ఫైట్ గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా చరిత్ర కూడా సృష్టించింది. పుట్టుకతోనే బతుకు పోరాటాన్ని మొదలుపెట్టిన ఫైటర్ పూజ మనోగతమిది.
‘‘అప్పటికే అమ్మానాన్నలకు ఇద్దరు ఆడపిల్లలు. వాళ్లను పెంచడమే భారమైపోయన సమయంలో, నేను పుట్టడంతో నాన్న స్పృహ తప్పి పడిపోయారు. పెంచే స్థోమత, ధైర్యం లేక వాళ్లు నన్ను వదిలించుకోవాలని అనుకున్నారు. మూడో కూతురుని పెంచకూడదని అప్పటికే నిర్ణయించేసుకున్నారు కాబట్టి నన్ను కుండలో వదిలేశారు. కానీ తల్లి మనసు తట్టుకోలేకపోయింది. నా ఏడుపు వినగానే అమ్మ నన్ను బయటకు తీసి గుండెలకు హత్తుకుని, నన్ను పెంచుకోవాలని నిశ్చయించుకుంది. ఈ భారాన్నీ, బాధను నేను చిన్నప్పటి నుంచీ మోస్తూనే ఉన్నాను. ఊహ తెలిసింది మొదలు నన్ను నేను నిరూపించి చూపించే అవకాశాల కోసం వెతకడం మొదలుపెట్టాను. బాల్యంలో క్రీడాకారులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు నన్ను ఆకర్షించేవారు కారు. మెరుపు వేగంతో కదులుతూ ప్రత్యర్థులను మట్టి కరిపించే యాక్షన్ హీరోలు, ప్రత్యేకించి జాకీచాన్ నన్నెంతో ఆకర్షించేశాడు. నేనతని సినిమాలను వినోదం కోసం కాకుడా, ఫైటింగ్ నేర్చుకోవడం కోసం చూసేదాన్ని.
జాకీచాన్ స్ఫూర్తితో...
ఏడో తరగతిలో బడిలో జరిగిన కరాటే పోటీలో తోటి మగపిల్లవాడి ముఖం మీద పిడిగుద్దులు కురిపించాను. దాంతో ఆ పిల్లాడు మూర్ఛపోయాడు. దాంతో నన్ను డిస్‌క్వాలిఫై చేసేశారు. దాంతో బడి యాజమాన్యం నేనా ఆటకు తగిన వ్యక్తిని కానని తీర్మానించేసింది. కానీ ఆ సమయంలో నాకు జాకీ చాన్ గుర్తొచ్చాడు. నేను పుట్టిందే అతనిలా ఫైట్ చేయడం కోసం. అలాంటప్పుడు నచ్చిన పని మానేయడంలో అర్థం ఏముంది? ఆ తర్వాత కూడా బడిలో గొడవల్లో మగపిల్లల మీద పైచేయి సాధిస్తూ, ఫైటింగ్‌నే క్రీడగా మలుచుకోవాలనే విషయాన్ని గ్రహించాను. అలా 12వ తరగతిలో మా బడికొచ్చిన కరాటే టీచర్ దగ్గర పాఠాలు నేర్చుకోవడం మొదలుపెట్టాను. కొంతకాలానికి కరాటేను మించిన మరొక మార్షల్ ఆర్ట్, ఉషు నేర్చుకోవడం మొదలుపెట్టాను. మామయ్య సహాయంతో భోపాల్ వెళ్లి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఐదేళ్ల పాటు శిక్షణ పొందాను. ఆ ఐదేళ్ల కఠోర శిక్షణ తర్వాత నాకు కానిస్టేబుల్ ఉద్యోగం వరించింది. కానీ నేను దాన్నొక అవమానంగా భావించాను. పైగా అప్పట్లో ఎమ్‌బిబిఎస్ చదువుతున్న మా అక్కకు ట్యూషన్ ఫీజు అవసరమైంది. సరిగా అదే సమయంలోనే మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎమ్‌ఎమ్‌ఎ) గురించి విన్నాను. ఢిల్లీ నుంచి ఒకరు నన్ను స్పాన్సర్ చేయడానికి అంగీకరించడంతో మరో ఆలోచన లేకుండా ఫైట్‌కు సిద్ధ పడ్డాను. అలా గత ఏడాది జూన్‌లో, బ్రెజిల్‌కు చెందిన రయాన్ అమాండాను ఓడించి, అల్టిమేట్ ఫైట్ ఛాంపియన్‌షిప్ (యుఎ్‌ఫసి)లో విజయం సాధించి, ఈ ఫైట్ గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా గుర్తింపు తెచ్చుకున్నాను. పోటీలో గెలుపొందిన డబ్బుతో కుటుంబాన్ని ఆదుకున్నాను. కానీ ఈ గెలుపును చూడడానికి నాన్న లేకపోవడం నన్నిప్పటికీ బాధిస్తూ ఉంటుంది.
అపజయాలు సహజం
గెలవడం కోసం కాదు, స్పష్టత కోసం ప్రతి పోరాటానికి ముందు భగవంతుడిని ప్రార్థిస్తాను. నా శిక్షణ కూడా ఎంతో కఠినంగా సాగుతుంది. రోజుకు రెండు సెషన్లు సాధన చేస్తాను. కానీ ఈ మార్చి 22న యుఎ్‌ఫసి ఫైట్‌లో అపజయం పాలయ్యాను. అన్నిసార్లూ గెలుపు మనల్ని వరించదు. కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం! అయితే పోరాడే అవకాశమిచ్చిన ఆ భగవంతుడికి నేనెప్పటికీ రుణపడి ఉంటాను. అన్నిటికంటే ముఖ్యంగా నన్ను కనడం భారంగా భావించిన అమ్మ నన్ను చూసి గర్వపడుతూ ఉండడం ఎంతో సంతృప్తిని కలిగిస్తూ ఉంటుంది.’’
ఈ వార్తలు కూడా చదవండి..
CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు
Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే
Read Latest AP News And Telugu News