Waqf Bill Controversy: వక్ఫ్‌పై ఢీ అంటే ఢీ
ABN , Publish Date - Apr 02 , 2025 | 04:15 AM
వక్ఫ్ సవరణ బిల్లుపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకంగా విపక్షాలు వాకౌట్ చేయగా, బిల్లును రాజ్యాంగ వ్యతిరేకంగా ఆరోపిస్తూ ఒవైసీ తీవ్ర విమర్శలు చేశారు.

నేడే లోక్‌సభలో బిల్లు
చర్చకు 8 గంటలు కేటాయింపు
బీఏసీ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్
మైనారిటీల్లో అనవసర భయాలు సృష్టిస్తున్నారన్న మంత్రి రిజిజు
బిల్లు రాజ్యాంగ విరుద్ధమని సభలోనే చెబుతా: ఒవైసీ
ఎంపీలకు బీజేపీ, కాంగ్రెస్ విప్ జారీ
బిల్లుపై మద్దతుకు నితీశ్ షరతులు
వక్ఫ్ బిల్లుకు టీడీపీ మద్దతు
పార్టీ సూచించిన సవరణలకు
ఆమోదం నేపథ్యంలో నిర్ణయం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): వక్ఫ్ సవరణ బిల్లుపై అధికార, ప్రతిపక్షాలు అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ బిల్లును కేంద్రప్రభుత్వం బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. వెంటనే చర్చ కూడా జరుగుతుంది. స్పీకర్ ఓం బిర్లా ఇందుకు 8 గంటల సమయం కేటాయించారు. అయితే బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు.. మంగళవారం జరిగిన సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. ముస్లింల హక్కులను లాక్కునేందుకే బీజేపీ ఈ బిల్లును తీసుకొస్తోందని, ఇది రాజ్యాంగవిరుద్ధమని అవి ఆరోపిస్తుండగా.. అలాంటిదేమీ జరుగదని.. ముస్లింలలో లేనిపోని భయాందోళనలు సృష్టిస్తున్నారని బీజేపీ విరుచుకుపడుతోంది. గత ఏడాది తీసుకొచ్చిన ఈ వక్ఫ్ సవరణ బిల్లు-2024ను ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి నివేదించిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎంపీ జగదంబికా పాల్ నేతృత్వంలోని ఈ కమిటీ పలు సార్లు సమావేశమైంది. ముస్లిం సంఘాలతో, ప్రముఖులతో చర్చించింది. జేపీసీలో విపక్ష సభ్యులు పలు సవరణలు ప్రతిపాదించగా తిరస్కరించింది. టీడీపీ, జేడీయూ సహా ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలు ప్రతిపాదించిన 14 సవరణలను బిల్లులో పొందుపరిచింది. నివేదికను ఇటీవలే స్పీకర్‌కు సమర్పించింది. కొన్ని మార్పులతో సవరణ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది.
ఈ అంశంపై మంగళవారం స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశమైంది. తమ గొంతు నొక్కుతున్నారంటూ విపక్షాలు వాకౌట్ చేశాయి. ప్రతిపక్షాలు చర్చకు అధిక సమయం కేటాయించాలని అడిగాయని.. మణిపూర్ పరిస్థితి, ఓటర్ల ఫొటో గుర్తింపు కార్డుల అంశంపైనా చర్చించాలని కోరాయని.. ప్రభుత్వం పట్టించుకోలేదని లోక్‌సభలో కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగోయ్ ఆరోపించారు. అయితే చాలా పార్టీలు 4 నుంచి 6 గంటలు చర్చించాలని కోరాయని.. విపక్షాలు 12 గంటలన్నాయని.. చివరకు సభాపతి 8 గంటలు కేటాయించారని.. అయితే సభ కోరితే సమయాన్ని ఆయన పొడిగిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు వెల్లడించారు. చర్చ నుంచి పారిపోవడానికి రకరకాల సాకులు వెతుకుతున్నాయని విపక్షాలపై మండిపడ్డారు. బుధవారం ప్రశ్నోత్తరాలు పూర్తికాగానే.. మైనారిటీ వ్యవహారాల మంత్రి హోదాలో సభలో తానీ బిల్లును ప్రవేశపెడతానని చెప్పారు. బిల్లుపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేసి సమాజంలో అశాంతిని రేకెత్తించేందుకు కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఈ బిల్లును క్రైస్తవ సంస్థలు కూడా సమర్థిస్తున్నాయని తెలిపారు. కాగా.. బిల్లును వ్యతిరేకించేందుకు అనుసరించాల్సిన సంయుక్త వ్యూహంపై చర్చించేందుకు ‘ఇండీ’ కూటమి నేతలు మంగళవారం పార్లమెంటు ప్రాంగణంలో సమావేశమయ్యారు.
బిల్లుపై చర్చలో క్రియాశీలంగా పాల్గొనడమే గాక దానికి వ్యతిరేకంగా ఓటేయాలని కూటమి నిర్ణయించినట్లు ఆర్‌ఎస్‌పీ ఎంపీ ఎన్‌కే ప్రేమ్‌చంద్రన్ మీడియాకు చెప్పారు. బుధవారం సభకు హాజరయ్యే ముందు రాహుల్ కాంగ్రెస్ ఎంపీలతో సమావేశం కానున్నారు. వక్ఫ్ బిల్లు ఎలా రాజ్యాంగ విరుద్ధమో తన అభిప్రాయాలను పార్లమెంటు ముందుంచుతానని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. ముస్లింల మతస్వేచ్ఛను హరించేందుకే ఈ బిల్లును తీసుకొస్తున్నారని ఆరోపించారు. 543 మంది సభ్యుల లోక్‌సభలో ప్రస్తుతం 542 మంది ఎంపీలు ఉండగా.. ఎన్‌డీఏకి 293 మంది, ఇండీ కూటమికి 238 మంది ఉన్నారు. వైసీపీ, ఎంఐఎం సహా ఇతర పార్టీలకు 11 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులు ఉండగా.. 9 ఖాళీల కారణంగా 236 మందే ఉన్నారు. వీరిలో ఎన్‌డీఏ ఎంపీలు 125 మంది కాగా.. ఇండీ కూటమికి 88 మంది, వైసీపీ, బీజేడీ, బీఆర్‌ఎస్ సహా ఇతరులకు 23 మంది సభ్యులున్నారు. స్వతంత్రుల మద్దతు కూడగట్టేందుకు కేంద్ర మంత్రులు రంగంలోకి దిగారు. తమ ఎంపీలంతా బుధవారం లోక్‌సభకు హాజరు కావాలని బీజేపీ విప్ జారీచేసింది. బుధవారమే గాక గురు, శుక్రవారాల్లో తప్పక సభకు రావాలని కాంగ్రెస్ కూడా తన ఎంపీలను ఆదేశించింది.
అలాగైతేనే నితీశ్ మద్దతు?
జేడీయూ సూచించిన మార్పులను జేపీసీ ఆమోదించినా.. ఆ పార్టీ అధినేత, బిహార్ సీఎం నితీశ్‌కుమార్ వక్ఫ్ బిల్లుకు మద్దతుపై ఇంకా తన వైఖరిని స్పష్టం చేయలేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీనిపై జేడీయూ ఎంపీ సంజయ్ ఝా మాట్లాడుతూ.. రాష్ట్రంలో 19 ఏళ్లుగా నితీశ్ ముస్లింల సంక్షేమానికి కృషిచేస్తున్నారని.. వారికి ఇబ్బంది కలిగించే ఎలాంటి చర్యలనూ ఆయన అంగీకరించరని స్పష్టంచేశారు. వక్ఫ్ వ్యవహారాల్లో గతంలో జరిగిన వాటిని తవ్వితీయకూడదని ప్రభుత్వానికి స్పష్టంచేశామని తెలిపారు. ఇందుకు కేంద్రం అంగీకరిస్తేనే మద్దతిస్తామని జేడీయూ షరతు విధించినట్లు సమాచారం.
బిల్లుకు టీడీపీ, జనసేన మద్దతు
జేపీసీలో సభ్యుడిగా ఉన్న టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు బిల్లులో మూడు మార్పులను ప్రతిపాదించారు. వాటిని ఆమోదించి సవరణ బిల్లులో పొందుపరచినందున ఆ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బిల్లుకు మద్దతు తెలిపేందుకు సభకు హాజరు కావాలని టీడీపీ చీఫ్ విప్ హరీశ్ తమ ఎంపీలకు విప్ జారీచేశారు. పార్లమెంటులో వక్ఫ్ బిల్లుకు మద్దతు తెలపాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తమ ఎంపీలను ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Husband Marries Wife to Lover: మళ్లీ మొదటి భర్త వద్దకు..
Horoscope 2025-2026: Horoscope 2025-2026: కొత్త సంవత్సరంలో మీ జాతక చక్రం ఎలా తిరగబోతుందో చూసుకోండి
Sri Rama Navami: Sri Rama Navami: శ్రీరామనవమి రోజు.. ఇలా చేయండి.. చాలు
Bengaluru Teacher: విద్యార్థి తండ్రితో అక్రమ సంబంధం.. టీచర్ అరెస్ట్
For Latest National News , National News in Telugu