తెలివి తెచ్చుకున్న కాకి

ABN , First Publish Date - 2023-10-02T23:24:53+05:30 IST

ఒక రోజు ఉదయమూ లేచింది సోమరి కాకి. తనకు తనమీదనే కోపం వచ్చింది...

తెలివి తెచ్చుకున్న కాకి

ఒక రోజు ఉదయమూ లేచింది సోమరి కాకి. తనకు తనమీదనే కోపం వచ్చింది. తాను పొదిగిన గుడ్లు లోంచి వచ్చిన కోయిలకు ఇంత మంచి కంఠం ఎక్కడిది? అనుకుంది. తాను ఎలాగైనా మంచి గొంతు కలది అని నిరూపించుకోవాలనుకుంది. అయితే కాకి వెళ్లి అడిగితే కోయిల వొప్పుకుంటుందా? అనే సందేహం ఉండేది. పేరు తెచ్చుకోవాలనే కోరిక ఉండటంతో కోయిలను వెళ్లి అడిగింది. అడిగిందే తడవుగా కాకిని బాధపెట్టకుండా.. నువ్వు రోజూ ఉదయాన్నే మా ఇంటికి రావాలి.. అని అడిగింది. కాకికి నిద్ర లేవటం అలవాటు లేదు.. అయినా తన పాటతో అందరినీ పరవశింపచేయాలనే కోరికతో కోయిల ఇంటికి వెళ్లింది. అయితే ఆలస్యంగా వెళ్లింది. కోయిలకు ఓపిక సచ్చిపోయింది. పాడమని అడిగింది అయినా. కాకి ‘కావ్‌..కావ్‌’ అన్నది. కోయిలకు కోపం వచ్చింది. ‘జీవితంలో నేర్చుకోలేవు’ అన్నది. కాకి బాధపడింది.

దారింటా వెళ్తుంటే.. కనీసం చిలక పలుకులు నేర్చుకుందామనుకుంది కాకి. చిలుక ఇంటికి వెళ్లింది. చిలుక కాదనలేక తీయగా మాట్లాడింది. కాకి ‘కావు.. కావు’ అన్నది మెల్లగా. ‘మీ జాతి తీయగా మాట్లాడదు’ అన్నది చిలుక. కాకికి చిర్రెత్తుకొచ్చింది. బాధతో వెళ్లిపోయింది అక్కడనుంచి. చివరి దారింటా వెళ్తుంటే గిజిగాడు కనపడింది. కనీసం గూడు కట్టలేనా? నాకేమీ ప్రతిభ లేదా? మంచి గూడు కట్టి అన్ని పక్షులకు ఆదర్శంగా నిలుస్తాననుకుంది మనసులో. గిజిగాడి దగ్గరకు పోయి గూడు ఎలా కట్టాలో నేర్పించమని అడిగింది. ‘జన్మలో నేర్పించలేను. ఇది మా పూర్వీకుల ఘనత. నీకు పుల్లలను పేర్చటమే రాదు. గూడు కడతావా?’ అన్నది. అంత చిన్నపిట్టకు ఇంత పరిహాసమా? అనుకుంటూ కోపంతో గిజిగాడి మీదకు పోయింది కాకి. బావి చివరిలోని చిటారు కొమ్మమీద వేలాడే గూటిలోకి గిజిగాడు తుర్రుమన్నది. ఆ చిన్న కొమ్మమీద నిలబడలేక కాకి ఇంటి దారిపట్టింది.

2.jpg

సూర్యాస్తమం సమయంలో నెమలి పురివిప్పి నాట్యం ఆడుతోంది. అది చూసి కనీసం నాట్యం నేర్చుకోవాలనుకుంది. వెళ్లి నెమలిని అడిగింది. ‘ఇది చాలా కష్టం. గెంతడం కాదు.. నాట్యమంటే..’ అంటూ వెకిలిగా మాట్లాడింది నెమలి. క్షణాల్లో తుర్రుమంది కాకి. ఆ రాత్రి నిద్రపట్టలేదు. నాకు ప్రతిభే లేదా? అనుకుంది.

ఉదయాన్నే లేచిన తర్వాత ఒక వ్యక్తి భోజనం పడేస్తున్నాడు. ఆకలితో గట్టిగా కావ్‌.. కావ్‌ అన్నది కాకి. గుంపులుగా కాకులు వచ్చాయి. ఆ క్షణంలో కాకి ఇలా అనుకుంది.. ‘నాకేమీ ప్రతిభ లేదనుకున్నా. నేను అరిస్తే ఇంత మంది మిత్రులు వచ్చారు. అంటే ఇతరులకు భోజనం చూపించటమనే గొప్ప వరం దేవుడు నాకు ఇచ్చాడు’ అనుకుంది కాకి. తన గురించి తానే కనుక్కున్న కాకి ఆనందానికి అవధుల్లేవ్‌.

Updated Date - 2023-10-02T23:24:53+05:30 IST