Meghna Rami ; నా కథే ఓ సినిమా అవుతుంది
ABN , First Publish Date - 2023-04-03T00:10:30+05:30 IST
తండ్రి వ్యాపారంలో నష్టాలు... అంతులేని కష్టాలకు కారణమయ్యాయి. రెండు బ్యాగ్‌లు... కొన్ని వంట గిన్నెలతో చెన్నై చేరిన కుటుంబానికి సవాళ్లు స్వాగతం పలికాయి. పదిహేడేళ్ల వయసు... ఇల్లు గడవని పరిస్థితులు...

తండ్రి వ్యాపారంలో నష్టాలు... అంతులేని కష్టాలకు కారణమయ్యాయి. రెండు బ్యాగ్‌లు... కొన్ని వంట గిన్నెలతో చెన్నై చేరిన కుటుంబానికి సవాళ్లు స్వాగతం పలికాయి. పదిహేడేళ్ల వయసు... ఇల్లు గడవని పరిస్థితులు... నాన్నకు తోడుగా భారం భుజాన వేసుకుంది. ఇష్టపడిన పరిశ్రమలో పట్టు వదలని ప్రయత్నాలతో... చివరకు అనుకున్నది సాధించింది. తల్లి పాత్రల్లో తెరపై ఒదిగిపోవడమే కాదు... నిజ జీవితంలో అభాగ్యుల ఆకలి తీర్చే అమ్మగానూ జీవిస్తున్న నటి మేఘనా రామి. ఆమె ‘నవ్య’తో పంచుకున్న అనుభవాలివి...
నాన్న వద్దన్నారు...
పెద్ద కూతురుగా కుటుంబ బాధ్యతను నేను కూడా పంచుకోవాల్సి వచ్చింది. దాని కోసం నేను చిన్నప్పటి నుంచి కలలు కన్న సినీ పరిశ్రమలో ప్రయత్నాలు ప్రారంభించాను. ఫొటోలు పట్టుకుని స్టూడియోల చుట్టూ తిరిగాను. ఇప్పటిలా కాదు... ఫొటోలు తీయించుకోవాలంటే అప్పుడు ఐదారు వేలు ఖర్చయ్యేవి. నాన్న తన స్నేహితుడి దగ్గర అప్పు తీసుకుని, నాకు ఫొటోలు తీయించారు. మొదట నాన్న వద్దన్నారు. అందుకు కారణం పరిశ్రమ మీద ఆయనకు సదభ్రిప్రాయం లేకపోవడమే. అటు వెళితే పెళ్లిళ్లు కావని భయపడేవారు. నేను ఎంత చెప్పినా వినలేదు. అయితే ఇంటి పరిస్థితులు మరింత దిగజారిపోవడంతో కాదనలేకపోయారు. ఈ రంగాన్నే ఎందుకు ఎంచుకున్నానంటే... నా కోరిక నటి కావాలన్నదే. ఏ డాక్టరో, ఇంజనీరో అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. స్కూలు, కాలేజీలో కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని.
ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు...
ప్రస్తుతం ‘నీలి మేఘాలలో’ అనే యూట్యూబ్ చానల్ ఒకటి నడిపిస్తున్నాను. అందులో రకరకాల వంటలు వండి చూపిస్తున్నాను. 3.5 లక్షల మంది సబ్‌స్ర్కైబర్స్ ఉన్నారు. నాకు కుకింగ్ చాలా ఇష్టం. వెజ్, నాన్‌వెజ్ అద్భుతంగా వండుతాను. అలాగే ‘ఎన్‌ఎం ఫుడ్స్’ పేరుతో ప్రీమియమ్ ఫుడ్ బ్రాండ్ ఇటీవలే ప్రారంభించాం. దీని ద్వారా తొలుత పచ్చళ్లు అందిస్తున్నాం. ఇక నేను, మావారు కలిసి ఆరేళ్లుగా ‘ఫీడ్ ది హంగ్రీ’ అనే స్వచ్ఛంద సంస్థ నడిపిస్తున్నాం. నేను ఎన్నో కష్టాలు పడి ఇక్కడ వరకు వచ్చాను. మాకు లేని రోజు ఎన్నెన్ని మాటలు అన్నారో, ఎన్నెన్ని అవమానాలు భరించామో తెలుసు. ఆ బాధ తెలుసు కనుకనే ఈ ఫౌండేషన్ ప్రారంభించాం. వృద్ధాశ్రమాలు, అనాథ ఆశ్రమాలకు వెళ్లి ఫుడ్ అందిస్తున్నాం. వీధుల్లో నివసించేవారికి తోచిన సాయం చేస్తున్నాం. మొన్నామధ్య పట్టాయిగూడెం అని సత్తుపల్లి నుంచి 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ 2.85 లక్షలతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశాం. ఆ చుట్టుపక్కల గ్రామాల వారు కూడా వచ్చి నీళ్లు పట్టుకెళుతున్నారు. వాళ్ల నీటి కష్టం తీర్చినందుకు ఆనందంగా ఉంది. ఎంత సంపాదిస్తే మాత్రం ఇంతటి సంతోషం, సంతృప్తి దొరుకుతాయి చెప్పండి!
‘‘నేను... మావారు... ఇద్దరం బతకడానికి ఎంత కావాలి! ఎంత సంపాదించినా పోయేటప్పుడు తీసుకుపోయేదేముంటుంది! అందుకే మాకు ఉన్నంతలో తోచిన సాయం చేస్తున్నాం. వృద్ధాశ్రమాలు, వీధుల్లో రోజులు వెళ్లదీస్తున్న వారి కడుపు నింపుతున్నాం. ఇది ఎవరి మెప్పు కోసమో కాదు... మా సంతృప్తి కోసం. ఎన్నో కష్టాలు దాటి నేడు ఈ స్థాయికి వచ్చాను. పేదరికం బాధలు, ఆకలి విలువ తెలుసు నాకు. మా నాన్నా వాళ్లది గుజరాత్. అమ్మావాళ్లది నెల్లూరు. నేను చెన్నైలో పుట్టాను. ముంబయిలో పెరిగాను. హైదరాబాద్‌లో చదువుకున్నాను. బతుకుదెరువు కోసం మళ్లీ చెన్నై వెళ్లాను. తీస్తే నా జీవితమే ఒక సినిమా కథ అవుతుంది. నాన్నకు వ్యాపారంలో నష్టాలు రావడంతో మా కుటుంబం దాదాపు రోడ్డు మీదకు వచ్చేసింది. రెండు బ్యాగ్‌లు, ఒక సంచీలో వంట సామాన్లు తీసుకుని అమ్మనాన్న, నేను, తమ్ముడు, చెల్లి... అంతా కలిసి చెన్నై వెళ్లాం. చిన్న ఇంట్లో అద్దెకు ఉండేవాళ్లం. అక్కడ తన స్నేహితుడి అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీలో చేరారు నాన్న. ఆయనకు వచ్చేదాంట్లో కుటుంబం గడవడం కష్టమైపోయింది. అప్పుడు నాకు పదిహేడేళ్లు ఉంటాయి.
దూరదర్శన్‌తో శ్రీకారం...
చివరకు నా ప్రయత్నాలు ఫలించాయి. దూరదర్శన్‌లో అవకాశం వచ్చింది. ‘ఓయువు’ అనే తమిళ సీరియల్‌లో ప్రధాన పాత్ర నాది. అలా 1999లో తమిళ పరిశ్రమలో నా ప్రయాణం మొదలైంది. నాడు డీడీలో సీరియల్ చేయడమంటే చాలా గొప్ప. అప్పట్లో ఎపిసోడ్‌కు రూ.500 ఇచ్చేవారు. ఆ డబ్బే మా కుటుంబాన్ని ఆదుకుంది. తరువాత కొన్ని సింగిల్ ఎపిసోడ్స్, సీరియల్స్ చేశాను. వివేక్ గారితో ఒక డిటెక్టివ్ సీరియల్‌లో నటించాను. అదీ పెద్ద హిట్ అయింది. బీఏ చదువుతూనే నటన కొనసాగించాను.
సెలవులకు వచ్చి...
ముఖ్యంగా మేం చెన్నైలో ఉన్న చిన్న ఇల్లు మాకు ఎంతో ఇచ్చింది. అక్కడే చదువుకున్నాం. ఆర్థిక ఇబ్బందుల నుంచి కాస్త బయటపడ్డాం. గోనె పట్టాల మీద పడుకున్నవాళ్లం పరుపులు కొనుక్కోగలిగాం. నేనూ బిజీ అయ్యాను. అయితే మాతృ భాషలో నటించాలనే కోరిక నాకు మొదటి నుంచీ ఉండేది. అనూహ్యంగా ఆ కోరిక నెరవేరింది. ఎలాగంటే... సెలవులకు నేను హైదరాబాద్ వచ్చాను. మా అక్క ఉమా మహంతి అప్పట్లో ‘మిస్ ఆంధ్రా’. తను దూరదర్శన్‌లో ‘ముత్తైదువు’ సీరియల్ ఆడిషన్స్‌కు వెళుతోంది. తోడుగా రమ్మంటే నేనూ వెళ్లాను. విశేషమేమంటే తరువాత ఆ సీరియల్‌లో నేనూ భాగమయ్యాను. అదే తెలుగులో నా మొదటి ప్రాజెక్ట్. 2000లో వచ్చింది. కానీ నిర్మాత నాకు డబ్బు ఇవ్వలేదు. పైగా ఒక ఇల్లు సమకూర్చి, అమ్మానాన్నలను ఇక్కడికి తెద్దామని నేను సంపాదించినదంతా ఆయన దగ్గర దాచుకున్నా. అవన్నీ ఆయన ఖర్చు పెట్టేశాడు. రెండు మూడుసార్లు అడిగాను. ఇవ్వలేదు. ఇలాంటివన్నీ అనుభవ పాఠాలుగా మిగిలిపోయాయి.
మరో ఇల్లు...
ఆ తరువాత ‘శ్రీకాంత్ ప్రొడక్షన్స్’లో అడుగుపెట్టా. ‘ఆత్మీయులు, భార్యాభర్తలు, చక్రవాకం’ తదితర సీరియల్స్ చేశాను. మంచి పాత్రలు వచ్చాయి. అవే నా కెరీర్‌ను మలుపు తిప్పాయి. నన్ను నటిగా నిలబెట్టింది, ఒక ఆర్టిస్ట్‌గా తీర్చిదిద్దింది మంజులా నాయుడు గారు. ఆ ప్రొడక్షన్ హౌస్ నాకు మరో ఇల్లులా మారిపోయింది. అక్కడ ఉన్నప్పుడే నా పెళ్లి కూడా జరిగింది. ‘చక్రవాకం’ చేస్తున్నప్పుడు అందులో హీరో ఇంద్రనీల్‌తో పరిచయం పెళ్లి పీటలు ఎక్కించింది. అది సీరియల్ షూటింగ్ మొదటి రోజు. నేను క్యాజువల్ డ్రెస్‌లో సెట్‌కు వెళ్లినప్పుడు మొదటిసారి ఆయన నన్ను చూశారు. తరువాత పైకి వెళ్లి మేకప్ అయ్యి, చీర కట్టుకుని కిందకు వచ్చాను. ముడి, బొట్టు అవీ ఉంటాయి కదా... ‘ఇలాంటి కట్టూ బొట్టూ ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి’ అనుకున్నారట అప్పుడు నన్ను చూసి. చాలా రోజులకు నాకు ప్రపోజ్ చేసినప్పుడు ఆ విషయం చెప్పారు. అప్పటికే ఆయన హీరో. ఇప్పటికీ అలానే ఉన్నారనుకోండి. నాకు ఇంతటి మంచి భర్తను ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు. భర్తగా కంటే మంచి స్నేహితుడిలా ఉంటారు ఇంద్ర.
నేనేంటో అప్పుడే తెలిసింది...
నేను, మావారు 2017లో ‘నీతోనే డ్యాన్స్’ అనే కపుల్ రియాలిటీ షో ఒకటి చేశాం. అప్పుడే మేఘనా అంటే ఏంటో జనాలకు తెలిసింది. అప్పటి వరకు ‘పాపం ఇంద్రనీల్ ముసలావిడను చేసుకుని మోసపోయాడు’ అన్నారు చాలామంది. ఎందుకంటే ‘చక్రవాకం’లో నేను ఇంద్రకు అత్తగారిగా చేశాను. సో... జనం నేను పెద్దదాన్ని అనుకున్నారు. కొందరు మా బంధం గురించి చాలా నీచంగా రాసేవారు... ‘అత్తగారిని పెళ్లి చేసుకున్న హీరో’ అని! బయటకు వెళ్లినప్పుడు అడిగేవారు... ‘మీ కొడుకుతో వచ్చావా... అల్లుడితో వచ్చావా’ అని! నేను ‘యస్’ అని చెప్పేసి వెళ్లిపోయేదాన్ని. బాధ పడలేదు. ఎందుకంటే వాళ్లు నన్ను కాకుండా నా కేరెక్టర్స్‌ను చూస్తున్నారు. అంతే! కానీ ఆ డ్యాన్స్ షో తరువాత వాళ్లందరి అభిప్రాయం మారిపోయింది. అప్పట్లో బాగా లావుగా ఉండేదాన్ని. అంత భారీకాయంతో అద్భుతంగా డ్యాన్స్ చేశాను. అది చూసి మా జంట గెలవాలని అందరూ కోరుకున్నారు. వాళ్ల ప్రార్థనలవల్ల మేం షో విన్నర్స్ అయ్యాం. ‘బెస్ట్ కపుల్. మీరు ఎందరికో స్ఫూర్తి’ అన్నారు తరువాత. అది నాకు పెద్ద విజయం.
అందుకే తల్లి పాత్రలు...
నేను 21 ఏళ్లకే తల్లి పాత్రలు వేయడం ప్రారంభించాను. లీడ్ రోల్స్ కాదనుకోవడానికి కారణం... ఆ హగ్గింగ్‌లు, టచింగ్‌లు నాకు అస్సలు నచ్చవు. కొన్ని రోజులు చేశాను. కానీ కంఫర్టబుల్‌గా లేనని నాకు అర్థమైంది. రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడమనేది ఒక ఆర్ట్. ప్రేక్షకులను మెప్పించగలగాలి. నేను అలా చేయలేను. నా ప్లస్‌లు, మైనస్‌లు తెలిసినప్పుడు ఆ పాత్రలు కొనసాగించడంలో అర్థం ఉండదు. అందుకే ‘కాలచక్రం’ సీరియల్ నుంచి తల్లి పాత్రలకు మారిపోయాను. ఇంట్లోవాళ్లు, స్నేహితులు ఒకటే తిట్లు... అప్పుడే ఆ వేషాలు వేస్తున్నావేంటని! కానీ అంత చిన్న వయసులోనే తల్లిగా మెప్పించగలిగానంటే నటిగా నేను విజయం సాధించినట్టే కదా!
ప్రస్తుతం ‘జీ తెలుగు’ వారి ‘రాధమ్మ కూతురు’ సీరియల్ చేస్తున్నా. టైటిల్ రోల్ నాదే. ‘చక్రవాకం’తో ఎంత పేరు వచ్చిందో ‘రాధమ్మ’గా అంతకు మించి మంచి నటిగా గుర్తింపు వచ్చింది. ఈ సీరియల్‌కు 35 కిలోల బరువు తగ్గాను. నన్ను చూసి అంతా షాకయ్యారు. మొత్తంగా చూసుకొంటే ఇప్పటి వరకు 30కి పైగా సీరియల్స్, ఆరు సినిమాలు చేశాను. ఒక మంచి నటిగా జనం గుండెల్లో స్థానం సంపాదించుకోగలిగాను. ఇంత కంటే ఏంకావాలి!’’
హనుమా