Share News

Annavarapu Ramaswamy: రెక్కలొచ్చాయని ఎగిరిపోయే స్వభావం కాదు

ABN , Publish Date - Mar 23 , 2025 | 04:53 AM

‘నాద సుధార్ణవ’ అన్నవరపు రామస్వామి... ఒక గాంధర్వ విశ్వవిద్యాలయం. సంగీత విజ్ఞాన పీఠం. వాయులీన వాద్యానికి తన జీవితాన్ని అంకితం చేసి, అనేక దశాబ్దాలపాటు రసజ్ఞులను తన్మయత్వంలో ముంచెత్తిన సుస్వర జ్ఞాని. ఎంత నేర్చినా, ఎన్ని సాధించినా... ‘‘నాదేమీ లేదు గురుకృప, నా తల్లితండ్రుల దీవెన’’ అంటారు వినయంగా.. నేడు నూరో వసంతంలోకి అడుగు పెడుతున్న ఆయనతో ఇష్టాగోష్ఠి... ‘నవ్య’కు ప్రత్యేకం.

Annavarapu Ramaswamy: రెక్కలొచ్చాయని ఎగిరిపోయే స్వభావం కాదు

ముందుగా మీ స్వస్థలం గురించీ, మీ కుటుంబం గురించీ చెబుతారా?

మాది ఏలూరు సమీపంలో ఉన్న సోమవరప్పాడు అనే కుగ్రామం. చిటికిన వేలు కన్నా చిన్న వేలు... మా ఊరు కన్నా చిన్న ఊరు ఉంటాయని నేను అనుకోను. నా తండ్రి పేరు పెద్దయ్య, తల్లి లక్ష్మీదేవి. మా పెద్దన్న శోభనాద్రి, తరువాత గోపాలం... రేడియోలో ఘట విద్వాంసునిగా పని చేశారు. ఆయన ఒక్క ఘటమే కాదు... డోలు, మోర్సింగ్‌, తబల, కంజీర కూడా వాయించేవారు. నేను మూడోవాణ్ణి, నాలుగో సోదరుడు వెంకటేశ్వరరావు సబ్‌ రిజిస్ట్రార్‌గా పని చేశారు. మరో ఇద్దరు సోదరులు, నలుగురు అక్క చెల్లెళ్ళు... ఇప్పుడు ఎవరూ లేరు.

ఎంతవరకు చదువుకున్నారు?

(నవ్వుతూ) ఓనమాల వరకూ చదివాను. చాలదా?

సంగీతాభిలాష ఎలా కలిగింది?

మా ఇంట్లో సంగీతం ఎప్పటినుంచో ఉంది. మా తండ్రిగారు నాదస్వరం వాయించేవారు. అన్న గోపాలం డోలు, ఘటం వాయించేవారు. నన్ను పెద్ద విద్వాంసుణ్ణి చేయాలనేది ఆయన కోరిక. మా ఊర్లో మాగంటి జగన్నాథం అనే సంగీతం తెలిసిన మనిషి ఉండేవారు. ఆయనే నా తొలి గురువు. ఆ తరువాత... నాటి ప్రసిద్ధ నాదస్వర విద్వాంసుడు దాలిపర్తి పిచ్చిహరి గారి దగ్గరకు మా అన్నయ్య గోపాలం ఒకసారి నన్ను తీసుకువెళ్ళారు. ఆయన నన్నొక పాట పాడమన్నారు. జగన్నాథం మాస్టారు నేర్పిన పాటొకటి పాడాను. ‘‘వీణ్ణి మా గురువుదగ్గర చేర్చు. వృద్ధిలోకి వస్తాడు’’ అని ఆశీర్వదించారు. ఎవరా గురువు? గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారు. అన్నయ్య నన్ను తిన్నగా తీసుకువెళ్ళి, వారి దగ్గర ప్రవేశపెట్టారు. అది నా జీవితంలో గొప్ప మలుపు. వారు పెద్ద మనసుతో నన్ను శిష్యుడిగా స్వీకరించారు. సంగీత భిక్ష పెట్టారు. అక్కడ అంతా గురుకుల పద్ధతి. ఘనాపాఠీలు వేదం ఎలా నేర్పుతారో... మా గురువుగారు సంగీతం అలా నేర్పేవారు. మధూకర వృత్తి చేసుకుంటూ చదువుకున్నాం. అన్నం దొరకని రోజుల్లో గురువుగారి సతీమణి భోజనం పెట్టేవారు.

gkhj.jpg


అక్కడ ఏదైనా వివక్ష ఎదుర్కొన్నారా?

గురువుగారిది నిప్పులు కడిగే బ్రాహ్మణ్యమే కానీ... శిష్యుల విషయంలో ఆ పట్టింపులేవీ ఉండేవి కావు. కుల, మత, వర్గాలకు అతీతంగా అందరితో అమిత ఆదరంగా ఉండేవారు. బయటకూడా అందరూ నన్ను గౌరవించారు.

మీరు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ సహాధ్యాయులా?

అవును. ఇద్దరం పంతులుగారి దగ్గరే చదువుకున్నాం. బాలమురళి చిన్నతనంలోనే చాలా అద్భుతంగా పాడేవారు. పంతులుగారి శిష్యరికంలో మరింత పదును తేలారు. సక్రమమైన సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే... నవీన దృష్టితో, నూతన కల్పనలతో సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించారు. దాదాపు అన్ని సభల్లో వారికి వయోలిన్‌ వాద్య సహకారం అందించాను.

ఎవరెవరి సభల్లో సహకారం అందించారు?

ఒకరా, ఇద్దరా! ఉత్తరం, దక్షిణం అనే భేదం లేకుండా దాదాపు అందరూ... సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్‌, టి.ఆర్‌.మహాలింగం, బాలమురళి, ఎస్‌.బాలచందర్‌, ముక్త, నూకల, మహారాజపురం విశ్వనాథయ్యర్‌, అరియకుడి రామానుజయ్యంగార్‌, పండిట్‌ భీమసేన్‌ జోషీ, పండిట్‌ జస్‌రాజ్‌, పండిట్‌ వినాయకరావ్‌ పట్వర్ధన్‌... ఇలా ఎందరో నన్ను కావాలనుకొనేవారు.

మీరు కొన్ని కొత్త రాగాలు, తాళాలు కనిపెట్టారని, కీర్తనలు రచించారని విన్నాం..!

ఇన్నాళ్ళూ బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో ఉన్నాను కదా... అందుకు కృతజ్ఞతగా ‘దుర్గ’ అనే రాగం, ‘వందన’ అనే మరో రాగం రూపొందించాను. ఇక తాళం పేరు ‘వేదాది’. వేదాలు నాలుగు కదా... అందుకని నాలుగు వేదాల నుంచి నాలుగు జాతులు... త్రిశ, చతురస్ర, మిశ్ర, ఖండ జాతుల సమాహారంగా ఉంంటుందది. ఇక ఒక కొత్త వర్ణం... పేరు ‘హిందోళం’. ‘గురుని పొగడ తరమా’... మా గురువుగారిని స్మరించుకుంటూ ధన్యాసి రాగంలో ఒక కీర్తన, గణపతిని, శారదాంబను, దక్షిణామూర్తిని భజిస్తూ మరొకటి రాశాను.


ఇన్నేళ్ళ సంగీత జీవితంలో ఎన్నో ప్రశంసలు పొందారు. వాటిలో మీరు మరచిపోలేనివి..?

ప్రశంసలన్నీ తియ్యగానే ఉంటాయి. కానీ ద్వారం వెంకటస్వామి నాయుడుగారు, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్‌ల ప్రశంసలు నా మనసులో స్థిరంగా నిలిచిపోయాయి. ‘‘నా తరువాత దేశంలో చాలాకాలం నిలబడేది అన్నవరపు ఒక్కడే’’ అన్న ద్వారం వారి మాటలు వమ్ము కాకూడదని నేను చేయని సాధన లేదు. అలాగే టీవీలో నా ప్రదర్శన చూసిన సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్‌ వెంటనే మంగళంపల్లికి ఫోన్‌ చేసి ‘‘తిరుక్కోడికావల్‌ కృష్ణయ్యర్‌ బాణీ పట్టుకున్నాడు రామస్వామి... ఇక తిరుగులేదు’’ అని ముచ్చట పడ్డారట. కృష్ణయ్యర్‌ ఒకప్పుడు ఘనత వహించిన వాయులీన విద్వాంసుడు. ‘‘కృష్ణయ్యర్‌ వయోలిన్‌ వాయిస్తూ ఉంటే... ఆ ఆరోహణలు, అవరోహణలు... రెక్కలను ఆడించకుండా, శ్రమ పడకుండా, ఠీవిగా, ఆకాశంలో పక్షులు ఎగురుతున్నట్టు ఉండేవి. ఆ గాంభీర్యం, ఆ సంగీత నైపుణ్యం రామస్వామికి అబ్బింది. రామస్వామి చాలా పైస్థాయికి వెళ్ళి, స్వర ప్రస్థానం చేసినా... రాగంలో స్వరశుద్ధికి ఏ మాత్రం భంగం వాటిల్లలేదు’’ అని సెమ్మంగుడి మెచ్చుకున్నారట. ఇంతకుమించిన ప్రశంసలేముంటాయి?

సంగీత విద్వాంసుల్లో చాలామంది చెన్నై వెళ్లి స్థిరపడ్డారు. మరి మీరెందుకు వెళ్ళలేదు?

‘రెక్కలు వచ్చాయి కదా’ అని ఎగిరిపోవడం నా స్వభావం కాదు. నేను విజయవాడకు వచ్చాను. ఇక్కడే

గురువుగారి దగ్గర విద్య నేర్చుకున్నాను. ఇక్కడే రేడియోలో ముప్ఫై ఏళ్ళకు పైబడి పని చేశాను. ఇక్కడి నుంచే ఎన్నో దేశాలకు వెళ్ళాను. మా గురువుగారి పద్ధతిలో పైసా తీసుకోకుండా సంగీతం చెప్పాను. ఉన్న ఊరునూ, కన్నతల్లిని వదిలెయ్యకూడదని ఇక్కడే ఉన్నాను.

అలసట లేకుండా మెట్లు ఎక్కి, దిగుతున్నారు. మీ ఆరోగ్య రహస్యం ఏమిటి?

సంగీత సాధన, గురుభక్తి, శిష్యుల పురోభివృద్ధి చూడడం, చేతనైనంతలో పదిమందికీ సాయం చేయడం... ఇవన్నీ నాకు బలాన్ని ఇస్తున్నాయి. నాకు దేశ, విదేశాల్లో ఎంతోమంది శిష్య ప్రశిష్యులు ఉన్నారు. శాంతా బయోటెక్‌ అధినేత వరప్రసాద్‌రెడ్డి లాంటి ఆత్మీయ అభిమానులు ఉన్నారు. నేను ఇప్పటికీ సాధన చేస్తున్నాను. పాఠాలు చెబుతున్నాను.

-ప్రయాగ రామకృష్ణ


అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ తదితర అనేక దేశాల్లో... వందలాది కార్యక్రమాల్లో తన ప్రజ్ఞను రామస్వామి ప్రదర్శించారు. సంగీతం అఖండమనీ, దేశ, కాల, జాతులకు అతీతమైనదనీ నిరూపించారు. భారత ప్రభుత్వం నుంచి ‘పద్మశ్రీ’ పురస్కారం, కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం, మద్రాస్‌ మ్యూజిక్‌ అకాడమీ వారి టి.టి.కె.మెమోరియల్‌ అవార్డు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి కళారత్న అవార్డు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గౌరవ పురస్కారం... ఆయన పొందిన గౌరవాల్లో కొన్ని.

నిరాధార వాద్యంగా, పక్కవాద్యంగా పేరుపడిన వయోలిన్‌కు స్వతంత్రవాద్యంగా స్వయం ప్రతిపత్తినీ, గౌరవాన్నీ కల్పించి, అపురూపమైన వాద్యంగా మలచింది ద్వారం వెంకట స్వామి నాయుడు గారైతే... ఆ గౌరవాన్ని పరిరక్షిస్తూ వచ్చినవారిలో రామస్వామి గారు ముందుంటారు. రామస్వామి గారి వయోలిన్‌ వాదనంలో కచ్చితత్వం, సున్నితమైన శైలి, శృతిలయల సౌందర్యం ప్రధానంగా కనిపిస్తాయి. మంద్ర, మధ్యమ తార స్థాయిలు మూడిటిలోనూ రామస్వామిగారి నాదం సమతూకంలో ఉంటుందనేది సంగీతం రుచి తెలిసినవారు అనే మాట. 1948లో... విజయవాడ ఆకాశవాణి కేంద్రం ప్రారంభమైన తొలినాళ్ళలో, నిలయ విద్వాంసుడిగా చేరిన రామస్వామి.. సుమారు మూడున్నర దశాబ్దాలపాటు అక్కడ పనిచేశారు. అత్యుత్తమ సంగీత విద్వాంసుడిగా రసజ్ఞుల మెప్పు పొందారు.


ఇవి కూడా చదవండి..

IPL 2025: విరాట్‌తో, షారూక్ ఖాన్ డ్యాన్స్.. కింగ్ కోహ్లీ డ్యాన్స్ చూస్తే

IPL 2025: బిగ్‌ స్క్రీన్‌పై ఐపీఎల్.. బీసీసీఐతో పీవీఆర్ ఒప్పందం.

Updated Date - Mar 23 , 2025 | 04:54 AM