Endowment Department : ఆ భూములను ఖాళీ చేయండి
ABN , Publish Date - Mar 24 , 2025 | 04:24 AM
పీఠం ఆక్రమించుకున్న భూములను వెంటనే ఖాళీచేయాలని, ఈ విషయంలో వారంరోజుల్లోగా సమాధానం ఇవ్వాలని, లేదంటే తామే ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకుంటామంటూ రెవెన్యూశాఖ నోటీసులు ఇచ్చింది.

వారంలోగా సమాధానం ఇవ్వండి
శారదా పీఠానికి రెవెన్యూశాఖ నోటీసులు
ఆక్రమణలపై ఎట్టకేలకు కదలిక
అమరావతి, విశాఖపట్నం, మార్చి 23(ఆంధ్రజ్యోతి): విశాఖలోని శారదాపీఠం ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములపై ఎట్టకేలకు కదలిక వచ్చింది. పీఠం ఆక్రమించుకున్న భూములను వెంటనే ఖాళీచేయాలని, ఈ విషయంలో వారంరోజుల్లోగా సమాధానం ఇవ్వాలని, లేదంటే తామే ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకుంటామంటూ రెవెన్యూశాఖ నోటీసులు ఇచ్చింది. ఆదివారం రాత్రి పీఠం మేనేజర్‌కు ఈ నోటీసులు అందచేశారు. పెందుర్తి మండలం చినముషిడివాడలో శారదా పీఠం ఉంది. ఆ సంస్థ చుట్టుపక్కల విలువైన ప్రభుత్వ భూములున్నాయి. వాటి విలువ వందల కోట్లపైనే. అయితే, ఇటు రెవెన్యూ, అటు మున్సిపల్ భూములను పీఠం ఆక్రమించుకుని నిర్మాణాలు చేసిందని అధికారులు గుర్తించారు. వాటిపై సర్వేకు ప్రయత్నించగా పలుమార్లు అడ్డుకున్నారు. దీనిపై అనేక విమర్శలు వచ్చినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇటీవల ఇదే అంశంపై ‘ఆంధ్రజ్యోతి’ ‘పీఠం వెనక మోసం’ శీర్షికన భూఆక్రమణలను వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి కలెక్టర్, జేసీలను అమరావతికి పిలిపించి మాట్లాడింది.
ఆక్రమణలపై నోటీసులివ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆదివారం పెందుర్తి తహసీల్దార్ శారదాపీఠానికి ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణ చట్టం-1905లోని సెక్షన్ 7 కింద నోటీసులు ఇచ్చారు. ‘‘సర్వే నంబర్ 90లో ఉన్న రహదారి భూమిని ఆక్రమించుకున్నారు. ఇది ప్రభుత్వ భూమి. ఇందులో నిర్మాణాలు చేశారు. ఆ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో, అక్రమ నిర్మాణాలను ఎందుకు జప్త్తుచేయకూడదో వారంరోజుల్లోగా వివరణ ఇవ్వాలి’’ అని ఆదేశించారు. ఇదిలా ఉంటే,, వీఎంఆర్‌డీఏ ఆమోదించిన మున్సిపల్ స్థలం కూడా పీఠం ఆక్రమణలో ఉంది. దాన్ని స్వాధీనం చేసుకునేందుకు వీఎంఆర్‌డీఏ కమిషనర్ హోదాలో కలెక్టర్ మరో నోటీసు ఇవ్వనున్నారు.