Revenue Department : రెవెన్యూలో ‘ఫండ్’ పట్టాడు
ABN , Publish Date - Mar 24 , 2025 | 04:15 AM
రెవెన్యూశాఖలో మండల ఆఫీసుల్లో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉంటాయి.

సర్కారుకు తెలియకుండా 350 డీటీ పోస్టుల సృష్టి
175 మంది జూనియర్లకు అక్రమంగా పదోన్నతులు
సొంత మనుషులను పెట్టి భారీగా సొమ్ము వసూలు
తహసీల్దార్లకు జిల్లాల కేటాయింపులో మరో దందా
రాజకీయ లక్ష్యాలతో ఎన్నికల ఫండ్ కోసం వేట
రూ. తొమ్మిదిన్నర కోట్లు వసూలు చేసిన అధికారి
ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు రాజీనామా..
ముడుపులు చెల్లించినవారంతా లబోదిబో
సర్కారుకు చేరిన నిఘా విభాగం నివేదిక
గత ఎన్నికలకు ముందు రాజకీయ లక్ష్యాలతో రంగంలోకి దిగిన ఆ అధికారి.. రెవెన్యూశాఖను ఏకంగా ఏటీఎంగా చేసుకున్నారు. ఒకే సారి 350 డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు సృష్టించారు. పదోన్నతులు ఇచ్చేశాక కూడా ఇంకా మిగిలిన 175 ఖాళీలను జూనియర్లతో నింపేశారు. పెండింగ్‌లో ఉన్న తహసీల్దార్ల సీనియారిటీనీ ఖరారుచేసి ప్యానళ్లను సిద్ధం చేసి, కోరినవారికి కోరినట్లుగా సొంత జిల్లాలు కేటాయించారు. ఇలా దాదాపు రూ.9.50 కోట్ల ఎన్నికల ఫండ్ వసూలు చేసినట్టు తెలిసింది. అయితే, ఇదంతా ప్రభుత్వానికి తెలియకుండా జరగడంతో ఉత్తర్వుల రూపంలో అమల్లోకి రాలేదు. పోస్టుల ద్వారా లబ్ధి పొందుతామని ఆశపడి బడాసాబ్‌కు భారీగా సొమ్ములు సమర్పించుకున్న వారంతా లబోదిబోమంటున్నారు. తాజాగా దీనిపై నిఘా వ్యవస్థ ప్రభుత్వ పెద్దలకు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రెవెన్యూశాఖలో మండల ఆఫీసుల్లో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉంటాయి. ఇందులో ఏ పోస్టుకు సంబంధించిన కొత్తగా ఖాళీలు భర్తీచేయాలన్నా లేదా ఆ పోస్టుల కేడర్ సంఖ్యను పెంచాలన్నా విధిగా రెవెన్యూశాఖ ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. అంటే ఆర్థిక శాఖ ఆమోదంతోపాటు ముఖ్యమంత్రి ఆమోదం ఉండితీరాల్సిందే. ఆఫీసు సబార్డినేట్ పోస్టుకయినా ఇదే విధానం! అయితే, జగన్ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన నాలుగైదు శాఖలకు ఇన్‌చార్జీగా ఉంటూనే, రెవెన్యూలో కీలకమైనస్థానంలో ఉన్న ఓ అధికారి ఆ సూత్రాలను ఉల్లంఘించారు.
ఇందుకు కారణం ఆయనకు ఈజీమనీ కావాల్సి రావడమే. ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. అడ్డగోలుగా ఖర్చుపెట్టి ఓట్లు దండుకునేందుకు సొమ్ము కావాలనుకున్నారు. ఇందుకోసం తన పరిధిలోని ఓ అధికారాన్ని ఉపయోగించారు. అదే డీటీ పోస్టుల సృష్టి. 2023 మే నాటికి మంజూరయిన డీటీ పోస్టులు 1,213. అదనంగా ఒక్క పోస్టును కొత్తగా సృష్టించాలన్నా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. కానీ ఆయన ఈ విధానాన్ని బేఖాతరు చేసి ప్రభుత్వానికి అక్షరం ముక్క సమాచారం ఇవ్వకుండానే ఏకబిగిన 350 డీటీ పోస్టులను సృష్టించారు. మొత్తం కేడర్ పోస్టులను పెంచేశారు. కొత్త పోస్టుల సృష్టిద్వారా అదనంగా 175 ఖాళీలు ఏర్పడ్డాయి. అంటే, సీనియారిటీని నిర్ణయించి, ప్యానళ్లు ఖరారుచేసినా, ఇంకా సర్దుబాటు చేయానికి 175 మంది అధికారులు లేరు. దీంతో ఆగమేఘాల మీద 175 మందికి డీటీలుగా పదోన్నతులు ఇచ్చారు. సర్వీసు కమిషన్‌తో సంబంధం లేదు. ప్రభుత్వంతో సంబంధం లేదు. సారు అనుకున్నారు...పదోన్నతులు ఇచ్చారు. ఇంత వరకు బాగానే సాగింది. కానీ ఇక్కడే చిక్కు వచ్చిపడింది.
జాయింట్ అకౌంట్ స్ర్కీన్ తీసి..
ప్రభుత్వానికి తెలియకుండా, జిల్లా కలెక్టర్ల భాగస్వామ్యం లేకుండా పోస్టుల సృష్టి, ఆగమేఘాల మీద ఇచ్చిన పదోన్నతుల వెనక భారీ వసూళ్ల దందా సాగినట్లు ఆరోపణలున్నాయి. ఎన్నికల్లో పోటీచేయాలన్న సంకల్పంతో ఉన్న సదరు రెవెన్యూ అధికారి కోసం ఓ వ్యక్తి వసూళ్లకు పాల్పడినట్లు తెలిసింది. ప్రభుత్వానికి తెలియకుండానే సృష్టించిన డీటీ పోస్టుల ద్వారా 7.50 కోట్లు; తహసీల్దార్ పదోన్నతులు, సర్వీసు(క్రమశిక్షణ చర్యల ఎత్తివేత) కేసుల రివిజన్ ద్వారా మరో 2 కోట్లు సొంత మనిషి ద్వారా వసూలు చేసినట్లు సమాచారం. ఇందులో అత్యధిక శాతం నగదు రూపంలో, మిగతా సొమ్మును ఆయనభార్యతో కలిపి ఉన్న జాయింట్ అకౌంట్ లో డిపాజిట్లు చేయించినట్లు తెలిసింది. ఆ జాయింట్ అకౌంట్ పాస్ పుస్తకం స్ర్కీన్‌షాట్‌లు తీసి సారు చర్యలతో లబ్ది పొందిన వారికి ఆ వ్యక్తి వాట్స్‌పద్వారా పంపించారు. ఆ అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్లు చేయించారని తెలిసింది. బ్యాంక్ డిపాజిట్, ఆన్‌లైన్ చెల్లింపుల కన్నా నేరుగా నగదు వసూళ్లే చాలా ఎక్కువగా జరిగాయని సమాచారం. కర్నూలు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి, రెవెన్యూలోనే ఓ జూనియర్ అధికారి కలిసి ఈ వసూళ్లను స్వయంగా నిర్వహించినట్లుగా తెలిసింది. కొత్తగా పోస్టులు, పదోన్నతులు వస్తున్నాయని ఆశపడ్డ కొందరు చాలా పెద్దమొత్తంలోనే ఆయనకు సమర్పించుకున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసేందుకు నోటీఫికేషన్‌కు ముందే సదరు అధికారి తన పోస్టుకు రాజీనామా చేశారు. అయితే, ఏడాదిన్నర దాటినా ఆ పోస్టులు, పదోన్నతులకు ఆర్థికశాఖ ఆమోదం రాలేదు. అసలు ఫైలే వెళ్లకుండా ఆమోదం ఎలా లభిస్తుంది? కాబట్టి విషయం బోధపడిన వారు బాధితులయ్యామని ఆందోళన చెందుతున్నారు.
కథ అడ్డం తిరిగింది...
కొత్తగా సృష్టించిన పోస్టులను, వాటి ఆధారంగా ఇచ్చిన పదోన్నతులను ప్రభుత్వం ర్యాటిఫై చేయించాలి. ఆర్థికశాఖ ఆమోదం తీసుకోవాలి. అయితే, ఫైలును ఆర్థికశాఖకు కాకుండా కేవలం రెవెన్యూశాఖ స్థాయిలోనే సెటిల్ చేయిద్దామని సదరు అధికారి ప్రయత్నించారు. దీన్ని సచివాలయం స్థాయిలో రెవెన్యూ అధికారులు వ్యతిరేకించారు. ఫైలును విధిగా ఆర్థికశాఖ ఆమోదానికి పంపించాలని నోట్ ఫైల్స్‌పై రాశారు. ఆర్థికశాఖ ఆమోదం ఉంటే తప్ప ఆ పోస్టులకు విలువ ఉండదని, కేడర్ సంఖ్య పెంపు అనేది ప్రభుత్వ స్థాయిలో తీసుకొనే నిర్ణయం అని, దీనికి సంబంధించిన ఫైలుపై క్రిస్టల్ క్లియర్‌గా రాశారు. దీంతో భలే చిక్కువచ్చిపడింది. ఆర్థిక శాఖకు ఫైలు వెళ్తే ఆమోదించరు. తిరస్కరించడంతోపాటు చీవాట్లు పెడుతారు. మరేం చేయాలి? ఫైలును వెనక్కి తెప్పించుకొని రెవెన్యూ స్థాయిలోనే ‘స్పీకింగ్ ఆర్డర్‘ జారీ చేశారు. దీన్నే జిల్లా కలెక్టర్‌లకు పంపించారు. దీన్ని చూసి నాటి కలెక్టర్లు కంగుతిన్నారు. తమకు తెలియకుండా, మాటమాత్రమైనా డీటీల ప్యానళ్లు సిద్ధం చేయాలని తమకు చెప్పకుండా కొత్తగా పోస్టులు సృష్టించడం, వేగంగా వాటిని పదోన్నతులతో భర్తీ చేయడంపై విస్తుపోయారు. అయితే, పెద్దల పని కావడంతో ప్రశ్నలువేయకుండా కలెక్టర్లు మౌనంగా ఉండిపోయారు.