ఒసిడి వేధిస్తే?

ABN , First Publish Date - 2023-09-25T23:30:48+05:30 IST

ఇందుకు కారణం గురించి స్పష్టమైన వివరణ లేకపోయినా, ఈ కోవకు చెందిన వ్యక్తుల మెదడులో నిర్దిష్ట ప్రదేశాలు అసాధారణంగా ఉండడాన్ని వైద్యులు గమనించారు...

ఒసిడి వేధిస్తే?

ఎక్కువశాతం ఓసిడి వ్యక్తులకు తమ ఆలోచనలు, అలవాట్లు అర్థం లేనివని తెలుసు. అయితే వాటిని మానుకోలేరు. ఒకవేళ బలవంతంగా నియంత్రించుకున్నా ఆత్మన్యూనతకు లోనవుతూ ఉంటారు. ఈ వ్యసనాలు ఏ అంశానికి చెందినవైనా కావచ్చు. శుభ్రత, ఒకే రకమైన వస్తువులను సేకరించడం, తన శరీరంలోని ఒక అవయవం పట్ల అసహ్యం... ఇవన్నీ ఓసిడి లక్షణాలే!

ఒసిడికి కారణం?

ఇందుకు కారణం గురించి స్పష్టమైన వివరణ లేకపోయినా, ఈ కోవకు చెందిన వ్యక్తుల మెదడులో నిర్దిష్ట ప్రదేశాలు అసాధారణంగా ఉండడాన్ని వైద్యులు గమనించారు. అయితే ఈ అంశాలకు సంబంధించి మరింత లోతైన అధ్యయనాలు జరపవలసి ఉంది. ఒసిడి... పురుషుల్లో కంటే స్త్రీలలో ఎక్కువ. యువత, మధ్యవయస్కుల్లో ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి తోడైతే సమస్య మరింత తీవ్రమవుతుంది. ఒసిడికి జన్యువులూ కారణమనే అనుమానాలూ ఉన్నాయి. అయితే కొందరిలో ఒసిడికి కారణాలను వైద్యులు కొన్ని అంశాలను బట్టి నిర్థారించారు. అవేంటంటే...

తల్లితండ్రులలో ఒకరికి, తోడబుట్టినవారికి ఈ సమస్య ఉంటే, వారి రక్తసంబంధీకుల్లో కూడా ఇది తలెత్తే అవకాశాలు ఎక్కువ

మానసిక కుంగుబాటు, ఒత్తిడి

ప్రమాదం బారిన పడడం

బాల్యంలో లైంగికదాడికి గురవడం

నిర్ధారణ పరీక్షలు

ఒసిడి లక్షణాలను కారణాలు అనారోగ్యం కాదని నిర్ధారించుకోవడానికి కొన్ని పరీక్షలు తప్పనిసరి. ఆలోచనలు, అలవాట్లు... దైనందిన జీవితాన్నీ, వృత్తిగత, వ్యక్తిగత జీవితాలను ఇబ్బంది పెడుతున్నా, ఆ పనుల కోసం రోజులో కనీసం గంట సమయం తప్పనిసరిగా కేటాయిస్తున్నా ఒసిడిగా నిర్థారించుకోవాలి.

చికిత్స ఉంది

ఒసిడిని సంపూర్తిగా వదిలించే చికిత్స లేకపోయినా, దాని వల్ల దైనందిన జీవితం దెబ్బతినే తీవ్రతను తగ్గించవచ్చు. ‘టాక్‌ థెరపీ, సైకోథెరపీ’ల సహాయంతో లక్షణాలను నియంత్రించవచ్చు. సైకోథెరపీలో ‘కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీ’, ‘హ్యాబిట్‌ రివర్సల్‌ ట్రైనింగ్‌’ అనే రెండు రకాల చికిత్సలు ఉంటాయి. ‘ఎక్స్‌పోజర్‌ అండ్‌ రెస్పాన్స్‌ ప్రివెన్షన్‌’ అనే థెరపీలో, ఏ అంశాల వల్ల సదరు వ్యక్తులు ఒసిడికి లోనవుతున్నారో, ఆ అంశాలకు వారిని అలవాటు చేస్తారు. ఒకవేళ చేతులు పదే పదే శుభ్రం చేసుకునే వ్యక్తులు ఉంటే, వాళ్లు దేన్ని తాకితే అలా చేస్తున్నారో కనిపెట్టి, అదే పనిని మళ్లీ మళ్లీ చేయించి, చేతులు కడుక్కోవలసిన అవసరం లేదని నమ్మకం కలిగిస్తారు. ఈ థెరపీలలో చేసే పనులు, వ్యసనాలు, అలవాట్లు, వాటిని ఎందుకు అలవరుచుకున్నారు? అందువల్ల ఉపయోగం ఉందా? తమతోపాటు, కుటుంబసభ్యులకు, ఎదుటివారికి ఎంత ఇబ్బంది కలిగిస్తున్నారు? ఎంత సమయం వృథా చేస్తున్నారు? అనే విషయాలను చర్చించి, వారంతట వారే తమ సమస్యను అధిగమించగలిగే మానసిక స్థైర్యాన్ని అందిస్తారు. దాంతో ఆత్మన్యూనత తొలగి తమ సమస్యను సమూలంగా అర్థం చేసుకుని ఓసిడి నుంచి బయటపడతారు.

Updated Date - 2023-09-25T23:31:25+05:30 IST