UK: బ్రిటన్‌లో బీచ్‌కు వెళ్లిన హైదరాబాద్ విద్యార్థిని.. అనుమానాస్పద మృతి.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన..!
ABN , First Publish Date - 2023-04-19T08:40:51+05:30 IST
ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన హైదరాబాద్ విద్యార్థిని (Hyderabad Student) ఊహించని విధంగా ప్రమాదం బారినపడి ప్రాణాలు కోల్పోయింది.
ఎన్నారై డెస్క్: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన హైదరాబాద్ విద్యార్థిని (Hyderabad Student) ఊహించని విధంగా ప్రమాదం బారినపడి ప్రాణాలు కోల్పోయింది. సైదాబాద్ లక్ష్మీ నగర్ కాలనీకి చెందిన సాయి తేజస్వి కొమ్మరెడ్డి (Sai Tejaswi Kommareddy) యూకేలో (UK) జరిగిన ప్రమాదంలో మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయి తేజస్వి యూకేలోని క్రాన్ఫీల్డ్ యూనివర్సిటీలో (Cranfield University) ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చదువుతోంది. ఆమె ఏప్రిల్ 11న బ్రైటన్ బీచ్ (Brighton Beach) వద్ద ఒక్కసారిగా ఎగిసిపడిన అలలలో చిక్కుకుని చనిపోయింది. ప్రస్తుతం ఆమె మృతదేహం బ్రిటన్ (Britain) ఆసుపత్రిలోనే ఉంది.
సాయి తేజస్విని లాంగ్ వీకెండ్‌కి బీచ్‌కు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, సాయి తేజస్విని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో సాయి తేజస్వినితో ఎవరున్నారు? అసలు ఆమెకు ఈత రాదా? అని వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడి దర్యాప్తు ప్రక్రియను పూర్తి చేసి ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Minister Kishan Reddy) ప్రత్యేక చొరవ చూపిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.