International Mother Language Day: మాతృభాష మన అమ్మభాష..!
ABN , First Publish Date - 2023-02-21T09:57:19+05:30 IST
ఇంట్లో పెద్దలు మాట్లాడే మాటలనే పిల్లలు అనుసరిస్తారు కానీ, ప్రత్యేకంగా వారు నేర్పనిదే పిల్లలకు మాతృభాష వచ్చే అవకాశం లేదు.
పుట్టి పెరిగి పెద్దవారమై, మన గడ్డను మరిచిపోనట్టే మాతృభాషనూ మరిచిపోకూడదు. అమ్మను ఆకలని అడిగే ప్రతి బిడ్డకూ మాతృభాషే మొదట నేర్చుకునే భాష. తల్లి ఒడే బిడ్డకు తొలి బడి. నీతిగా, నిజాయితీగా నడవడికను తీర్చి దిద్దేది కూడా మన మాతృభాషే..అన్యభాషలు ఎన్ని ఉన్నా కూడా మాతృభాష తరువాతే.. ఎంత గొప్పవారమైనా తల్లిభాషను మరిచిపోవడం అంటే తల్లిపాలు తాగి ఆమె రొమ్ము మీద గుద్దినట్టే. తల్లి రుణం తీర్చుకోవడమంటే మాతృభాషను బ్రతకనీయడమే. కానీ ఇప్పుడు మాతృభషను నిజంగానే బ్రతకనిస్తున్నామా? లేదనే అంటున్నారు భాషా నిపుణులు.
విదేశీ భాషలమీద, నడవడిక మీద మోజుతో మాతృభాషను చిన్నచూపు చూస్తున్నారు తల్లిదండ్రులు. ఇదంతా గొప్ప ఉద్యోగాల్లో కుదురుకోవడానికి, ఉన్నతులమని తెలియజెప్పడానికే తప్ప మరోటి కాదు. మాతృభాషను చులకన చేసి పుట్టుకొస్తున్న పాశ్చత్య పోకడలు వినాశనానికే తప్పితే మరో దారికాదు. అయితే ఎక్కడో ఆణిముత్యాల్లా నేటి పిల్లలు పద్యాలు వల్లెవేసినా, గుక్క తిప్పుకోకుండా మన తెలుగులో మాట్లాడినా కూడా ఆనందంగా, ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాం. ఇదంతా ఎందుకంటే చక్కగా తెలుగు మాట్లాడే పిల్లలు ఇప్పుడు లేకపోవడమే. పిల్లలేం ఖర్మ తల్లిదండ్రులకే తెలుగు సరిగా మాట్లాడటం, రాయడం, చదవడం రాదు.
ఇంకా విచిత్రం ఏంటంటే..
తెలుగు సరిగా రాని వారికి అదే చదవడం రాయడం రాని వారికోసం కొన్ని రకాల వెబ్ సైట్స్ కూడా ఉన్నాయి. వారికి అందుబాటులో కథలు, జోక్స్, చిన్నచిన్న గాసిప్స్ ఇలా అన్నీ ఇంగ్లీష్ తెలుగులో ఉంటాయి. ఈ పరభాషను తప్ప మాతృభాషను చదవలేని వారు ఇలాంటి సైట్స్ మీద ఆధారపడుతున్నారు. ఇదంతా వికృతమే.
సాంకేతికాభివృద్ధి కారణంగా విదేశాల్లో అవకాశాలకోసం ఎగబడుతున్నాం. దానికి తగ్గట్టుగానే వేష, భాషలను మార్చుకుంటూ వస్తున్నాం. ఇదే నేపథ్యంలో అంతా ఇంగ్లీషు భాషను గొప్పగా భావించి దానిని నేర్చుకోవడమే గొప్పగా అనుకుంటున్నారు. తప్పితే వారి వారి మాతృ భాషను మరిచిపోతున్నారని ఆలోచించడం లేదు. ఇంట్లో పెద్దలు మాట్లాడే మాటలనే పిల్లలు అనుసరిస్తారు కానీ, ప్రత్యేకంగా వారు నేర్పనిదే పిల్లలకు మాతృభాష వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం ప్రపంచమంతా వసుధైక కుటుంబంలా తయారవుతూ, ఒకే భాషా, ఒకే సంస్కృతి అన్నట్టుగా మారుతోంది. ఈ కారణాలతో మన భాష మాత్రం మనకు దూరమవుతోంది. భాషాసంస్కృతులు ఒక దానితో ఒకటి ముడిపడి ఉంటాయి కాబట్టి మారుతోన్న మన సంస్కృతితో బాటుగా మన భాష కూడా మారుతోంది. ఒకప్పుడు భాషలో వచ్చే మార్పులకు కొన్ని తరాలు పడితే, ఈ ఆధునిక యుగంలో ఒక్క తరంలోనే ఎన్నో మార్పులను చూస్తున్నాం.
మాతృభాషా దినోత్సవం..
వారి మాతృభాషకోసం నలుగురు బెంగాలీ యువకులు ప్రాణాలర్పించారట. అందుకు గాను ఫిబ్రవరి 21వ తేదీన ఐక్యరాజ్య సమితి సాంస్కృతిక విషయాల సంస్థ యునెస్కో ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి ఈ తేదీన అంతర్జాతీయ మాతృభాషను జరుపుకుంటున్నాం.
'దేశ భాషలందు తెలుగు లెస్స'
ఈ మాట చెప్పిన కృష్ణదేవరాయలు కూడా ఇప్పటివారికి తెలియకుండా పోయే రోజులు రానున్నాయా? గొప్పతనం, మాధుర్యం, మమకారం కలగలిపిన మాతృభాషమీద భారతీయులుగా అదీ తెలుగువారిగా పుట్టిన ప్రతివారికీ ఆప్యాయత ఉండాలి. రాబోవు తరాలకు సంపదను మూటగట్టి ఇచ్చినట్టుగా మన మాతృభాషను కానుకగా ఇవ్వాలి. ఇంగ్లీషు భాషను నేర్చుకోవడం అవసరం. అదే విజ్ఞానం అనే నిర్లక్ష్యం ఉండకూడదు. సుసంపన్నమైన మాతృభాష సౌందర్యాన్ని నేటి పౌరులంతా ఆస్వాదించాలని కోరుకుందాం.