Rajendra Prasad: ఇది సంస్కారవంతమైన కేటగిరీకి చెందిన సినిమా
ABN , First Publish Date - 2023-02-21T18:07:49+05:30 IST
ఒకప్పుడు ఇంటిల్లిపాదీ చూసే సంస్కారవంతమైన సినిమాలు చేసిన మేము.. ఈ సినిమాను కూడా అంతే సంస్కారవంతంమైన కేటగిరీ సినిమాగా రూపొందించి ప్రేక్షకుల ముందుకు
ఒకప్పుడు ఇంటిల్లిపాదీ చూసే సంస్కారవంతమైన సినిమాలు చేసిన మేము.. ఈ సినిమాను కూడా అంతే సంస్కారవంతంమైన కేటగిరీ సినిమాగా రూపొందించి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం అన్నారు నటకిరీటి రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad). యూత్, మెసేజ్, ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన స్టార్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి (SV Krishna Reddy) చాలా గ్యాప్ తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ (Organic Mama Hybrid Alludu). నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్, మీనా (Meena) ప్రధాన పాత్రల్లో కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్, కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన నిర్మిస్తున్నారు. బిగ్‌బాస్ ఫేం సోహెల్ (Sohel), మృణాళిని రవి (Mrinalini Ravi) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డి.. ఈ చిత్రానికి మాటలు కూడా రాయడం విశేషం. మార్చిలో విడుదలకు సిద్ధమౌతున్న ఈ సినిమాకు సంబంధించిన పలు విశేషాలను తెలిపేందుకు చిత్రయూనిట్ తాజాగా మీడియా సమావేశం నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘గత 46 సంవత్సరాలుగా నటుడిగా నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులు ధన్యవాదాలు. నేను ఇంతకాలం కొనసాగటానికి కారణం నేను నమ్ముకున్న కామెడీనే అని భావిస్తున్నాను. ఇటీవలే ప్రేక్షకులు ‘వాల్తేర్ వీరయ్య’ (Waltair Veerayya) వంటి హిట్ ఇచ్చారు. మాయలోడు, ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ చిత్రాలతో నా కామెడీకి బ్రాండ్ క్రియేట్ కావడంలో ముఖ్యపాత్ర వహించిన వారిలో ముఖ్యులు ఎస్.వి. కృష్ణారెడ్డిగారు. సాక్షాత్తూ నాటి ప్రధాని పీవీ నరసింహారావు (PV Narasimha Rao)గారు ‘దిస్ బాయ్ ఈజ్ స్ట్రెస్ రిలీజర్’ అన్నారంటే ఎంత గొప్ప విషయం. అలాగే ప్రఖ్యాత యూనివర్సీటీ అయిన ఆంధ్రా యూనివర్సిటీవారు 42 సంవత్సరాల వయస్సులోనే నాకు డాక్టరేట్ ఇవ్వడం మర్చిపోలేని అనుభూతి. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు అందరినీ అలరించే చిత్రాలతో విజయవిహారం చేసిన ఎస్.వి.కృష్టారెడ్డిగారు, నేను, అచ్చిరెడ్డిగారు మళ్లీ ఇంతకాలం తర్వాత కల్పన గారి నిర్మాణంలో.. కల్పన చిత్ర పతాకంపై ‘ఆర్గానిక్ మామా హైబ్రీడ్ అల్లుడు’ (Organic Mama Hybrid Alludu) తో మరో విజయ విహారానికి సిద్ధం అవుతున్నాము.
ఒకప్పుడు ఇంటిల్లిపాదీ చూసే సంస్కారవంతమైన సినిమాలు చేసిన మేము.. ఈ సినిమాను కూడా అంతే సంస్కారవంతమైన కేటగిరీ సినిమాగా రూపొందించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. ఇది వంద శాతం ఫ్యామిటీ ఎంటర్‌టైనర్. నిర్మాత కల్పన (Kalpana)గారు నాకు చిన్నతనం నుంచీ తెలుసు. వాళ్ల నాన్నగారు నిర్మాత కూడా. మీనా కెరీర్ ప్రారంభంలో నాతో చేసింది. మళ్లీ ఇంతకాలానికి మా కాంబినేషన్ కుదిరింది. ఆమెకు అనుకోని కష్టం వచ్చినా.. నిర్మాత శ్రేయస్సు కోసం వీలైనంత త్వరగా షూటింగ్‌కు హాజరైంది. పెద్ద పెద్ద ఆర్టిస్ట్‌లతో పనిచేయడం వల్ల ఆమెకు ఆ మంచి గుణం అబ్బింది. ఆమెకు ఈ సందర్భంగా బ్లెస్సింగ్స్ చెపుతున్నా. హీరో సొహైల్ తన పాత్రకు చెందిన అన్ని రసాలను అద్భుతంగా పండించాడు. సినీ పరిశ్రమలో యాక్టర్ కావటానికి నటన తెలిస్తే చాలు.. కానీ సక్సెస్‌ఫుల్ యాక్టర్ కావాలంటే తప్పకుండా క్యారెక్టర్ కావాలి. అది ఉంటే ఇక తిరుగుండదు అని ఈతరం ఆర్టిస్ట్‌లకు చెపుతున్నా. మిగిలిన ఆర్టిస్ట్‌లు కూడా వారి పరిధిలో అద్భుతంగా చేశారు. అందరూ ఈ సినిమాని థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. (Rajendra Prasad Speech)