IPL Chennai vs Lucknow : చెన్నై చమక్‌

ABN , First Publish Date - 2023-04-04T03:07:17+05:30 IST

నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సొంత మైదానంలో బరిలోకి దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ అభిమానులను మురిపించింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 57) తన అద్భుత ఫామ్‌ను చాటుకోగా.. విజయం దిశగా సాగుతున్న ప్రత్యర్థిని స్పిన్నర్‌ మొయిన్‌

IPL Chennai vs Lucknow : చెన్నై చమక్‌

పోరాడి ఓడిన లఖ్‌నవూ

రుతురాజ్‌ అర్ధ శతకం

మొయిన్‌ అలీకి 4 వికెట్లు

చెన్నై: నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సొంత మైదానంలో బరిలోకి దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ అభిమానులను మురిపించింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 57) తన అద్భుత ఫామ్‌ను చాటుకోగా.. విజయం దిశగా సాగుతున్న ప్రత్యర్థిని స్పిన్నర్‌ మొయిన్‌ అలీ (4/26) ముకుతాడు వేశాడు. దీంతో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌పై సీఎస్‌కే గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 217 పరుగులు చేసింది. కాన్వే (29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 47), రాయుడు (14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 నాటౌట్‌), దూబే (16 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లతో 27) వేగంగా ఆడారు. బిష్ణోయ్‌, ఉడ్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో లఖ్‌నవూ 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులు చేసి ఓడింది. మేయర్స్‌ (22 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 53), పూరన్‌ (18 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 32) మాత్రమే ఆకట్టుకున్నారు. తుషార్‌కు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా మొయిన్‌ అలీ నిలిచాడు.

మెరుపు ఆరంభం దక్కినా...: 218 పరుగుల భారీ ఛేదనలో లఖ్‌నవూ ఓపెనర్‌ మేయర్స్‌ కళ్లుచెదిరే షాట్లతో చెన్నైని వణికించాడు. బౌలర్‌ ఎవరైనా బాదుడే లక్ష్యంగా క్రీజులో కదిలాడు. కానీ డెత్‌ ఓవర్లలో బౌలర్లు కట్టడి చేయడంతో జట్టు భారీ షాట్లు ఆడలేకపోయింది. స్టోక్స్‌ ఓవర్‌లో మేయర్స్‌ 4,4,6తో 18 రన్స్‌ రాబట్టగా.. మూడో ఓవర్‌లో మూడు ఫోర్లు సాధించాడు. ఇక ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లో తుషార్‌ 3 వైడ్లు, 3 నోబ్‌లు వేయగా అటు మేయర్స్‌ 4,6 కూడా బాదడంతో 18 పరుగులు వచ్చాయి. దీంతో కేవలం 21 బంతుల్లోనే తను ఫిఫ్టీ పూర్తి చేశాడు. అతడి ధాటికి ఎల్‌ఎస్‌జీ 80 రన్స్‌తో తమ అత్యధిక పవర్‌ప్లే స్కోరును సైతం సాధించింది. అంతా సజావుగా సాగుతుందనుకున్న వేళ స్పిన్నర్‌ మొయిన్‌ అలీ గట్టి షాక్‌ ఇచ్చాడు. వరుస ఓవర్లలో మేయర్స్‌, రాహుల్‌ (20), క్రునాల్‌ (9), స్టొయినిస్‌ (21)ల వికెట్లు తీసి చెన్నైకి ఊరటనిచ్చాడు. హుడా (2)ను శాంట్నర్‌ అవుట్‌ చేశాడు. అయితే పూరన్‌ మాత్రం తన భారీ షాట్లతో బెంబేలెత్తించాడు. 12వ ఓవర్‌లో 6,4,4.. 15వ ఓవర్‌లో 6,6తో స్కోరును పెంచే ప్రయత్నం చేశాడు. దీంతో స్కోరు 15 ఓవర్లలో 150కి చేరింది. అయితే తర్వాతి ఓవర్‌లోనే పూరన్‌ను తుషార్‌ అవుట్‌ చేయడంతో ఉత్కంఠ పెరిగింది. చివర్లో బదోని (23), గౌతమ్‌ (17 నాటౌట్‌) విజయం కోసం శాయశక్తులా ప్రయత్నించారు. కానీ బౌండరీలు కరువవడంతో ఓటమి తప్పలేదు.

ఓపెనర్ల శతక భాగస్వామ్యం: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఇన్నింగ్స్‌ రాకెట్‌ వేగంతో దూసుకెళ్లింది. ఓపెనర్లు రుతురాజ్‌, కాన్వే అదిరిపోయే ఆరంభాన్ని అందించగా.. మిగతా బ్యాటర్లు కూడా వేగం కనబరిచారు. ముఖ్యంగా రుతురాజ్‌ తన సూపర్‌ ఫామ్‌ను ఈ మ్యాచ్‌లోనూ ప్రదర్శించాడు. ఐదో ఓవర్‌లో తను 3 సిక్సర్లు బాది 20 పరుగులు రాబట్టాడు. అలాగే ఆరో ఓవర్‌లో కాన్వే మూడు ఫోర్లు, గైక్వాడ్‌ ఓ సిక్సర్‌తో 19 పరుగులు వచ్చాయి. దీంతో పవర్‌ప్లేలోనే సీఎస్‌కే 79 రన్స్‌తో అత్యంత పటిష్ఠంగా కనిపించింది. చెపాక్‌ మైదానంలో ఈ జట్టుకిదే అత్యఽధికం కావడం విశేషం. ఆ తర్వాత ఎనిమిదో ఓవర్‌లో కాన్వే రెండు సిక్సర్లతో 15 రన్స్‌ సాధించగా, అటు రుతురాజ్‌ 25 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఈ జోడీ జోరుకు 9 ఓవర్లలో స్కోరు 110కి చేరింది. ఈ దశలో స్పిన్నర్‌ బిష్ణోయ్‌ లఖ్‌నవూ జట్టుకు బ్రేక్‌ ఇచ్చాడు. దూకుడు మీదున్న రుతురాజ్‌ను పదో ఓవర్‌ తొలి బంతికే అవుట్‌ చేశాడు. లెంగ్త్‌ బాల్‌ను తను స్లాగ్‌ స్వీప్‌ ఆడబోగా బంతి ఎడ్జ్‌ తీసుకోవడంతో ఉడ్‌ అద్భుత క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో తొలి వికెట్‌కు 55 బంతుల్లోనే 110 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరుసటి ఓవర్‌లో కాన్వేను ఉడ్‌ అవుట్‌ చేసి ఆనందం రెట్టింపు చేశాడు. అయితే ఉన్న కాసేపు దూబే మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో చెలరేగగా.. మొయిన్‌ అలీ (19) హ్యాట్రిక్‌ ఫోర్లతో కదం తొక్కాడు. అయితే ఈ ఇద్దరినీ వరుస ఓవర్లలో బిష్ణోయ్‌ పెవిలియన్‌కు చేర్చాడు. స్టోక్స్‌ (8) మరోసారి నిరాశపర్చగా.. రాయుడు 18వ ఓవర్‌లో రెండు సిక్సర్లతో మెరిశాడు. ఇక ఆఖరి ఓవర్‌ తొలి బంతికి జడేజా (3) అవుట్‌ కాగానే చెపాక్‌ హోరెత్తిపోయింది. ధోనీ క్రీజులోకి రావడమే దీనికి కారణం. ఎదుర్కొన్న తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి వారి జోష్‌ను మరింత రెట్టింపు చేశాడు. అయితే మరో భారీ షాట్‌కు యత్నించి క్యాచ్‌ అవుటయ్యాడు.

1 సీఎస్‌కే తరఫున ఎక్కువ (3) శతక భాగస్వామ్యాలు అందించిన ఓపెనింగ్‌ జోడీగా రుతురాజ్‌-కాన్వే

2 పవర్‌ప్లేలో రెండు జట్ల నుంచి ఎక్కువ పరుగులు (సీఎస్‌కే 79, లఖ్‌నవూ 80) రావడం ఇది రెండోసారి. 2014లో పంజాబ్‌ (70), చెన్నై (100) అత్యధిక పరుగులు సాధించాయి.

7 ఐపీఎల్‌లో 5 వేల పరుగులు పూర్తి చేసిన ఏడో బ్యాటర్‌గా ధోనీ.

స్కోరుబోర్డు

చెన్నై సూపర్‌ కింగ్స్‌: రుతురాజ్‌ గైక్వాడ్‌ (సి) ఉడ్‌ (బి) బిష్ణోయ్‌ 57, కాన్వే (సి) క్రునాల్‌ (బి) ఉడ్‌ 47, దూబే (సి) ఉడ్‌ (బి) బిష్ణోయ్‌ 27, మొయిన్‌ అలీ (స్టంప్డ్‌) పూరన్‌ (బి) బిష్ణోయ్‌ 19, బెన్‌ స్టోక్స్‌ (సి) యశ్‌ (బి) అవేశ్‌ 8, రాయుడు (నాటౌట్‌) 27, జడేజా (సి) బిష్ణోయ్‌ (బి) ఉడ్‌ 3, ధోనీ (సి) బిష్ణోయ్‌ (బి) ఉడ్‌ 12, శాంట్నర్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 16, మొత్తం: 20 ఓవర్లలో 217/7; వికెట్లపతనం : 1/110, 2/118, 3/150, 4/166, 5/178, 6/203, 7/215; బౌలింగ్‌: మేయర్స్‌ 2-0-16-0, అవేశ్‌ 3-0-39-1, క్రునాల్‌ 2-0-21-0, గౌతమ్‌ 1-0-20-0, మార్క్‌ ఉడ్‌ 4-0-49-3, యశ్‌ ఠాగూర్‌ 4-0-36-0, రవి బిష్ణోయ్‌ 4-0-28-3.

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌: కేఎల్‌ రాహుల్‌ (సి) రుతురాజ్‌ (బి) మొయిన్‌ 20, మేయర్స్‌ (సి) కాన్వే (బి) మొయిన్‌ 53, హూడా (సి) స్టోక్స్‌ (బి) శాంట్నర్‌ 2, క్రునాల్‌ (సి) జడేజా (బి) మొయిన్‌ 9, స్టొయినిస్‌ (బి) మొయిన్‌ 21, పూరన్‌ (సి) స్టోక్స్‌ (బి) తుషార్‌ 32, బదోనీ (సి) ధోనీ (బి) తుషార్‌ 23, గౌతమ్‌ (నాటౌట్‌) 17, ఉడ్‌ (నాటౌట్‌) 10, ఎక్స్‌ట్రాలు:18, మొత్తం: 20 ఓవర్లలో 205/7; వికెట్లపతనం: 1/79, 2/82, 3/82, 4/105, 5/130, 6/156, 7/195; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-55-0, స్టోక్స్‌ 1-0-18-0, తుషార్‌ దేశ్‌పాండే 4-0-45-2, మొయిన్‌ అలీ 4-0-26-4, శాంట్నర్‌ 4-0-21-1, రాజ్‌వర్ధన్‌ హంగార్గేకర్‌ 2-0-24-0, జడేజా 1-0-14-0.

Updated Date - 2023-04-04T03:07:18+05:30 IST