Share News

Bhuvneshwar Kumar: 5 వికెట్లతో చెలరేగిన టీమిండియా సీనియర్ పేసర్.. జట్టులోకి రీఎంట్రీ ఇస్తాడా?..

ABN , First Publish Date - 2023-10-25T15:14:30+05:30 IST

టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చెలరేగాడు. ఏకంగా 5 వికెట్లు తీసి ప్రత్యర్థి నడ్డి విరిచాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫి 2023లో భాగంగా బుధవారం ఉత్తరప్రదేశ్, కర్ణాటక జట్లు తలపడ్డాయి.

Bhuvneshwar Kumar: 5 వికెట్లతో చెలరేగిన టీమిండియా సీనియర్ పేసర్.. జట్టులోకి రీఎంట్రీ ఇస్తాడా?..

డెహ్రాడూన్: టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చెలరేగాడు. ఏకంగా 5 వికెట్లు తీసి ప్రత్యర్థి నడ్డి విరిచాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫి 2023లో భాగంగా బుధవారం ఉత్తరప్రదేశ్, కర్ణాటక జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో 33 ఏళ్ల భువి ఉత్తరప్రదేశ్ తరఫున బరిలోకి దిగాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఉత్తరప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. గోస్వామి 77 పరుగులతో చెలరేగాడు. అనంతరం 197 పరుగులతో బరిలోకి దిగిన కర్ణాటక ఒకానొక దశలో మంచి స్థితిలోనే ఉంది. ఆ జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్(59) హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే 12.3 ఓవర్లలో 113/5తో ఉన్న సమయంలో భువనేశ్వర్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. వరుసగా వికెట్లు తీసిన భువి కర్ణాటకను కుప్పకూల్చాడు. మిగతా 5 వికెట్లను అతనే తీశాడు. ముఖ్యంగా భువి వేసిన 17వ ఓవర్‌తో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ ఓవర్లో 4 బంతుల వ్యవధిలోనే 3 వికెట్లు తీశాడు. ఆ వెంటనే 19వ ఓవర్లో మిగతా రెండు వికెట్లు తీశాడు. దీంతో కర్ణాటక జట్టు 156 పరుగులకే ఆలౌటైంది.


చాలా రోజుల తర్వాత ఐదు వికెట్లతో చెలరేగిన భువనేశ్వరు కుమార్ ఏకంగా ముగ్గురు బ్యాటర్లను క్లీన్ బౌల్డ్ చేశాడు. అందులో ఇద్దరు డకౌట్ కావడం గమనార్హం. భువి సూపర్ బౌలింగ్‌తో ఈ మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ జట్టు 40 పరుగుల తేడాతో గెలిచింది. 16 పరుగులు మాత్రమే ఇచ్చిన వి 5 వికెట్లతో సత్తా చాటాడు. కాగా భువనేశ్వర్ కుమార్ చివరగా 2022లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత కుర్రాళ్లు దూసుకురావడంతో జట్టులో చోటు కోల్పోయాడు. దీంతో దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో సత్తా చాటుతున్నప్పటికీ జట్టులో చోటు దక్కడం లేదు. భువనేశ్వర్ కుమార్ అభిమానులు మాత్రం ఈ ప్రదర్శనను చూసైనా అతడిని సెలెక్టర్లు తిరిగి జట్టులోకి ఎంపిక చేయాలని ఆశిస్తున్నారు.

Updated Date - 2023-10-25T15:14:30+05:30 IST